పెట్రోల్ ధరలపై మీ నాన్నను అడుగు కేటీఆర్ 

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ విమర్శలను బీజేపీ శాసనసభా పక్ష నేత రాజాసింగ్ తీవ్ర స్వరంతో తిప్పికొట్టారు. దేశంలో పెట్రోలు ధరలు ఎందుకు పెరుగుతాయో మీకు అవగాహన లేదనుకుంటా.. యూపీయే హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన మీ తండ్రి (సీఎం కేసీఆర్‌)ని అడిగి తెలుసుకోండి అని రాజాసింగ్‌, మంత్రి కేటీఆర్‌కు కౌంటర్‌ ఇచ్చారు.

తాను పాతబస్తీలో రోడ్ల దుస్థితిపై కేటీఆర్‌కు ట్వీట్‌ చేస్తే, దానికి సమాధానం ఇవ్వకుండా ఆయన మరో అంశం ప్రస్తావించడం విడ్డూరమని ఆయన చెప్పారు. తాను ట్వీట్‌ చేసిన ఆరురోజులకయినా కేటీఆర్‌ స్పందించినందుకు ధన్యవాదాలు అంటూ ఎద్దేవా చేశారు. 

పెట్రోలు బంక్‌ వద్దకు వెళ్లి పెరుగుతున్న పెట్రోలు, డీజిలు ధరలపై వాహనదారులు ఏమనుకుంటున్నారో ఎందుకు తెలుసుకోరు? అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ చేసిన విమర్శలకు రాజాసింగ్‌ను ప్రశ్నించారు. అలాగే, సిలిండర్‌ ధరపై ఒక గృహస్థుడిని విచారించండి.. అని సూచించారు. జీడీపీ అంటే.. గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌.. విన్నారా?. అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. అదిరింపులు మానుకుని, ప్రజల మనసులు దోచుకోవాలని రాజాసింగ్‌కు కేటీఆర్ హితవు పలికారు.

పాతబస్తీలో కేటీఆర్‌ గంటపాటు ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తే ఆయనకు వెన్నునొప్పి రావడం ఖాయమని రాజాసింగ్‌ ధ్వజమెత్తారు. కేటీఆర్‌ ట్విటర్‌లోనే ఉంటరు.. భోజనం చేస్తరు.. పడుకుంటరు.. అని విమర్శించారు. 

పెట్రోలులో రాష్ట్ర వాటా చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు? అసలు నిజం మీరు చెప్పరా? అని రాజాసింగ్  నిలదీశారు. రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఉంటే కేంద్రం పన్నుల రూపేణా లీటరుకు రూ. 41 చొప్పున ఇచ్చే వాటాను రద్దుచేసుకోవాలని రాజాసింగ్‌ సవాల్ చేశారు. 

కాగా, భైంసాలో హిందువులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాజాసింగ్ మండిపడ్డారు ఎమ్మెల్యే రాజాసింగ్. రాష్ట్రంలో కారు ఒకరి చేతిలో ఉంటే, స్టీరింగ్ ఇంకొకరి చేతిలో ఉందని దయ్యబట్టారు. లవ్ జిహాద్ వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని పేర్కొన్నారు