కూకట్‌పల్లి కోర్టులో సమంతకు ఉరట

కూకట్‌పల్లి కోర్టులో సమంతకు భారీ ఊరట లభించింది. సమంత వ్యక్తిగత వివరాలను ప్రసారం చేయడానికి వీళ్లేదని, యూట్యూబ్‌ ఛానెల్స్‌ వెంటనే అలాంటి కంటెంట్‌ని తొలగించాలని ఆదేశించింది. ఆమె వ్యక్తిగత విషయాలపై సోషల్‌ మీడియాలో పెట్టిన కామెంట్స్‌ని కూడా తొలగించాలని హితవు పలికింది. సోషల్‌ మీడియాలో తన పరువుకు నష్టం కలిగించేలా దుష్ప్రచారం చేశారంటూ సమంత దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం కూకట్‌పల్లి కోర్టు విచారించింది. 
 
ఇప్పుడు మాత్రమే కాదు.. ఇకపై కూడా ఎప్పుడూ సమంత వ్యక్తిగత, కుటుంబ విషయాల జోలికి యూట్యూబ్ ఛానల్స్ వెళ్ల‌కూడదు అని గట్టిగా చెప్పింది న్యాయస్థానం. అంతే కాదు కేవలం సమంత విషయంలోనే కాకుండా మిగిలిన వాళ్ల విషయంలో కూడా వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూడటం లాంటివి చేయకూడదు అని కోర్టు హెచ్చరించింది. తమ వ్యూస్ కోసం, పబ్లిసిటీ కోసం ఇష్టం వచ్చినట్లు కంటెంట్ పెడితే కచ్చితంగా చర్యలు తప్పవు అంటూ  స్పష్టం చేసింది.
నాగ చైతన్య, సమంత విడాకుల ప్రకటనను అధికారికంగా వెల్లడించిన తర్వాత సోషల్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఈ విడాకుల విషయంలో సమంత ది తప్పు అని.. ఆమె పిల్లలు వద్దనుకుందని కొందరు.. హెయిర్ స్టైలిస్ట్‌ జుకల్కర్‌, సమంత మధ్య ఎఫైర్ నడుస్తోందని మరికొందరు.. ఇలా ఎన్నో రకాల వార్తలు మాజీ అక్కినేని కోడలిపై సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
 
ముఖ్యంగా, తన విడాకుల విషయంలో రెండు యూట్యూబ్ ఛానళ్లు తన పరువుకు భంగం కలిగించేలా పోస్టులు పెట్టారంటూ ఆమె కూకట్‌పల్లి కోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిగత జీవితంపై లేనిపోని అబద్ధాలు చెబతూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ యూట్యూబ్ ఛానెళ్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని సమంత తన పిటిషన్‌లో కోరారు.