ఢిల్లీలో చంద్రబాబుకు చుక్కెదురు… మోదీ, అమిత్ షాల షాక్

ఏపీలో టిడిపి కార్యాలయాలు, నాయకులపై వైసిపి కార్యకర్తల దాడులను సాకుగా తీసుకొని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో గతంలో తెంచుకున్న బంధాన్ని పునరుద్ధరించుకోవడం కోసం ఒకడుగు వేయాలని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో చుక్కెదురైనది. 

2019లో ఓటమి చెందినప్పటి నుండి ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా లతో సంబంధాలు తిరిగి ఏర్పర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నా వారు విముఖత వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే ఏపీలో అధికార పార్టీ దాడులతో టీడీపీ నేతలు, కార్యకర్తలు తట్టుకోలేకపోతు  ఉండటం, కరోనా మహమ్మారి పేరుతో సుమారు రెండేళ్లుగా తాను దాదాపు ఇంటికే పరిమితమై ఉంటుండడంతో రాజకీయంగా టిడిపి పట్టు కోల్పోతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 

ఇటువంటి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం అండదండలు తప్పనిసరని గ్రహించి టిడిపి కార్యాలయాలపై దాడులు జరిగిన నాటి సాయంత్రమే చంద్రబాబు స్వయంగా అమిత్ షాకు ఫోన్ చేశారు. వినతిపత్రం పంపితే తగు చర్య తీసుకొంటామని ఆయన ముక్తసరిగా చెప్పి ఊరుకున్నారు.

ఢిల్లీ పర్యటన పేరుతో మోదీ, అమిత్ షా లను కలవడం ద్వారా తిరిగి కేంద్ర ప్రభుత్వంకు  దగ్గర అవుతున్నామని సంకేతం ఇవ్వాలని చంద్రబాబు చేసిన ప్రయత్నం ఫలించలేదు.  వారిద్దరూ చంద్రబాబును కలవడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌ కోరితే, హోం మంత్రిని కలవండని, హోం మంత్రికి వివరించామనే స్పందన పిఎంఒ నుంచి వచ్చింది. 

అయితే హోం మంత్రి అమిత్‌ షా మాత్రం జమ్ముకాశ్మీర్‌ నుంచి ఢిల్లీ చేరుకున్నప్పటికీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. కేంద్ర మంత్రి మండలి సమావేశం ఉందని మంత్రి అపాయింట్‌మెంట్‌ నిరాకరించినట్లు సమాచారం. అపాయింట్‌మెంట్‌ ఖరారు కాకపోవడంతో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు తిరిగి బయలుదేరారు. 

గతంలో అమిత్‌ షా బిజెపి అధ్యక్షునిగా కుటుంబంతో తిరుమలకు వస్తే.. ఆయన కాన్వాయ్‌పై టిడిపి కార్యకర్తలతో రాళ్లు వేయించిన ఘటనను బీజేపీ మరచిపోలేదు. అంతేకాక నరేంద్ర మోదీని ఉగ్రవాది అని సంభోదించడాన్ని కూడా బిజెపి నేతలు మరచిపోలేక పోతున్నారు.  డున్న‌రేళ్ల‌యినా చంద్ర‌బాబు బిజెపితో తెగతెంపులు చేసుకున్న తర్వాత వ్యవహరించిన తీరును బీజేపీ పెద్దలు మర్చిపోలేక పోతున్నట్లు ఇప్పుడు స్పష్టమైనది. 

మరోవంక జాతీయ మీడియా సహితం చంద్రబాబు పర్యటనను పట్టించుకోకపోవడం టిడిపి నేతలు తమాయించుకోలేక పోతున్నారు.టీడీపీ నేతలు జాతీయ మీడియాకు ప‌దే ప‌దే ఫోన్లు చేసినా స్పందన లేదని తెలుస్తున్నది. కేవలం రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ను కలసి, ఒక వినతిపత్రం సమర్పించిన రావలసి వచ్చింది.  

