తెలంగాణాలో ఎటుచూసినా డ్రగ్స్ … ఒకేరోజు రూ 6  కోట్లు పట్టివేత 

తెలంగాణాలో ఎటు చూసినా అక్రమ డ్రగ్, గంజాయి పట్టుబడుతున్నది. హైదరాబాద్ కేంద్రంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రవాణా అవుతున్నట్లు తెలుస్తూ ఉండడంతో ఎన్‌సిబి ప్రత్యేక దృష్టి పెట్టి దాడులు చేస్తున్నది. రాష్ట్రంలోని మేడ్చల్, కూకట్‌పల్లి, హైదరాబాద్, నాగర్‌కర్నూల్ ప్రాంతాలలో శనివారం ఒక్కరోజే ఎన్‌సిబి, ఎక్సైజ్ అధికారుల దాడుల్లో 8.9 కిలోల మెపిడ్రెన్,3 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. 

ఈక్రమంలో ఎన్‌సిబి, ఎక్సైజ్ అధికారుల దాడులలో దాదాపు రూ.6 కోట్ల విలువ చేసే మత్తు పదార్థాలను సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ కొరియర్ కార్యాలయంలో శనివారం నాడు ఎన్‌సిబి అధికారులు రూ. 3 కోట్ల విలువ చేసే 3 కిలోల మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. 

ఎపిలోని నరసాపురం నుంచి అస్ట్రేలియాకు తరలించే క్రమంలో హైదరాబాద్‌లో ఓ కొరియర్ కార్యాలయంలో డ్రగ్స్ ఉన్నట్లు ఎన్‌సిబి జోనల్ డైరెక్టర్ అమిత్ ఘవాటేకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు చేసిన పార్శిల్‌లో చీరల లోపల భాగంగాలో మాదకద్రవ్యాలు ఉన్నట్లు గుర్తించిన ఎన్‌సిబి అధికారులు వెంటనే స్వాధీనం చేసుకున్నారు.

కాగా ఆస్ట్రేలియాలో ఓ తెలుగు కుటుంబం వివాహ వేడుకలకు భారీగా డ్రగ్స్ తరలిస్తున్నట్లు ఎన్‌సిబి అధికారుల ప్రాధమిక విచారణలో తేలింది. కొరియర్ కార్యాలయంలోని చీరల పార్శిల్‌లో ఎవరికీ అనుమానం రాకుండా చీరల ఫాల్స్‌ను మాదకద్రవ్యాలు నింపి కుట్టేసినట్లు అధికారులు గుర్తించారు. 

ఈ డ్రగ్స్‌ను కొరియర్ చేసిన వ్యక్తి వివరాలను ఎన్‌సిబి అధికారులు పరిశీలించడంతో చెన్నైకు చెందిన వ్యక్తిగా తేలింది. కొరియర్ కార్యాలయంలో సమర్పించిన వివరాల ఆధారంగా ఎన్‌సిబి అధికారులు చెన్నె వెళ్లి ఆరా తీయగా కొరియర్ చేసిన వ్యక్తి చిరునామా తప్పుగా ఉన్నట్లు తేలింది. 

అదేవిధంగా కొరియర్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి కొరియర్ సిబ్బందికి నకిలీ గుర్తింపు కార్డులు ఇచ్చినట్లు విచారణలో తేలడంతో ఎన్‌సిబి అధికారులు సాంకేతిక పరిజ్ఞానంతో కొరియర్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తరలింపులో సంబంధం ఉన్న వ్యక్తుల వివరాలపై ఎన్‌సిబి ఆరా తీస్తోంది. 

ఇదిలావుండగా బెంగళూర్ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకొస్తున్న మరో ముఠాను ఎన్‌సిబి అధికారులు కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన దేవనహల్లి టోల్ గేట్ వద్ద అరెస్ట్ చేశారు. కారులో వెళ్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించిన బెంగళూర్ ఎన్‌సిబి అధికారులకు లభ్యమైన సమాచారం మేరకు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు.

నిందితులు బెంగళూర్ నుంచి మాదకద్రవ్యాలు తీసుకెళ్లి హైదరాబాద్‌లోని పబ్బుల్లో విక్రయిస్తున్నట్లు ఎన్‌సిబి దర్యాప్తులో తేలింది. ఎన్‌సిబికి పట్టుబడిన నిందితుల్లో హైదరాబాద్‌కు చెందిన యువకుడితో పాటు ఎపి, బిహార్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులున్నట్లు సమాచారం.