ఇక చేనేతలో కాటన్‌ జీన్స్‌ తయారీ

ఇక జీన్స్‌ కొత్త రూపం సంతరించుకోనుంది. ఇప్పటి వరకు ట్రెండ్‌ వస్త్రాలు అనగానే మొదట గుర్తుకు వచ్చేది జీన్స్‌. ఫ్యాషన్‌ ప్రపంచానికి పరిచయమున్న ఈ వస్త్రం… చేనేతలు చేయగల వలువగా వచ్చేస్తోంది. 

అసలుకు తీసిపోని విధంగా రూపుదిద్దుకుంటున్న ఈ వస్త్రాన్ని హన్మకొండ జిల్లా కమలాపురం చేనేత సంఘానికి చెందిన నేతన్నలు మగ్గంపై నేశారు. రాష్ట్ర చేనేత ఔళి శాఖ దృష్టిలో పడటంతో.. ప్రొడక్ట్‌ డైవర్సిఫికేషన్‌ (ఉత్పత్తి వైవిధ్యం) ప్రోత్సహించి నిపుణులతో శిక్షణ ఇప్పిస్తోంది. 

నిజాం కాలంలో సంపన్న కుటుంబీకులు ధరించే హిమ్రూ నమూనా దుస్తులు, చీరలు నేసి గత సంవత్సరం పురస్కారాలు సైతం అందుకున్నారు ఈ చేనేత సంఘం వారు. మార్కెట్‌లో ఎప్పుడూ గిరాకీ ఉన్న జీన్స్‌ వస్త్రాన్ని నేయడం నేర్చుకున్నారు. 

చేనేతలు నేస్తున్న జీన్స్‌ గురించి తెలుసుకున్న పలు వస్త్ర దుకాణాలు .. ప్రత్యేకంగా ఆర్డర్‌ ఇస్తున్నారు. హన్మకొండ చేనేత జౌళి శాఖ అధికారి రవీందర్‌ మాట్లాడుతూ.. అది అచ్చమైన కాటన్‌ జీన్స్‌ అని, ధరించేందుకు ఎంతో అనువుగా ఉంటుందని అన్నారు. మీ.300 చొప్పున అనేక ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు.