పిచ్‌పై తేమ, మంచు కురవడంతో భారత్ పై పాక్ విజయం!

అంతర్జాతీయ క్రికెట్ పోటీలలో పాకిస్థాన్ పై చిరకాలంగా ఆధిపత్యం ప్రదర్శిస్తూ వస్తున్న భారత్ క్రీడాకారులు తాజాగా బ్యాటింగ్‌, బౌలింగ్‌లో విఫలమై ఘోర ఓటమిని మూటగట్టుకొని అందరి అంచనాలను తలకిందులు చేశారు. అందుకు కొన్ని వ్యూహాత్మక పొరపాట్లతో పాటు క్రీడా మైదానంలో నెలకొన్న పరిస్థితులే కారణం అని తెలుస్తున్నది. 

వాస్తవానికి భారత్ క్రీడాకారులు ఎంతో పట్టుదలతో, సంయమనంతో ఆడినా పరిస్థితులు కలిసిరాలేదని చెబుతున్నారు. ముఖ్యంగా పిచ్‌పై ఉన్న తేమ, మంచు కురవడంతో భారత్ తీవ్ర ప్రతికూలతను ఎదుర్కోవలసి వచ్చింది. పిచ్‌పై ఉన్న తేమను పాకిస్తాన్‌ వినియోగించుకుంది. 

ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే మూడు కీలక వికెట్లు తీసి ఆధిపత్యం చెలాయించింది. ఇక పాక్‌ బ్యాటింగ్‌ వచ్చే సరికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పిచ్‌ బ్యాటింగ్‌కు సహకరించడంతో పాక్‌ ఓపెనర్లు సునాయా సంగా పరుగులు చేశారు. పైగా, మంచు కురవడం కూడా స్పిన్నర్లకు అస్సలు కలిసి రాలేదు. పేసర్లు వికెట్‌ తీయలేకపోయిన సమయంలో.. స్పిన్నర్లు కూడా తేలిపోయారు. 

ముందుగా బౌలింగ్‌ ఎంచుకోవడంతో, ఆ పై బ్యాటింగ్‌లో పాక్‌ సత్తా చాటడమే భారత్‌ ఓటమికి కారణమని స్పష్టం అవుతుంది. భారత్‌పై విజయం తరువాత విజయాన్ని ఆస్వాదించే క్రమంలో మితిమీరి ప్రాద్రసింపవద్దని  పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజా మ్‌ తమ బృందాన్ని వారించారు. ఇది మెగా టోర్నీ.. టీమిండియాపై గెలిస్తే.. టోర్నీ గెలిచినట్టు కాదని హెచ్చరించారు. అంటే భారత్ ఓటమిని వారు చాలా జాగ్రత్తగా పరిగణలోకి తీసుకున్నట్లు స్పష్టం అవుతుంది. 

ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ బాడీ లాంగ్వేజ్‌ సరిగ్గా లేక పోవడం కూడా టీమిండియా భారీ స్కోర్‌ చేయలేకపోయింది. ఇరువురు చాలా ఘోరంగా విఫలం అయ్యారు. మిడిల్‌ ఆర్డర్‌లో విరాట్‌ మినహా ఎవరూ రాణించలేదు. సూర్యకుమార్‌ యాదవ్‌, పంత్‌ బ్యాటింగ్‌ స్థానాల్లో మార్పులు కూడా ఓటమికి కారణం. వీరిద్దరు త్వరగా ఔటవ్వడంతో భార మంతా కోహ్లీపైనే పడినట్టయ్యింది. 

తొలి ఆరు ఓవర్లు పాక్‌ బౌలర్లు అద్భుతమైన బౌలింగ్‌ చేశారు. ఇక భారత్‌ బౌలింగ్‌లో సరైన లయను అందుకోలేక పోయారు. బుమ్రాతో స్పెల్‌ ప్రారంభించ కుండా  భువీకి బౌలింగ్‌ అప్పగించడం పాక్‌ బ్యాటర్లు సెట్‌ అయ్యేందుకు అవకాశం ఏర్పడింది.

ఇక, యువ ఆటగాళ్లు సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌లు చాలా దూకుడు ప్రదర్శించారు. అనవసరమైన షాట్లకు ప్రయత్నించి వికెట్లు చేజార్చుకున్నారు. 6 ఓవర్ల పవర్‌ ప్లేను ఉపయోగించుకోలేకపోయారు. కీలకమైన మూడు వికెట్లు చేజార్చుకుని పీకల్లోతు ఒత్తిడికి గురయ్యారు. సర్లు వికెట్‌ తీయలేకపోయిన సమయంలో.. స్పిన్నర్లు కూడా తేలిపోయారు. వరుణ్‌, జడేజాలు ఖాళీ చేతులతో మ్యాచ్‌ ముగించారు. 

తాము అనుకున్న ప్రణాళికలు అమలు చేయలేకపోయామని, పాకిస్తాన్‌ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంగీకరించారు. ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే 3 వికెట్లు కోల్పోతే తిరిగి పుంజుకోవడం కష్టం అని పేర్కొన్నారు.  మొదటబ్యాటింగ్‌ చేయడం అంత సులభం కాదని తెలిపారు.

“పాకిస్తాన్‌ బ్యాటింగ్‌కు పిచ్‌ ఎంతో బాగా అనుకూలించింది. మంచు ప్రభావం కూడా ఉంది. తుది జట్టుపై ఎలాంటి బాధ లేదు. పాక్‌ గొప్పగా ఆడి విజయాన్ని సొంతం చేసుకుంది” అని వివరించారు. అయితే, ప్రపంచ కప్‌లో ఇది ఆరంభం మాత్రమే అని, అంతం కాదని స్పష్టం చేస్తూ వచ్చే ఆటలలో తమ ప్రతిభ చూపగలమనే భరోసాను వ్యక్తం చేశారు.