టీకాల100 కోట్ల మైలురాయి ఆరోగ్య సిబ్బంది ఘనతే

దేశంలో కరోనా వ్యాక్సిన్ల వినియోగం 100 కోట్ల మైలు రాయిని చేరుకోవడంలో లక్షలాది మంది ఆరోగ్య సిబ్బంది కృషి ఉందని, ఈ ఘనత వారికే చెందుతుందని ప్రధాని నరేంద్ర మోదీ  ప్రశంసించారు. వ్యాక్సిన్ల వినియోగంలో మైలురాయిని చేరుకున్నాక దేశం కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతుందని ఆయన చెప్పారు. 

ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగీస్తూ ‘మీ అందరికీ నమస్కారం పెడుతున్నాను. హలో కూడా చెప్తున్నాను ఎందుకంటే 100 కోట్ల వ్యాక్సిన్ డోసుల కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేయడంలో మీ సహకారం మరువలేనిది” అంటూ సంతోషం ప్రకటించారు. 

 ఈ విజయంతో ఇవాళ దేశం కొత్త ఉత్సాహంతో, కొత్త శక్తితో ముందుకు సాగుతున్నదని చెబుతూ మన టీకా కార్యక్రమం విజయం భారతదేశ సామర్థ్యాన్ని చూపుతున్నదని ప్రధాని పేర్కొన్నారు. శతకోటి వ్యాక్సిన్‌ డోసుల వినియోగం..సంఖ్య పరంగా చాలా పెద్దదని, దేశం, దేశ ప్రజల సామర్థ్యం తనకు తెలుసునని పొగిడారు.

‘ లక్షలాది ఆరోగ్య కార్యకర్తల కృషి కారణంగానే 100 కోట్ల వ్యాక్సిన్ల పంపిణీ సాధ్యమైంది. అందరికీ వ్యాక్సిన్‌, ఉచిత వ్యాక్సిన్‌ను ఇంత విజయాన్ని అందించిన ప్రతి భారతీయుడికి ధన్యవాదాలు’ అని ప్రధాని తెలిపారు.  దేశ ప్రజలకు టీకాలు అందించేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆరోగ్య కార్యకర్తలు వదిలిపెట్టరన్న విషయం కూడా తెలుసునని చెప్పారు.

కొవిడ్‌ టీకా విషయంలో భారతదేశం అతి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నదని చెబుతూ మనమంతా ఐక్యంగా ఉంటే ఎవరూ మనల్ని ఏమీ చేయలేరని ప్రధాని స్పష్టం చేశారు.  . అలాగే, పోలీసు, భద్రతా దళాల్లో మహిళల సంఖ్య పెరుగుతుండటం ముదావహం అని తెలిపారు. అదేవిధంగా ఈ నెల 31న సర్ధార్‌ వల్లభారు పటేల్‌ జయంతిని ప్రస్తావిస్తూ.. మన్‌కీబాత్‌ వింటున్న శ్రోతల తరుపున ఆయనకు నమస్కారాలు తెలియజేస్తున్నానని చెప్పారు.

ఐక్య సందేశాన్ని ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. వచ్చే నెలలో గిరిజన నేత, స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండే జయంతి ఉండగా.. ముందుగానే ఆయనకు నివాళులర్పించారు.సంస్కృతి, మూలాల గురించి గర్వపడేలా బిర్సా ముండా మనకు నేర్పించారని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు.