హుజురాబాద్ లో టీఆర్‌ఎస్ ను వణికిస్తున్న రెండు గుర్తులు!

ముఖ్యమంత్రి కేసీఆర్ పైననే తిరుగుబాటు చేసి, పార్టీ నుండి వెళ్ళిపోయి, బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను ఏవిధంగానైనా ఓడించాలని గతంలో ఎక్కడ చేయని విధంగా అన్ని రకాల ఎత్తుగడలను ప్రదర్శిస్తున్న టీఆర్‌ఎస్ కు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారి కేటాయించిన గుర్తులు  వణుకు పుట్టిస్తున్నాయి. 
 
 హుజురాబాద్‌లో మొత్తం 42 మంది నామినేషన్లు దాఖలు చేయగా అందులో 12 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో 30 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికల గుర్తులున్నాయి. మిలిగిన స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. ఇందులో ఒకరికి రోడ్డు రోలర్, మరో అభ్యర్థికి చపాతీ రోలర్ గుర్తులను ఇచ్చారు.
అప్పటి వరకు ధీమాగా ఉన్న టీఆర్‌ఎస్ శ్రేణులు ఈ రెండు గుర్తులు కేటాయించగానే ఖంగారు పడుతున్నాయి. ఎందుకంటే 2019 భువనగిరి లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌పై కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 5వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఓ ఇండిపెడెంట్ అభ్యర్థికి రోడ్డు రోలర్ గుర్తును కేటాయించారు. ఆ అభ్యర్థికి ఏకంగా 27 వేల ఓట్లు పడ్డాయి.
స్వతంత్ర అభ్యర్థి వల్లే ఓడిపోయామని టీఆర్‌ఎస్ శ్రేణులు వాపోయాయి. ఈ తర్వాత దుబ్బాకలో కూడా ఇటువంటి అనుభవం ఎదురైనది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత 1079 ఓట్ల తేడాతో ఓడి పోయారు. ఈ ఎన్నికలో ఓ స్వతంత్ర అభ్యర్థికి చపాతీ రోలర్ గుర్తును కేటాయించారు. ఆ అభ్యర్థికి 3,570 ఓట్లు వచ్చాయి. 
 
ఈ రెండు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓటమికి రోడ్డు రోలర్, చపాతీ రోలర్ కారణమయ్యాయని ఇప్పటికీ ఆ పార్టీ నేతలు విలపిస్తున్నారు. ఇప్పుడు హుజురాబాద్‌లో కూడా ఇదే దృశ్యం కనిపిస్తున్నది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులకు ఇవే గుర్తులు కేటాయించారు. ఈ రెండు గుర్తులను చూసిన టీఆర్‌ఎస్ నేతలు వణికిపోతున్నారనే ప్రచారం జరుగుతోంది.
టీఆర్‌ఎస్‌ నేతలు కుట్రలు, కుతంత్రాలు
కాగా,  హుజూరాబాద్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ నేతలు కుట్రలు, కుతంత్రాలు కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఆరోపించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలోని గూడూరు, కమలాపూర్‌ గ్రామ దళితవాడల్లో ఆయన ప్రచారం నిర్వహించారు.
 
మద్యం సీసాలతో, నోట్ల కట్టలతో ఓటర్లను టీఆర్‌ఎస్‌ నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఈటెల విమర్శించారు. అయినా, ఈనెల 30న బీజేపీకి ఓటువేసి, తనను గెలిపిస్తామని ప్రజలు చెబుతున్నారని ఈటల పేర్కొన్నారు. ఓడిపోతామనే భయంతో టీఆర్‌ఎస్‌ నేతలు తన మీద దాడి చేస్తారనే భయం తనకు ఉందని ఈటల రాజేందర్‌ చెప్పారు. సీఎం కేసీఆర్‌కు బుద్ధి చెప్పి ఆయన అహంకారాన్ని దించాలని ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు.