సినిమా నటుడు రాజబాబు కన్నుమూత

తెలుగు సినిమా నటుడు రాజబాబు( 64) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. రాజబాబుకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉంది.

1957 జూన్‌ 13న రాజబాబు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నరసాపురపేటలో జన్మించారు. ఆయన తండ్రి పేరు రామతారకం. రాజబాబుకు బాల్యం నుంచే రంగస్థలం మీద నటించడం అంటే ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుంచి నాటకాలు వేస్తూ దేశమంతా తిరిగారు. 

దర్శకుడు ఉప్పలపాటి నారాయణ రావు రాజబాబును. 1995లో  “ఊరికి మొనగాడు ” అన్న సినిమాలో అవకాశం ఇచ్చి సినిమా రంగానికి పరిచయం చేశారు . ఆ తరువాత  సిందూరం సినిమా తరువాత రాజబాబును అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి . కాకినాడ నుంచి రాజబాబు హైదరాబాద్ కు మకాం మార్చి  సినిమా రంగంపై దృష్టి పెట్టారు 

సింధూరం, సముద్రం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, మురారీ, శ్రీకారం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కళ్యాణ వైభోగం, మళ్ళీ రావా, బ్రహ్మోత్సవం, భరత్ అనే నేను తదితర చిత్రాల్లో నటించారు. మొత్తం 62 చిత్రాల్లో విభిన్నమైన పాత్రలను పోషించారు.

రాజబాబు సినీ రంగంతోపాటు పలు సీరియళ్లలో కూడా నటించి మెప్పించారు. వసంత కోకిల, అభిషేకం, రాధా మధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం, చి.ల.సౌ స్రవంతి తదితర వాటిల్లో నటించారు.  రాజబాబు 48 సీరియల్స్ లో విభిన్నమైన పాత్రల్లో నటించి అందరికీ ఆత్మీయుడయ్యారు . 

2005లో ‘అమ్మ’ సీరియల్‌లోని పాత్రకు నంది అవార్డు వచ్చింది. తెర మీద గంభీరంగా కనిపించే రాజబాబు నిత్య జీవితంలో చాలా సరదామనిషి. రాజబాబును అందరూ బాబాయ్‌ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు.