తాలిబన్లతో జమ్మూకాశ్మీర్ తో పాటు  ఈశాన్యంకూ ముప్పు 

కాబూల్‌లో తాలిబాన్‌ అధికారం చేపట్టిన తర్వాత అక్కడ నెలకొన్న పరిస్థితుల కారణంగా.. జమ్ముకశ్మీర్‌తో పాటు ఈశాన్య ప్రాంతానికి ముప్పు పొంచిఉన్నదని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్‌) జనరల్ బిపిన్ రావత్ హెచ్చరించారు. అయితే అంతర్గత పర్యవేక్షణలో పని చేయడం ద్వారా ఈ ముప్పును అధిగమించవచ్చని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 
బిపిన్‌ రావత్‌ గువాహటిలో రవికాంత్ సింగ్ తొలి స్మారక ఉపన్యాసం చేస్తూ చైనాతో ఎల్‌ఏసీ సహా ఇతర సమస్యలు చర్చల ద్వారా పరిష్కరామవుతాయని ఆశాభావం వ్యక్తం చేశా రు. అయితే రెండు దేశాల మధ్య సందేహాస్పద పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి కొంత సమయం పడుతుందని ఆయన చెప్పారు.

చైనాతో సరిహద్దు సమస్యను సమగ్రంగా చూడాలని, ఈశాన్య లేదా లడఖ్ సమస్యను ఒంటరిగా చూడవద్దని ఆయన సూచించారు.  మయన్మార్, బంగ్లాదేశ్‌లోని రోహింగ్యా శరణార్థుల పరిస్థితిని నిశితంగా పరిశీలించాలని చెప్పారు.  రోహింగ్యా శరణార్థులు తీవ్రమైన అంశాల వల్ల దుర్వినియోగమయ్యే ప్రమాదమున్నదని ఆయన తెలిపారు.

ఇప్పుడు సైనిక స్థాయి, విదేశీ వ్యవహారాల స్థాయి, రాజకీయ స్థాయిలో చర్చల ద్వారా సమస్యలు పరిష్కారమవుతున్నాయని బిపిన్‌ రావత్ చెప్పారు. సరిహద్దు సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకం తనకున్నట్లు భారోసా వ్యక్తం చేశారు. గతంలోనూ సరిహద్దు వివాదాలు వచ్చాయని, వాటిని పరిష్కరించుకున్నట్లు ఆయన తెలిపారు.