ఒడిశాలో టీచర్‌ హత్యపై బీజేపీ మహిళా మోర్చా నిరసన

ఒడిశాలో స్కూల్‌ టీచర్‌ మమితా మెహెర్‌ హత్యపై ఆ రాష్ట్ర బీజేపీ మహిళా వింగ్‌ భువనేశ్వర్‌లో శనివారం నిరసన చేపట్టింది. ముఖ్యమంత్రి  నవీన్‌ పట్నాయక్‌ అధికార నివాసం వెలుపల ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. 

రాష్ట్రంలో చట్టం చనిపోయిందని ఆరోపిస్తూ పాడెతో ర్యాలీ నిర్వహించి ఆందోళన చేశారు. ఉపాధ్యాయురాలి హత్య కేసులో ఆరోపణలున్న మంత్రి దివ్య శంకర్‌ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని అధికార బీజేడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో బీజేపీ మహిళా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మహిళా కార్యకర్తలు, పోలీస్ మహిళా సిబ్బంది మధ్య తోపులాట, ఘర్షణ జరిగింది.

బిజు స్వాస్థ్య కళ్యాణ్ యోజన పధకం కింద స్మార్ట్ హెల్త్ కార్డ్‌ల పంపిణీని ప్రారంభించినందుకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మయూర్‌భంజ్ జిల్లాను సందర్శించినప్పుడు బరిపాడ పట్టణంలో బిజెపి, జెఎంఎం నిరసన ప్రదర్శనలు నిర్వహించడంతో  రాష్ట్రంలోని ఉత్తర భాగానికి కూడా వ్యాపించాయి.

కలహండి లేడీ టీచర్ కిడ్నాప్, హత్య కేసులో మంత్రి డిఎస్ మిశ్రాను తొలగించాలని ఒడిశాలోని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ విషయంపై సిఎం నవీన్ పట్నాయక్ మౌనాన్ని ప్రశ్నించారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఉపాధ్యాయుడుగా  పనిచేసిన ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రెసిడెంట్ ను ఆ మంత్రికి సన్నిహితుడుగా చెబుతున్నారు.  నేరంలో తన పాత్రను అతను  ఒప్పుకున్నాడు. పాఠశాల కాంపౌండ్‌లో తగలబెట్టే ముందు మృతదేహాన్ని చీల్చి కాల్చినట్లు అంగీకరించాడు. నిందితులకు ఉరిశిక్ష విధించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

కలహండి జిల్లాలోని మహాలింగ్ గ్రామంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 24 ఏళ్ల మహిళా ఉపాధ్యాయురాలు అక్టోబర్ 8న అదృశ్యమైంది.  పాక్షికంగా కుళ్ళిన ఆమె మృతదేహాన్ని 11 రోజుల తర్వాత అక్టోబర్ 19న స్కూల్ ప్లేగ్రౌండ్ నుండి బయటకు తీశారు. మంత్రికి సన్నిహితులైన పాఠశాల అధ్యక్షుడితో సహా ఇద్దరు వ్యక్తులను  పోలీసులు అరెస్టు చేశారు.

కాగా, జాతీయ మహిళా కమీషన్ అధ్యక్షురాలు రేఖా శర్మ మహిళా ఉపాధ్యాయురాలు అపహరణ, హత్యను తమ కమీషన్ సుమోటో గా స్వీకరించినట్లు తెలిపారు.  డీజీపీ, సీఎంలకు లేఖ రాశామని, ఈ వ్యవహారంలో పేర్లు వస్తున్న మంత్రులను రాజీనామా చేయాలని డిమాండ్ చేశామని ఆమె వెల్లడించారు. అయితే,  రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు పని చేయలేరని ఆమె స్పష్టం చేశారు.