పరిపాలనా దక్షతలో మోదీని మించిన వారేలేరు

స్వాతంత్య్ర భారతంలో అత్యంత విజయవంతమైన పరిపాలనవేత్తగా ప్రధాని మోదీ నిలిచారని పేర్కొంటూ దేశం ఇటువంటి నేతను ఇప్పటివరకూ చూడలేదని హోమ్ మంత్రి అమిత్ షా కొనియాడారు. ‘ప్రజాస్వామికత : ప్రభుత్వాధినేతగా నరేంద్ర మోదీ రెండు దశాబ్దాల హయాం’ అనే అంశంపై రాంభావు మహాగి ప్రబోధిని ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సదస్సులో అమిత్ షా ప్రసంగీస్తూ భారతదేశాన్ని ప్రధాని మోదీ  విభిన్న దశకు తీసుకువెళ్లారని ప్రశంసించారు. 
 
పేదరిక నిర్మూలన, ఆర్థికాభివృద్ధి, జాతీయ భద్రత, విదేశాంగ విధానాల వంటి పలు అంశాలలో పలు సత్ఫలితాలు ఇచ్చిందని అమిత్ షా తెలిపారు. సమగ్ర ప్రణాళికలతో దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడం కార్యదక్షతతోనే సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. ఈ విధంగా ఈ కోణంలో ప్రధాని మోదీ  ఉత్తమ పరిపాలనదక్షులు అని ఆయనతెలిపారు. జాతీయ భద్రతను, ప్రగతిని సమన్వయపర్చుకుంటూ సాగడం కీలకం అని పేర్కొన్నారు. 
మోదీ  రెండు దశాబ్దాల క్రితం గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనకు పరిపాలనా వ్యవహారాల గత అనుభవం లేదని, అయితే ఆ దశలో ఆయన పలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూ కూడా పరిపాలనను సవ్యంగా పరగులు పెట్టించారని గుర్తు చేశారు. ఇక కేంద్రంలో ఆయన ప్రధాని పదవికి వచ్చిన దశలో పరిస్థితి గందరగోళంగా ఉండేదని చెప్పారు.
2014లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని చోట్లా విధాన లోపాలు, అచేతనావస్థలు ఉండేవని తెలిపారు. అప్పట్లో ప్రతి మంత్రి తనకు తాను ప్రధానిగా భావించుకునే వారు. ఈ దశలో అసలు ప్రధానిని ప్రధానిగా పరిగణించేవారు కాదని ఎద్దేవా చేశారు.  కాంగ్రెస్ హయాంలో దేశానికి జాతీయ భద్రతా విధానం లేదు. ఇక పలు కుంభకోణాలతో భారత్ ప్రతిష్ట అంతర్జాతీయగా దిగజారిందని అమిత్ షా పేర్కొన్నారు.
అప్పట్లో దాదాపుగా రూ 12 లక్షల కోట్ల మేర స్కామ్‌లు జరిగాయి. అవినీతిభరిత అధికారిక వ్యవస్థతో విధానాలు కార్యాచరణ లేక కుంటుపడ్డాయని ఆయన చెప్పారు. ఓ దశలో సర్కారు తీరు తెన్నులతో ఇక ప్రజాస్వామ్యం పతనం చెందుతుందా? అనే భావన తలెత్తిందని అమిత్ షా విశ్లేషించారు. అయితే ప్రధాని మోదీ  అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలలో కూడా నమ్మకం ఏర్పడిందని తెలిపారు.
ఇక పరిస్థితులు మారుతాయనే ఆశ తలెత్తింది. వ్యవస్థ కుదుటపడుతుందనే భావన నెలకొందని, వీటిని ప్రధాని మోదీ నిజం చేశారని చెప్పారు. భారతదేశం సమస్యలు కేవలం పాలనా సంబంధితం లేదా ఆర్థిక సంబంధాలు అనుకుంటే పొరపాటే అవుతుంది. ఇవి సవ్యంగా ఉండాల్సిందే అని తెలిపారు.
