దేశ రక్షణ విషయంలో రాజీ పడే ప్రశ్నే లేదు

దేశ రక్షణ విషయంలో రాజీ పడే ప్రశ్నే లేదని రక్షణ మంత్రి  రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు.  దేశ రక్షణ రంగ సామర్థ్యం గత ఏడేళ్లలో పతాక స్థాయికి చేరిందని, ప్రపంచం మొత్తం భారత్‌ వైపు చూసేలా చేసిందని తెలిపారు. 

యలహంక ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో ఐఐఎఫ్‌ సదస్సు ముగింపు వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రక్షణ రంగాన్ని ఆధునీకరించేందుకు పూర్తిస్థాయిలో అధునాతన ఆయుధాలను సమకూర్చేందుకు తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతనిచ్చిందని ఆయన పేర్కొన్నారు. 

చైనా, పాకిస్థాన్‌లకు మన రక్షణ శాఖ సత్తా ఏమిటో చాటి చూపామని చెప్పారు. డిఫెన్స్‌ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వివేక్‌ రామ్‌చౌదరి, రక్షణా శాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌, కర్ణాటక రెవిన్యూ శాఖా మంత్రి ఆర్‌. అశోక్‌తో పాటు పలువురు సైనిక ఉన్నతాధికారులు ఈ సందర్భంగా హాజరయ్యారు. సదస్సులో భాగంగా యలహంక ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో భాగంగా స్వర్ణిమ్‌ విజయ్‌ వర్ష్‌ పేరిట ప్రత్యేక ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. 

2025 నాటికి ఎగుమతుల లక్ష్యం రూ.35 వేల కోట్లు

2025 నాటికి దేశ రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతి లక్ష్యం రూ.35 వేల కోట్లుగా ఉందని  రాజనాథ్‌ సింగ్‌ ప్రకటించారు. రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతిలో భారతదేశం ప్రపంచంలోనే తొలి 25 దేశాల సరసన చోటు సంపాదించిందని తెలిపారు. అమెరికా, ఇజ్రాయిల్‌తో సహా 84 దేశాలకు భారత్‌ రక్షణా రంగ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని చెప్పారు. 

వీటిలో బుల్లెట్‌ ఫ్రూప్‌ హెల్మెట్‌, ఎలక్ర్టానిక్‌, ఆటోమొబైల్‌ ఉత్పత్తులు ఉన్నాయని వివరించారు. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’లో భాగంగా రక్షణా శాఖలో 375 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగిందని వెల్లడించారు. రక్షణ రంగ సంస్థలైన హెచ్‌ఏఎల్‌, బీఈఎల్‌, బీఈఎంఎల్‌, డీఆర్‌డీఓ తదితర సంస్థలకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు.