అమరీందర్ కొత్త పార్టీ…. రేపే అమిత్ షా తో భేటీ 

కొత్త పార్టీ పెడుతున్నట్లు, రాష్ట్రాభివృద్ధి కోసం.. బిజెపితో సీట్ల సర్దుబాటు చేసుకోనున్నట్లు పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించారు. మరోవంక,  వ్యవసాయ చట్టాల విషయంలో, రైతుల ఉద్యమాన్ని ముగింపచేసే విషయమై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో గురువారం భేటీ అయి చర్చించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కెప్టెన్‌ వెంట 20-25 మంది ప్రతినిధుల బృందం కూడా ఉండనున్నది.

రైతుల ఆందోళనను ముగించి క్రెడిట్‌ కొట్టేయడం ద్వారా పంజాబ్‌ ఎన్నికల్లో కీలక వ్యక్తిగా మారాలన్నది కెప్టెన్‌ ప్రణాళికగా కనిపిస్తున్నది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత పార్టీ అభ్యర్థులను రంగంలోకి దింపి తద్వారా కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాలన్నది కెప్టెన్‌ ఎత్తుగడగా కనిపిస్తున్నది.

ఇందుకు అమిత్‌షా సాయం తీసుకుంటున్నట్లుగా కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి పదవిని వీడిన తర్వాత అమిత్‌షాతో ఇప్పటికే కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ భేటీ అయ్యారు. త్వరలో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ మీడియా ఎదుట ప్రకటించారు. అయితే, పార్టీ పేరు, గుర్తుకు సంబంధించిన విషయాలు తర్వాత వెల్లడిస్తానని చెప్పారు.

ఇందుకోసం ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేసి, క్లియరెన్స్ వచ్చిన తర్వాత పేరు, ఎన్నికల గుర్తు గురించి చెప్తానని పేర్కొన్నారు.  2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మొత్తం 117 స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు. ఇందుకోసం ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటాం, లేదంటే సొంత పార్టీ ప్రాతిపదికన తామే పోటీ పడతామని ప్రకటించారు.

సిద్ధూ పోటీ చేసే అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలిపి ఓడించేందుకు ప్లాన్‌ చేస్తామని చెప్పారు. సిద్ధూ సీన్‌లోకి వచ్చాక కాంగ్రెస్‌కు ఆదరణ 24 శాతం తగ్గిపోయిందని కెప్టెన్‌ ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో తానిచ్చిన అన్ని హామీలను పూర్తి చేశానని చెప్పారు.కాగా, కెప్టెన్ పెట్టబోయే కొత్త పార్టీకి ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’ అనే పేరు పెడుతున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.