ఏదో ఒక రోజు జమ్ముకశ్మీర్‌లో పీవోకే కలుస్తుంది

ఏదో ఒక రోజు పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) జమ్ముకశ్మీర్‌లో కలుస్తుందని భారత వాయుసేనకు చెందిన ఉన్నత అధికారి ఒకరు భరోసా వ్యక్తం చేశారు. 1947 అక్టోబర్‌ 27న కశ్మీర్ లోయలో పాకిస్థాన్‌ దాడిని భారత సాయుధ బలగాలు తిప్పికొట్టాయి. స్వతంత్ర భారత మొదటి సైనిక సంఘటనను గుర్తుచేసుకుంటూ బుధవారం దేశవ్యాప్తంగా 75వ పదాతిదళ దినోత్సవాన్ని నిర్వహించారు. 

ఈ సందర్భంగా వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ ఏఓసీ-ఇన్-సీ ఎయిర్ మార్షల్ అమిత్ దేవ్ మాట్లాడుతూ  పాక్ ఆక్రమిత కశ్మీర్ ఏదో ఒక రోజు భారత్‌లో భాగమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 1947లో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోకపోతే కశ్మీర్ మొత్తం మనదే అయి ఉండేదని స్పష్టం చేశారు.

‘ఈ చారిత్రాత్మక నేపథ్యం, బుద్గామ్ ల్యాండింగ్‌కు 75 ఏండ్లు. ఇన్‌స్ట్రూమెంట్ ఆఫ్ యాక్సెషన్ సంతకం చేసిన తర్వాత, మేము మా దళాలను త్వరగా తరలించాము. శ్రీనగర్ ఎయిర్‌ఫీల్డ్‌ను రక్షించాము. ఆ తర్వాత మేము మరింత దాడి చేసి ఉండేవాళ్లం. కబలీస్‌ వరకు వచ్చిన పాకిస్థాన్‌ మిలిటరీని మరింత వెనక్కి నెట్టి ఉండేవాళ్లం. ఐరాస జోక్యం చేసుకోకుంటే, కశ్మీర్ మొత్తం మనదే అయి ఉండేది. ఇది నాకు ఖచ్చితంగా తెలుసు’ అని పేర్కొన్నారు.

బుద్గామ్‌లో ఐఏఎఫ్‌, సైన్యం పాల్గొనడం మాత్రమే కాదు, పీవోకే స్వేచ్ఛ కోసం అనేక చిన్న మిషన్లు కూడా జరిగాయని అమిత్‌ దేవ్‌ తెలిపారు. ‘ఏదో ఒక రోజు కశ్మీర్‌ భాగంలో పీవోకే చేరుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. రాబోయే సంవత్సరాల్లో మనకు మొత్తం కశ్మీర్ ఉంటుంది’ అని ధీమా వ్యక్తం చేశారు. 

అయితే దానిని మన సొంతం చేసుకునేందుకు ప్రస్తుతానికి ఎటువంటి ప్రణాళిక లేదని ఆయన చెప్పారు. పాక్ ఆక్రమిత కశ్మీరులోని ప్రజలను పాకిస్థానీలు న్యాయంగా చూడటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీరు అంతా ఒకటేనని, దేశం ఒకటేనని స్పష్టం చేస్తూ ఇరువైపుల ప్రజలకు ఉమ్మడి అనుబంధాలు ఉన్నాయని చెప్పారు.