రక్షణ రంగంలో అగ్రదేశాల సరసన భారత్

రక్షణ రంగంలో ఎన్నో విషయాల్లో అగ్రదేశాల సరసన నిలిచిందని డీఆర్‌డీఓ చైర్మన్‌, కేంద్ర రక్షణ పరిశోధన, అభివృద్ధి శాఖ కార్యదర్శి జీ సతీశ్‌రెడ్డి తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ 81వ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ అయితే ఆయా రంగాలలో మరింత వృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

మేక్‌ ఇన్‌ ఇండియా స్ఫూర్తితో దేశంలో రక్షణ రంగ ఎగుమతులు పెరిగాయని చెప్పారు. యూనివర్సిటీలలో లోతైన పరిశోధనలు జరగాలని, అందుకు విద్యార్థులను సన్నద్ధం చేయాల్సిన బాధ్యత అధ్యాపకులపైనే ఉందని సతీష్ రెడ్డి స్పష్టం చేశారు. 

దేశం ఇప్పటికే శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిందని చెబుతూ మన దేశంలో ఉత్పత్తి చేసే వస్తువులు ఏ దేశంలోనైనా అమ్మగలిగేలా ఉండాలని ఆయన సూచించారు. దీంతో విదేశీ మారకద్రవ్యం సైతం పెరుగుతుందని చెప్పారు. తక్కువ ధరలో నాణ్యమైన నూతన ఆవిష్కరణలు జరిగినప్పుడే అది సాధ్యపడుతుందని ఆయన వివరించారు.

దేశ విద్యారంగంలో ఓయూ సమున్నత స్థానాన్ని కలిగి ఉందని పేర్కొంటూ ఎంతో మంది ఓయూలో చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరారని గుర్తు చేశారు. తనకు 1986 నుంచి ఓయూతో అనుబంధం ఉందని.. పరిశోధనల నిమిత్తం వర్సిటీలోని నావిగేషన్‌ ఎలక్ట్రానిక్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ యూనిట్‌ (ఎన్‌ఈఆర్‌టీయూ)కు క్రమం తప్పకుండా వచ్చేవాడినని ఆయన గుర్తు చేసుకున్నారు.

సవాళ్లను ఎదుర్కొంటూ.. కలలను సాకారం చేసుకునేందుకు విద్యార్థులు శ్రమించాలని.. అప్పుడే విజేతలుగా నిలుస్తారని వర్సిటీ చాన్సలర్‌ హోదాలో అధ్యక్షత వహించిన  గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకునే క్రమంలో ఆరోగ్యం, సంతోషాల వషయంలో రాజీపడొద్దని సూచించారు. చిన్న, 

చిన్న సమస్యలకు కుంగిపోకూడదని, విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై కృషి చేయాలని సూచించారు. దేశం అన్ని రంగాల్లో పురోగమించేందుకు నూతన ఆవిష్కరణలు కీలకమని ఆమె పేర్కొన్నారు. శతవసంతాల వర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించడం గర్వించదగిన విషయమని కొనియాడుతూ వారంతా తిరిగి వర్సిటీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.

 రెండేళ్ల విరామం అనంతరం స్నాతకోత్సవం జరుగుతుండడంతో 2018-2019, 2019-2020 విద్యా సంవత్సరాలకు సంబంధించిన విద్యార్థులకు బంగారు పతకాలు, పీహెచ్‌డీ పట్టాలను ఈ సందర్భంగా ప్రదానం చేశారు. పీహెచ్‌డీ పూర్తి చేసిన 319 మందికి పట్టాలను ప్రదానం చేశారు.