ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా 28న బీఎంఎస్ దేశ‌వ్యాప్త నిర‌స‌న‌

ప్ర‌భుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)ల్లో వాటాల ఉప‌సంహ‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా భార‌తీయ మ‌జ్దూర్ సంఘ్ (బీఎంఎస్‌) ఈ నెల 28న దేశ‌వ్యాప్త నిర‌స‌న తెలుప‌నున్న‌ది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ‌ల్లో వాటాల ఉప‌సంహ‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా పోరాడాల్సిన కార్మిక సంఘాలు మౌనంగా ఉన్నాయ‌ని బీఎంఎస్ అఖిల‌భార‌త కార్య‌ద‌ర్శి గిరీశ్ చంద్ర ఆర్య ఆరోపించారు.

ఈ నేప‌థ్యంలో బీఎంఎస్ 28న దేశ‌వ్యాప్తంగా ధ‌ర్నాలు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింద‌ని తెలిపారు. కేంద్రంలో ఎవ‌రు అధికారంలో ఉన్నార‌న్న అంశంతో తమకు  సంబంధం లేద‌ని గిరీశ్ చంద్ర ఆర్య స్పష్టం చేశారు. మంచి డివిడెండ్లు అందిస్తున్న ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో ప్ర‌భుత్వం ఎందుకు వాటాలు ఉప‌సంహ‌రిస్తుంద‌ని ఆయన  ప్ర‌శ్నించారు. 

ఎన్‌హెచ్‌పీఎల్‌, బీహెచ్ఈఎల్‌, బీఎస్ఎన్ఎల్ స‌హా స్టీల్‌, టెలికం, ప‌వ‌ర్‌, బ్యాంకింగ్‌, బీమారంగ ఉద్యోగుల‌ను త‌మ ఆందోళ‌న‌లో పాల్గొనాల‌ని ఆహ్వానిస్తున్న‌ట్లు ఆయన  చెప్పారు. 2021 ఆగస్టులో అయోధ్యలో జరిగిన భారతీయ మజ్దూర్ సంఘ్ కేంద్రీయ కార్య సమితిలో  ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో  బీఎంఎస్‌  అన్ని అనుబంధ సంఘాలు, ప్రభుత్వ రంగ సమన్వయ కమిటీ బ్యానర్ కింద, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ‘ప్రభుత్వ రంగాలను రక్షించండి, దేశాన్ని రక్షించండి’ అనే డిమాండ్‌ తో తమ తమ పరిశ్రమలు లేదా యూనిట్లలో అక్టోబర్ 28న దేశవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు   బీఎంఎస్‌  ఒక ప్రకటనలో తెలిపింది.

బీఎంఎస్‌  ప్రధాన డిమాండ్లలో బిపిసిఎల్ పెట్టుబడుల ఉపసంహరణను తక్షణమే నిలిపివేయడం, వివిధ రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పరిమితులను పెంచడం, బ్యాంకుల, భీమా సంస్థల విలీనాన్ని నిలిపివేయడం, బొగ్గు రంగం  వాణిజ్యీకరణను నిలిపివేయడం వంటివి ఉన్నాయి. ప్రతిపాదిత పారిశ్రామిక సంబంధాల కోడ్‌లో కార్మికుల వ్యతిరేక మార్పులు ఏవైనా ఉంటె వాటిని కూడా నిలిపి వేయాలని కోరుతున్నారు. .

ఇంకా, బీఎస్ఎన్ఎల్, ఎంటి ఎన్ఎల్ కోసం పునరుజ్జీవన ప్యాకేజీని, మిగిలిన ప్రభుత్వ రంగాలలో 3 వ వేతన సవరణ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ సవరించాలని, ఖాయిలాపడిన ప్రభుత్వ రంగ సంస్థల  పునరుజ్జీవనం కోసం  వైవిధ్యీకరణ చేపట్టాలని కూడా  డిమాండ్ చేసింది.

తదుపరి కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోవాల, లేని పక్షంలో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని బీఎంఎస్‌ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. “భారతీయ మజ్దూర్ సంఘ్ బడ్జెట్ సెషన్ వరకు ప్రభుత్వ చర్యల కోసం వేచి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం తన విధానాన్ని కొనసాగీస్తూ, మా డిమాండ్లను ఆమోదించకపోతే,  ప్రభుత్వంపై మా  భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయిస్తాము ” అని  బీఎంఎస్‌ ప్రకటించింది.

భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రభుత్వ రంగ సమన్వయ కమిటీలో బ్యాంకింగ్, బీమా, బొగ్గు, బొగ్గుయేతర, మైనింగ్, స్టీల్, పోర్ట్ & డాక్, షిప్పింగ్, రైల్వే, రక్షణ, పోస్టల్ వంటి రంగాలలో అన్ని అనుబంధ సంఘాలు ఉన్నాయి.