చర్చిలకు ఎంపీ నిధుల వినియోగంపై కేంద్రం ఆరా!

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఒక వంక ఉన్నత న్యాయస్థానాల ద్వారా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంను ఇరకాటంలో పడవేస్తుండగా, మరోవంక ఆయన ప్రభుత్వం వ్యవహారాలపై చేస్తున్న ఫిర్యాదులకు స్పందించక తప్పని పరిస్థితులు కేంద్ర ప్రభుత్వానికి కలుగచేస్తున్నారు. 

దానితో ప్రతిపక్షం నుండికన్నా సొంత పార్టీ నుండి లోక్ సభకు ఎన్నికైన సభ్యుడితో ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నది. ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి, ఇతర వైసిపి ప్రముఖుల బెయిల్ లను రద్దు చేయాలని సిబిఐ, హైకోర్ట్ లలో ప్రయత్నించి విఫలమై తాజాగా సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించారు.

ఏపీ ప్రభుత్వ పెద్దలను ఆత్మరక్షణలో పడవేసిన గుజరాత్ పోర్ట్ లో పట్టుకున్న హెరాయిన్ మూలాల దర్యాప్తును కేంద్రం ఎన్ఐఎ కు అప్పగించగా, ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని ఈడి ని ఆయన కోరుతున్నట్లు తెలుస్తున్నది. మరోవంక, ఇప్పటికే సీఐడీ అధిపతి సునీల్ కుమార్ పై కేంద్రానికి ఫిర్యాదు చేశారు.

తాజాగా కొంతమంది వైసీపీ ఎంపీలు, తమ ఎంపీ నిధులను చర్చి నిర్మాణాలకు కేటాయిస్తున్నారంటూ నేరుగా ప్రధాన మంత్రికి ఫిర్యాదు చేసి రాజకీయ కలకలం సృష్టిస్తున్నారు. ఈ ఫిర్యాదులపై కేంద్రం ఆరా తీయడంతో ఏపీ ప్రభుత్వం ఇరకాటంలో పడినట్లు తెలుస్తున్నది. బాపట్లలో వైసీపీ ఎంపి నందిగం సురేష్ తన ఎంపీ లాడ్స్ నుంచి  వెలమవారిపాలెం చర్చి మరమ్మతులు, పునర్మిర్మాణం కోసం రూ 43 లక్షలు కేటాయించడం అప్పట్లో వివాదంగా మారింది.

అదేవిధంగా వివిధ జిల్లాల్లో వైసీపీ ఎంపీలు కమ్యూనిటీ హాలు నిర్మాణాల పేరిట ఇస్తున్న నిధులతో ముందు కమ్యూనిటీ హాళ్లు నిర్మించి, ఆ తర్వాత వాటిని చర్చిలుగా మారుస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందనిరఘురామకృష్ణంరాజు ప్రధాని మోదీని స్వయంగా కలిసినప్పుడు ఫిర్యాదు చేశారు. తమ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాళ్లను చర్చిలుగా మార్చేందుకు, తమ పార్టీ ఎంపీలు అధికారులపై ఒత్తిడి చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని కూడా అయన పేర్కొన్నారు.

ఎంపీ నిధులతో చర్చిలు నిర్మించడం, మరమ్మతులు చేయడం చట్టవిరుద్ధమని ఎంపీ రాజు ప్రధాని దృష్టికి తీసుకువె ళ్లారు. కాగా రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం క్రైస్తవ అనుకూల విధానాలు అవలంబిస్తోందని, మతమార్పిళ్లు శరవేగంగా జరుగుతోందని ఆయన ఇదివరకే కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో కొందరు పోలీసు, ఏఐఎస్ అధికారులు బహిరంగంగా క్రైస్తవ వేదికలపై ప్రసంగాలు చేస్తున్నారని కూడా వెల్లడించారు. 

అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్జ గన్ సీఎం అయిన తర్వాత క్రైస్తవులకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వచ్చినట్లు చెప్పిన వీడియాను కూడా, ఎంపీ రాజు ఇదివరకే ప్రధానికి అందించారు. క్రైస్తవ మతం మారిన దళితులు-రెడ్లకే జగన్మోహన్‌రెడ్డి సర్కారు కీలక పదవులిస్తోందని అంటూ ఆ జాబితాను కూడా ప్రధానికి అందించారు.

హిందూ ఆలయాలపై వరసగా జరుగుతున్న దాడులను, ఏపీ ప్రభుత్వం అరికట్టలేక పోతోందని అంటూ గతంలో హోమ్ మంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలో ఎంపీ నిధులతో చర్చి నిర్మాణాలు చేస్తున్నవిషయమై సెప్టెంబర్ 20న ఒక పత్రికలో వచ్చిన వార్తాకథనాన్ని  జతపరుస్తూ ప్రధాని లేఖ రాశారు.

ఎంపీ నిధులతో నిర్మించిన కమ్యూనిటీహాళ్లు తర్వాత చర్చిలుగా మారాయన్న ఆరోపణలపై, విచారణ జరిపించాలని ఎంపీ రాజు ప్రధానిని కోరారు. జగన్ ప్రభుత్వం ఇప్పటికే రూ 25 కోట్లతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 248 చర్చిలు నిర్మించిందని, ఒక్కో చర్చికి రూ 84 వేల నుంచి కోటి రూపాయల వరకూ ఖర్చు చేసిందని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు.

దానితో ఎంపీ లాడ్స్‌ నిధులను మత సంబంధ భవనాలకు కేటాయించడంపై ఏపీని కేంద్ర ప్రభుత్వం వివరణ కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళిక విభాగం ముఖ్యకార్యదర్శికి కేంద్రం లేఖ వ్రాయడంతో జగన్ ప్రభుత్వం ఖంగు తిన్నట్లు తెలుస్తున్నది.