చంద్రబాబు రాజకీయాలకు జీవం పోసిన పట్టాభి అరెస్ట్!

ప్రతికూల పరిస్థితులను సహితం సానుకూలంగా ఉపయోగించుకో గలిగిన వారే ప్రజా జీవనంలో రాణిస్తుంటారు. అధికారం కోల్పోయిన రెండున్నరేళ్ల పాటు దాదాపు మీడియా ప్రచారంకు పరిమితం అవుతూ వస్తున్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు రాజకీయంగా క్రియాశీలం కావడానికి పార్టీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అరెస్ట్ ను తెలివిగా ఉపయోగించుకొన్నట్లు కనిపిస్తున్నది. 

కరోనా భయంగా దాదాపు హైదరాబాద్ లోని ఇంటికి పరిమితమైనా, వీడియో కాన్ఫరెన్స్ లతో కాలం గడుపుతూ వస్తున్న చంద్రబాబు ఈ మధ్యలో అనేకమంది పార్టీ నేతలను లక్ష్యంగా అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వం పలు కేసులలో అరెస్టులు చేయడం, పార్టీ మార్పిడికి వత్తిడులు తెస్తుండడంతో ఒకవిధంగా చంద్రబాబు నిస్సహాయంగా మిగిలిపోయారు. 

ఈ కాలంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో సహితం టిడిపి తన ఉనికి కాపాడుకోవడంలో విఫలమయింది. మరోవంక ప్రజా సమస్యలపై మీడియా దృష్టి ఆకట్టుకొనే నిరసనలు తప్పా చంద్రబాబు క్రియాశీలంగా వ్యవహరింప లేకపోతున్నారు. ప్రధాన ప్రతిపక్షం టిడిపి నుండి కన్నా ఉన్నత న్యాయస్థానాల నుండి వైసిపి ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటు వస్తున్నది. 

ఇటువంటి సమయంలో గంజాయి అక్రమ సాగు విషయమై అధికార పక్షంపై తీవ్రమైన విమర్శలు చేస్తూ, పట్టాభిరామ్ నేరుగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల అమర్యాదగా మాటాడటం అధికార పక్షంకు ఆగ్రహం కలిగించింది. గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి కార్యాలయాలు, నేతలు లక్ష్యంగా దాడులు జరిగాయి. మంగళగిరి సమీపంలో గల టిడిపి కేంద్ర కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. 

ఈ విధ్వంసం జరిగిన కొద్దీ సేపటికే పట్టాభిరామ్ ను పోలీసులు అరెస్ట్ చేసినా,  వెంటనే చంద్రబాబు రంగంలోకి దిగారు. `ప్రభుత్వ ఉగ్రవాదం’ అంటూ మండిపడ్డారు. రాష్ట్ర బంద్ కు పిలుపిచ్చారు. 36గంటల నిరశన దీక్ష ద్వారా తమ వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. 

తద్వారా ప్రజా సానుభూతి, మద్దతు ఏమేరకు సమకూర్చుకున్నారో గాని పార్టీలో మౌనంగా ఉన్న పలువురు నేతలు తిరిగి క్రియాశీలం అయ్యే విధంగా చేయగలిగారు. పార్టీకి దూరమవుతున్న విజయవాడ ఎంపీ నాని వంటి వారు నిరసనలో పాల్గొనడం, ఈ విధ్వంసం అంతా `గుణదల బ్యాచ్’ పని అంటూ వంగవీటి రాధాకృష్ణ ఆరోపించడం వంటివి ఒక విధంగా టిడిపిని రాజకీయంగా క్రియాశీలం చేయడానికి దోహదపడిన్నట్లు చెప్పవచ్చు. 

మరోవంక జాతీయ స్థాయిలో వైసిపి ప్రభుత్వ అరాచక చర్యలను ప్రచారం చేయడం కోసం చంద్రబాబు స్వయంగా ఢిల్లీ పర్యటన చేపట్టారు. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ను సోమవారం మధ్యాహ్న్నము కలుస్తున్నారు. అదే విధంగా ప్రధాని, కేంద్ర హోమ్ మంత్రి తదితరులను కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ కార్యాలయాలపై వైసిపి దాడులను ఫోన్లో అమిత్ షా దృష్టికి తీసుకు రావడం ద్వారా గతంలో చెలరేగిన వైమాష్యాలను తగ్గించుకొనే అవకాశం కల్గింది. 

అయితే జగన్ మోహన్ రెడ్డి సహితం ఈ విషయంలో వెనుకబడలేదు. రెండురోజుల విశాఖ పర్యటనను రద్దు చేసుకొని చంద్రబాబు ప్రయత్నాలను తిప్పికొట్టే వ్యూహరచనలో మునిగిపోయారు. గతంలో బిజెపి అధ్యక్షునిగా తిరుమల దర్శనంకు వచ్చిన అమిత్ షా పై టిడిపి కార్యకర్తల దాడిని ఈ సందర్భంగా వెలుగులోకి తెచ్చారు. 

టిడిపి ప్రారంభం నుండి వ్యతిరేకిస్తూ వస్తున్న ఆర్టికల్ 356ను ప్రయోగించి ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ తో చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేపట్టారు. అదే సమయంలో రాజకీయ పార్టీగా టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ఎన్నికల కమీషన్ ను కోరనున్నట్లు వైసిపి ప్రకటించింది. 

అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల వ్యవధి ఉన్నప్పటికీ, ముందస్తు ఎన్నికల సంకేతాలు వెలువడుతూ ఉండడంతో ఇక ప్రజాక్షేత్రంలో ఎక్కువగా గడపడం పట్ల ఒక వంక చంద్రబాబు, మరోవంక జగన్ వ్యూహరచనలు చేస్తున్నారు. వివిధ పేర్లతో ప్రజలకు సన్నిహితంగా ఎక్కువగా గడిపే ఆలోచనలు చేస్తున్నారు. దానితో ఏపీ రాజకీయాలలో అప్పుడే ఎన్నికల వేడి ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.