”విఫలమైన దేశం” దేశంగా మయన్మార్‌

 ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు అధికారాన్ని తిరిగి ఇవ్వకపోతే మయన్మార్‌ ఒక ”విఫలమైన దేశం” అనే దిశగా వెళుతుందని ఆ దేశానికి ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రాయబారిగా ఉన్న క్రిస్టేన్‌ స్క్రానెర్‌ హెచ్చరించారు. మయన్మార్‌లో తిరుగుబాటు అనంతరం దేశంలోని అనేక ప్రాంతాల్లో సైన్యం, పౌరుల మధ్య ఘర్షణ తీవ్రతరమౌతోందని ఆమె తెలిపారు.

సైన్యం అణచివేత కారణంగా 1,180 మందికి పైగా ఆందోళనకారులు మరణించారని ఆమె చెప్పారు. గ్రామాలను తగులబెట్టడం, ఆస్తులను లూటీ చేయడం, పెద్దయెత్తున అరెస్టులతో పాటు ఖైదీలపై హింస, లింగ ఆధారిత హింస, నివాస ప్రాంతాలకు తుపాకీ కాల్పులకు పాల్పడం వంటి దారుణాలకు సైన్యం పాల్పడుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

చిన్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో సైన్యం క్లియరింగ్‌ ఆపరేషన్లు నిర్వహిస్తోందని.. కచిన్‌, షాన్‌ వంటి రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయని ఆమె తెలిపారు. సైన్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటం క్రమంగా మిలటరైజ్‌ అవుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

అంగ్‌సాన్‌ సూకీ ప్రభుత్వ మద్దతుదారులు ఏర్పాటు చేసిన నేషనల్‌ యూనిటీ గవర్నమెంట్‌ పెద్దయెత్తున ప్రజా రక్షణ దళాలను సమీకరించే యోచనలో ఉందని, ప్రజా రక్షణ యుద్ధానికి పిలుపునిచ్చిందని క్రిస్టేన్‌ పేర్కొన్నారు. అంతర్జాతీయ జోక్యం లేని సమయంలో చివరిగా హింసను సమర్ధించాల్సిన పరిస్థితులు వస్తాయని ఆమె హెచ్చరించారు.

రాజకీయ ఖాదీలు తిరిగి అరెస్ట్ 

మరోవంక,  గత వారం దాదాపు 5 వేలకు పైగా ఖైదీలను మయన్మార్‌ సైనిక ప్రభుత్వం విడిచిపెట్టింది. వీరిలో నుంచి దాదాపు 110 మందిని తిరిగి అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. వీరికి గతంలో జారీ చేసిన క్షమాభిక్షను సైనిక ప్రభుత్వం రద్దు చేయడంతో ఈ పరిణామం చోటుచేసుకున్నది. 

పలువురిని జైలు ప్రవేశ ద్వారం వద్దనే పట్టుకోగా.. మరికొంత మందిని ఇంటికి చేరుకున్న గంటలోపే అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. స్థానిక మీడియా ప్రకారం, మయన్మార్ ఉగ్రవాద నిరోధక చట్టం ప్రకారం వీరందిరినీ పోలీసు కస్టడీలో ఉంచారు. తప్పుడు వార్తలు ప్రచారం చేశాడన్న ఆరోపణలపై గత మే 21 న అరెస్ట్‌ చేసినట్లు బందీగా ఉన్న లై లై నాంగ్ అనే వ్యక్తి చెప్పారు.

తన 84 ఏండ్ల వయసున్న తల్లిని చూసుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉన్నదని, తనపై తప్పుడు కేసులను ఎత్తివేయాలని ఆయన వేడుకుంటున్నాడు. లైలై నాంగ్‌కు మూడేండ్ల జైలు శిక్ష విధించారు. కాగా, గత సోమవారం మయన్మార్‌లో 5,600 మందికి పైగా ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేశారు.

మయన్మార్‌లో 2021 ఫిబ్రవరి 1న ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం పడగొట్టిన అనంతరం.. అక్కడి సైనిక పాలన తొలిసారిగా 700 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించింది. విడుదలైన ఖైదీలలో సైనిక పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టిన వారు కూడా ఉన్నట్లు బర్మీస్ వార్తా నివేదికలు తెలిపాయి. 

అలాగే, మయన్మార్ మిలిటరీ ద్వారా నిర్వహిస్తున్న మావెడి టెలివిజన్ ఛానెల్ అధికారులు, 24 మంది ప్రముఖులపై కేసులను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. ఇందులో నటులు, క్రీడాకారులు, సోషల్ మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులు, వైద్యులు, ఉపాధ్యాయులు ఉన్నారు. 

తిరుగుబాటు తర్వాత ఆంగ్ సాన్ సూకీతో పాటు ఇతర నాయకులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. తాజాగా విడుదలైన ఖైదీలలో ఎవరూ రాజకీయ ఖైదీలు లేకపోవడం విశేషం.