పాక్ జర్నలిస్ట్‌తో సోనియా ఫోటో వైరల్

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు ఐఎస్ఐతో సంబంధాలు ఉన్న పాకిస్తానీ జర్నలిస్ట్‌ అరూసా అలంతో లింకులు ఉన్నాయని, ఈ విషయమై ఆయనపై విచారణ జరగనుందని పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖిందర్ సింగ్ రాంధావా డిమాండ్ చేశారు. 
 
అయితే ఆ మరుసటి రోజుననే ఆ జర్నలిస్ట్ తో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దిగిన ఫోటోను కెప్టెన్  విడుదల చేయడం ద్వారా నేరుగా కాంగ్రెస్ అధిష్ఠానంనే ఇరకాటంలో పడవేశారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా కెప్టెన్ తొలగించినప్పటి నుంచి కాంగ్రెస్ వర్సెస్ కెప్టెన్ పోరాటంలా పంజాబ్ పరిస్థితి  తయారయింది.
అటు పంజాబ్ కాంగ్రెస్ అధినేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ సహా అనేక మంది కాంగ్రెస్ నేతలు అమరీందర్‌పై విమర్శలు గుప్పిస్తుండగా, తనకు సమయం దొరికినప్పుడల్లా కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు అమరీందర్ ప్రయత్నిస్తున్నారు.
 
అరూసా ఆలంతో కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ తీసుకున్న ఫొటోలను అమరీందర్ సింగ్ శనివారం సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది వైరల్ గా మారింది.  స్నేహాన్ని, రాజకీయాల్ని కలిపి చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. అరూసా ఆలంతో గాంధీ కుటుంబం ఎన్నోసార్లు కలిసిందని పేర్కొంటూ మరి దీనికి కాంగ్రెస్ నేతలు ఏమంటారని కెప్టెన్ ప్రశ్నించారు.
 
మరోవంక దీపావళి లోపుగా తాను ప్రారంభించబోయే ప్రాంతీయ పార్టీని కెప్టెన్ ప్రకటించనున్నట్లు తెలుస్తున్నది. నవంబర్ మధ్య నుండి పలువురు కాంగ్రెస్ నాయకుల వలస వచ్చేటట్లు ప్రణాళిక వేసుకొంటున్నట్లు చెబుతున్నారు. 
 
వచ్చే ఏడాది మొదట్లో ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాలలో కేవలం పంజాబ్ లో మాత్రమే కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాగలదని అందరూ భావిస్తుండగా, కెప్టెన్ ను గద్దె దింపిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఇరకాటంలో పడినట్లయింది. పార్టీ అధిష్ఠానం దగ్గరకు తీసిన నవజ్యోత్ సింగ్ సిద్దు చర్యలు అన్ని వివాదాస్పదం అవుతూ ఉండడంతో పార్టీకి అశనిపాతంగా మారుతున్నాయి.
 
కెప్టెన్ బీజేపీలో చేతులు కలుపుతున్నాడని కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను సహితం తనదైన రీతిలో  అమరిందర్ సింగ్ కొట్టిపారవేసారు. సిద్దు 15 ఏళ్ళు బీజేపీలో ఉన్నారని, దానికేమంటారని ప్రశ్నించారు. పైగా పార్టీ అధిష్ఠానం ఏరి, కోరి నియమించిన మహారాష్ట్ర, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్ ఎస్ ఎస్ నేపధ్యం గలవారంటూ వారేమి మాట్లాడకుండా చేశారు.