
‘‘రోజురోజుకూ పెరుగుతున్న ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని ఎందుకు నిరోధించలేకపోతున్నారు? ఎక్కడికక్కడ భద్రత ఉన్నా.. మైనారిటీలపై, వలసదారులపై దాడులను ముందుగానే ఎందుకు పసిగట్టలేకపోతున్నారు?’’ అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా జమ్మూకశ్మీర్‌లోని ఉన్నతాధికారులను నిలదీసినట్లు తెల్లుస్తున్నది.
శాంతిభద్రతలపై సమీక్ష సందర్భంగా.. జమ్మూకశ్మీర్ లోయలో తీవ్రమవుతున్న ఉగ్రవాదం, తీవ్రవాదం, పాకిస్థాన్ వైపు నుంచి చొరబాట్లపై సీరియస్ అ య్యారు. గడిచిన 13 రోజులుగా కశ్మీర్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో కొనసాగుతున్న పోలీసు ఎన్‌కౌంటర్‌పై అమిత్‌షా ఈ సందర్భంగా అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు.
జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం 2019 ఆగస్టులో నిర్వీర్యం చేశాక అమిత్‌షా రాష్ట్రంలో తొలిసారిగా మూడు రోజుల పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా, రాజ్‌భవన్‌లో జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశానికి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో పాటు ఆర్మీ, సీఆర్‌పీఎఫ్, పోలీసు, ఇతర భద్రతా సంస్థల అధికారులు హాజరయ్యారు. కేంద్ర బలగాలు అన్ని వైపులా మోహరించిన ఉన్నప్పటికీ ఎందుకు ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని షా అధికారుల్ని నిలదీశారు. ఉగ్రవాద నిర్మూలనకు తీసుకుంటున్న చర్యల్ని అడిగి తెలుసుకున్నారు.
మైనార్టీలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి పరిస్థితులు అనుకూలంగా లేవని ఇటీవల కాలంలో జరిగిన ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఉగ్రదాడుల్లో ఐదుగురు బీహార్ కూలీలు సహా మొత్తం 11 మంది సాధారణ పౌరులు కేవలం అక్టోబర్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అమిత్ షా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
భద్రతా బలగాల ఉన్నతాధికారులు, డీజీపీ దిల్‌బాగ్ సింగ్ ఉగ్రవాదం, తీవ్రవాదం తగ్గుముఖం పట్టాయని చెప్పినట్లు.. సమావేశంలో పాల్గొన్న కేంద్ర హోంశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాశ్మీర్ లోయలో అభివఅద్ధిని ఎవరూ అడ్డుకోలేరని.. స్థానికంగా శాంతి సామరస్యాలకు విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
కాగా, జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని చెబుతూ. ఈ ప్రక్రియ వచ్చే ఏడాది జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఆవెంటనే అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ఆ తర్వాతనే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పిస్తామని స్పష్టం చేశారు.
‘‘కొన్ని శక్తులు నియోజకవర్గాల పునర్విభజన వద్దంటున్నాయి. కొత్త సరిహద్దులతో తమ అస్తిత్వం పోతుందనే భయం వారిది. 75 ఏళ్లుగా రాష్ట్రాన్ని మూడు కుటుంబాలే పాలించాయి” అంటూ అమిత్ షా ధ్వజమెత్తారు. మరి 40వేల మంది హత్యలు ఎందుకు జరిగినట్లు? అంటూ ప్రశ్నించారు. స్వర్గానికి మారుపేరైన కశ్మీర్‌లో శాంతిని నెలకొల్పడమే కేంద్రప్రభుత్వ ధ్యేయం అని ఆయన స్పష్టం చేశారు.
యూత్ క్లబ్ సభ్యులతో ఆయన ముచ్చటిస్తూ..కశ్మీర్ యువతకి స్నేహహస్తం అందించడానికే తాను వచ్చానని చెప్పారు. ‘ఆ భగవంతుడు ఈ లోయని ఒక స్వర్గంలా మార్చాడు. ప్రకృతి సౌందర్యంతో సర్వాంగ సుందరంగా వెలిగిపోతోంది’ అని తెలిపారు. ప్రధాని మోదీ ఈ లోయ అభివృద్ధిని, శాంతి సుస్థిరతల్ని కోరుకుంటున్నారని చెబుతూ, అందుకోసం కశ్మీర్ యువత సహకరించాలని కోరారు. వారి సహకారం కోసమే తాను ఇక్కడికి వచ్చానని అమిత్ షా వెల్లడించారు. కేంద్రం ఇచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని కేంద్ర మంత్రి హితవు పలికారు.
కాశ్మీర్‌లో నూతన శకం మొదలైందని చెబుతూ ఉగ్రవాదం, అవినీతి పాలన, కుటుంబ రాజకీయాల నుంచి శాంతి, అభివృద్ధి, ప్రజా శ్రేయస్సు వైపు అడుగులు పడుతున్నాయని చెప్పారు. కాశ్మీర్‌ను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రధాని మోడీతో చేతులు కలపాలని యువతకు పిలుపునిచ్చారు.
ఆర్టికల్ 370 రద్దైన సమయంలో కర్ఫ్యూ ఎందుకు విధించారని, ఇంటర్నెట్ షట్‌డౌన్ ఎందుకు చేశారన్న ప్రశ్నలు వచ్చాయని, దీనికి సమాధానం చెపుతానని తెలిపారు. ప్రత్యేక హోదా రద్దు చేసే సమయంలో.. కొందరు ప్రజలను ప్రేరేపించడానికి ప్రయత్నించారు. ఇందులో కొన్ని విదేశీ శక్తులు కూడా భాగస్వామ్యమయ్యాయని గుర్తు చేశారు.
కర్ఫ్యూ విధించి ఉండకపోతే.. అనేక మంది తండ్రులు తమ కొడుకుల శవపేటికలను భుజాన వేసుకుని ఉండేవారని అమిత్ షా పేర్కొన్నారు. కర్ఫ్యూ వల్ల యువత రక్షించబడ్డారని తెలిపారు. ప్రత్యేక హోదా రద్దు.. కాశ్మీర్‌ను ఉగ్రవాదం నుండి అభివృద్ధి దిశగా పయనించిందని భరోసా వ్యక్తం చేశారు. గతంలో ఉగ్రవాదం, రాళ్ల దాడి గురించి విన్నానని, నేడు అభివృద్ధి, విద్య, నైపుణాభివృద్ధిని చూస్తున్నామని పేర్కొన్నారు.
More Stories
కర్రెగుట్టలో చివరి ఘట్టంలో ఆపరేషన్ కగార్?.. చర్చలంటూ గగ్గోలు!
దౌర్జన్యాలు చేసే వారికి గుణపాఠం నేర్పడమే హిందూ మతం
ఆర్మీ హిట్ లిస్ట్ లో 14 మంది ఉగ్రవాదులు!