”రాష్ట్రంలోని జరుగుతున్న అంశాలపై కేంద్రానికి తెలపడం ప్రతిపక్షంగా మా బాధ్యత. అందుకే ఇక్కడికి వచ్చాం. రాష్ట్రపతిని కలిశాం. అన్ని అంశాలు వివరించాం…” అంటూ ఢిల్లీ నుండి తిరిగి వాస్తూ నిర్వేదంతో చంద్రబాబు పేర్కొన్నారు. ”రాష్ట్రంలో డ్రగ్స్‌ మాఫియా పెరిగింది. సోమవారం తమిళనాడులో కూడా డ్రగ్స్‌ పట్టుకున్నారు. అది కూడా ఏపి నుంచే వచ్చిందనే తేలింది. డ్రగ్స్‌ దేశ సమగ్రతకు ముప్పు” అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. . 

 ”సైబరాబాద్‌కు మించిన నగరంగా అమరావతిని నిర్మించాలని అనుకున్నాం. అన్ని అవసరాలకు వాడినప్పటికీ ఇంకా పది వేల ఎకరాల భూమి మిగులుతుంది. దాన్ని అమ్మితే రూ. రెండు లక్షల కోట్లు వస్తాయి. దానికి మూడు రెట్లు వేసుకుంటే రూ.ఆరు లక్షల కోట్లు అవుతుంది. దీంతో అమరావతి ఆదాయం హైదరాబాద్‌ను మించిపోతుంది” అంటూ తన కలల ప్రణాళికలను మరోసారి వినిపించారు. 

 అలాగే హైదరాబాద్‌ కంటే పెద్ద అవుటర్‌ రింగ్‌ రోడ్డు (180 కిలో మీటర్ల ) అమరావతి ప్రతిపాదించాం. కానీ మూడు రాజధానుల పేరుతో వైఎస్‌ జగన్‌ రాష్ట్ర ఆకాంక్షలను ధ్వంసం చేశారు. రైతులు రోడ్లపై ఏడాదిగా ఉద్యమిస్తున్నారు. వారికి పరిష్కారం చూపలేదని మండిపడ్డారు. అయితే సిఆర్‌డిఎ చట్టం రైతులకు అండగా ఉంటుందని భరోసా వ్యక్తం చేశారు. 

 ”మధ్యపానం నిషేధం అన్నారు. అదీ జరగలేదు. కానీ దాని పేరుతో ఎక్కడా లేని స్పెషల్‌ స్టేటస్‌, నోబెల్‌ ప్రైజ్‌, ప్రెసిడెంట్‌ మెడల్‌ వంటి సరికొత్త బ్రాండ్‌లు తెచ్చారు. లాక్‌డౌనే మధ్యపాన నిషేధానికి అనువైన సమయం. కానీ ఆ సమయంలో రేట్లు పెంచారు. దీంతో మధ్యం తాగేవారు పక్క రాష్ట్రాలను ఆశ్రయించారు” అంటూ చెప్పుకొచ్చారు. 

 అక్కడ పెట్రోల్‌, మధ్యం ధరలు ఉండటంతో ఎక్కువ మంది సమీప రాష్ట్రాలకు వెళ్లి మధ్యం, పెట్రోల్‌ కొనుగోలు చేస్తున్నారు. మరోపక్క రాష్ట్ర అభివఅద్ధి కుంటిపడిపోతుంది. రైతులకు ఏమీ చేయలేదు. పంట సేకరణ సరిగా లేదు. కరెంటు ఛార్జీల మోత పెరిగింది. ఇలా అన్ని సమస్యలే ఉన్నాయని వివరించారు. 

అలాగే పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఏపిలో కూడా టిఆర్‌ఎస్‌ పార్టీ పెట్టమని అడుగుతున్నారని చేసిన వ్యాఖ్యలు, సిఎం పనితీరుకు సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. జగన్ మోహన్ రెడ్డి పరిపాలన తీరుతెన్నుల పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ప్రజల విశ్వాసం తిరిగి పొందలేక అపోతున్నారని ఆయనలో నెలకొన్న అసహనమే వెల్లడి చేస్తుంది.