బీజేపీలో వీవీఎస్ లక్ష్మణ్ చేరేందుకు రంగం సిద్ధం!

భారత క్రికెట్ చరిత్రలో మరుపురాని విజయాలెన్నింటినో మనకందించిన వీవీఎస్ లక్ష్మణ్  గా పేరొందిన వంగీపురపు వెంకట సాయి లక్ష్మణ్ బీజేపీలో చేరడం ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి రంగం సిద్దమైన్నట్లు తెలుస్తున్నది. 2023లో తెలంగాణాలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్న బిజెపి పలువురు సెలెబ్రెటీ లను ఆకర్షించే ప్రయత్నం కూడా జరుగుతున్నది.

ఇప్పటికే లక్ష్మణ్ పలువురు బిజెపి నేతలతో భేటీలు జరిపినట్లు చెబుతున్నారు.  తాను పుట్టిపెరిగిన హైదరాబాద్ గడ్డపై క్రీడా, సామాజిక రంగాల్లో విశేష సేవలందిస్తోన్న లక్ష్మణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా సిద్ధం అవుతున్నారు. హైదరాబాద్ నగరంలోని ఏదో ఒక నియోజకవర్గం నుండి పోటీచేసే అవకాశం ఉంది. 

త్వరలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరవచ్చని చెబుతున్నారు.  ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ వ్యాఖ్యాతగా దుబాయ్‌లో వీవీఎస్ లక్ష్మణ్ ఉన్నారు. మరోవైపు ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురు క్రికెటర్లు బీజేపీలో ఉన్నారు.

2012లో అంతర్జాతీయ క్రికెట్‌ కు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత ఐపీఎల్‌ టోర్నీలో డెక్కన్‌ చార్జెస్‌ కు కెప్టెన్‌ గా వ్యవహరించాడు. వయసు మీద పడుతుండటంతో ప్రస్తుతం హైదరాబాద్ సన్‌ రైజర్స్‌ జట్టుకు మెంటర్‌ గా కొనసాగుతున్నాడు. 

ఆటగాడిగా రిటైరైన తర్వాత హైదరాబాద్ సిటీలోనే అకాడమీ స్థాపించిన లక్ష్మణ్ పేద పిల్లలకూ క్రికెట్ లో శిక్షణ ఇస్తున్నాడు. పదుల కొద్దీ స్వచ్ఛంద సంస్థలకు అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న లక్ష్మణ్ సామాజిక సేవలోనూ అగ్రభాగన ఉన్నారు. వీవీఎస్ ఫౌండేషన్ పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.