ఎన్నికల కమీషన్ కు కేసీఆర్ హెచ్చరిక 

కేంద్ర ఎన్నికల సంఘం తన పరిధిని దాటుతోందని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థగా వ్యవహరించాలని, గౌరవాన్ని నిలబెట్టుకోవాలని నేరుగా హెచ్చరించారు. ‘‘నన్ను సభ పెట్టవద్దు అనడం పద్ధతా? చిల్లర మల్లర ప్రయత్నాలు మానుకోవాలి. దేశంలో ఒక సీనియర్‌ రాజకీయ నాయకుడిగా, బాధ్యత గల పార్టీ అధ్యక్షుడిగా, సీఎంగా సలహా ఇస్తున్నా. గౌరవాన్ని పోగొట్టుకోవద్దు.. ఇది మీకు గౌరవం కాదని హెచ్చరిస్తున్నా’’ అని స్పష్టం చేశారు. 

సోమవారం జరిగిన టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తొమ్మిదోసారి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్లీనరీలో భాగంగా వివిధ సందర్భాల్లో ఆయన మాట్లాడారు.  ‘‘సాగర్‌లో కేసీఆర్‌ సభ పెట్టకూడదంటూ హైకోర్టులో కేసు వేస్తారు. ఏం దిక్కుమాలిన పని? ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభ పెట్టుకోవచ్చని చెప్పాలి. కానీ, కేసీఆర్‌ సభ పెట్టవద్దని కేసు.. ఇదా రాజకీయం.? ఇప్పుడు హుజూరాబాద్‌లో కూడా కేసీఆర్‌ సభ పెట్టకుండా చేయాలని చూస్తున్నరు’’ అని మండిపడ్డారు.

మరోవంక, దళిత బంధు పథకాన్ని చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీని పెట్టాలంటూ అక్కడి నుంచి వేలాది వినతులు వస్తున్నాయని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ‘‘సార్‌.. మీ పార్టీని ఇక్కడ కూడా ప్రారంభించండి. మిమ్మల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నం.. మాకు మీ పథకాలు కావాలంటూ ఆంధ్ర ప్రాంతం నుంచి అనేక మంది విజ్ఞప్తి చేస్తున్నారు’’ అని తెలిపారు.

అదే విధంగా ఉత్తరాది నుంచి వేల సంఖ్యలో కూలీలు తెలంగాణకు వచ్చి పనిచేస్తున్నారని, తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలంటూ పొరుగు రాష్ట్రాల్లో డిమాండ్లు వినవస్తున్నాయని పేర్కొన్నారు. పొరుగున ఉన్న నాంథేడ్, రాయ్‌చూర్ జిల్లాల నుంచి కూడా ఈ డిమాండ్లు వచ్చాయని చెప్పారు. 

తెలంగాణ ఏర్పడితే ఇక్కడ అంధకార బంధురమవుతుందని దుష్ప్రచారం చేశారని గుర్తు చేశారు. ‘‘ఏ ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయామో ఆ ఆంధ్రప్రదేశ్‌ తలసరి ఆదాయం రూ.1.70 లక్షల కోట్లు. మన తలసరి ఆదాయం రూ.2.30 లక్షల కోట్లు. తెలంగాణ ఇస్తే కరెంటు ఉండదని ఏ ఏపీ నుంచి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండో అదే ఏపీలో ఇప్పుడు కరెంటు లేదు. ఇక్కడ 24 గంటల కరెంటు ఉంది’’ అని ఎద్దేవా చేశారు. 

కాగా, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ కు పూర్తి అధికారాలు కట్టబెట్టే విధంగా పార్టీ నియమావళిని సవరించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లేని సమయంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌కు అధికారాలు సంక్రమించేలా టీఆర్‌ఎస్‌ పార్టీ నియమా వళిలో మార్పు చేశారు. ప్లీనరీలో ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించారు. దీనితోపాటు, పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించుకునే అధికారం; జిల్లా, నియోజకవర్గ స్థాయి కార్యవర్గాలను నియమించే అధికారం రాష్ట్ర అధ్యక్షుడికి సంక్రమించాలని మరో రెండు తీర్మానాలు ఆమోదించారు.