అయితే అన్నింటికి మించి ఉండాల్సింది దేశ గౌరవం కాపాడటం అని, దేశ సంస్కృతి వ్యవహారాలను నిలబెట్టడం, మన భద్రతా పటిష్టతను పెంచడం అని , దేశం కోసం ఎవరేమి చేశారనేది ఈ కోణం నుంచి చూడాల్సి ఉందని ఆయన సూచించారు. ప్రగతి, వారసత్వ క్రమం, భద్రత వంటివి సమన్వయపర్చుకుంటూ అంతర్లీనంగా దేశ గౌరవాన్ని పెంపొందింపచేసే క్రమం కీలకం అని చెప్పారు.
ఇందుకు ఇంతకుముందు కన్నా భిన్నమైన దృక్పథం, ఆచరణ అవసరం అని, ఇది కేవలం ప్రజాదరణగల నేతతోనే సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. నేలపై క్షేత్రస్థాయి వేళ్లతో ముడివడి ఉన్న నేత, పేదల బాధల ఆకళింపు గల నేత అయి ఉండాలి. అత్యంత నిరుపేదలు కూడా ప్రగతి ఫలాలను పొందగల్గాలని అమిత్ షా పేర్కొన్నారు.
ఏ దశలోనూ దేశ జాతీయ భద్రతా వ్యవస్థపై ప్రజల విశ్వాసం సడలిపోరాదని ఆయన స్పష్టం చేశారు. అణగారిన వర్గాలలో అట్టడుగు స్థాయి వారు కూడా కూడా గుండెమీద చేయివేసుకుని చింతలులేని స్థితిని కల్పించే స్థాయి గల వాడే నిజమైన నాయకుడు అవుతారనితెలిపారు. ఇప్పటికీ ప్రధాని మోదీ  తనను తాను ప్రధాన సేవక్ అని తెలుపుతూ ఉంటారని గుర్తు చేశారు.
గత ఏడేళ్లలో ప్రధాని తీసుకుంటూ వచ్చిన వరసక్రమపు కీలక నిర్ణయాలను అమిత్ షా ప్రస్తావిస్తూ పెద్దనోట్ల రద్దు, ట్రిపుల్ తలాఖ్ వ్యతిరేక చట్టం, వంటి పలు అంశాలు ఉన్నాయని, అనేకం పార్టీ ప్రయోజనాలకు కూడా రిస్క్ స్థాయిలో ఉన్నవే అని తెలిపారు.  అయితే కీలక నిర్ణయాలను ప్రజలు బలపర్చారని , ప్రధాని వెంట నిలిచారని ఆయన పేర్కొన్నారు.
అంతా వీటిని ప్రధాని తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు అనుకోవచ్చని చెప్పారు. ఆయనకున్నా ముందు దేశానికి సరైన భద్రతా విధానం లేదని, ఇది ఎప్పుడూ విదేశాంగ విధానాలకు అనుగుణంగా ఉంటూ నీలినీడలు పర్చుకుని ఉండేదని గుర్తు చేశారు.  ప్రధాని మోదీ  అత్యంత స్పష్టమైన రీతిలో జాతీయ భద్రతా విధానంను విదేశాంగ విధానం నుంచి విడగొట్టారని చెప్పారు.
భారత్ స్నేహానికి విలువ ఇస్తుంది. అయితే దేశ సార్వభౌమాధికారంపై జరిగే ఎటువంటి అతిక్రమణను అయినా సహించేది లేదని అమిత్ షా స్పష్టం చేశారు. ఇతర దేశాలతో స్నేహాన్ని ఈ ప్రత్యేక అంశం పరిధిలోనే చూస్తుందని తన కార్యాచరణతో ప్రధాని రుజువు చేశారని కొనియాడారు. విద్యా వాణిజ్య వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాలు కీలకమైనవి, విజయవంతం అయ్యాయని తెలిపారు.