రైతుల నిరవధిక ధర్నా పట్ల సుప్రీంకోర్టు అస‌హ‌నం

నూత‌న సాగు చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ.. ధ‌ర్నా చేస్తున్న రైతుల వైఖ‌రిపై సుప్రీంకోర్టు అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. నిర‌స‌న వ్య‌క్తం చేసే హ‌క్కు రైతుల‌కు ఉన్న‌ద‌ని, కానీ నిర‌వ‌ధికంగా రోడ్ల‌ను బ్లాక్ చేయ‌డం స‌రికాదు అని సుప్రీంకోర్టు పేర్కొన్న‌ది. 
 
రోడ్లపై నుంచి నిరసనకారులను ఖాళీ చేయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై మూడు వారాల్లోగా సమాధానం సమర్పించాలని రైతు సంఘాలను ఆదేశించింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. 
 
యూపీలోని నోయిడాకు చెందిన మోనికా అగ‌ర్వాల్ వేసిన కేసును ఇవాళ సుప్రీం ధ‌ర్మాస‌నం విచారించింది. ఢిల్లీ సరిహద్దుల్లోని రోడ్లపై పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నాయి. దాదాపు ఓ సంవత్సరం నుంచి రోడ్లను దిగ్బంధిచడంతో ప్రజలకు ఇబ్బందిగా ఉందని, వీరిని రోడ్లపై నుంచి ఖాళీ చేయించాలని కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. 
 
జ‌స్టిస్ సంజ‌య్ కిషాన్ కౌల్‌, ఎంఎం సుంద‌రేశ్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం విచార‌ణ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. రైతుల ధ‌ర్నా అంశంలో తుది ప‌రిష్కారం కావాల్సి ఉంద‌ని ధ‌ర్మాస‌నం అభిప్రాయ‌ప‌డింది. 
 
కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నా.. రైతు నిర‌స‌న హ‌క్కుల‌కు వ్య‌తిరేకం కాదు అని, కానీ ఎప్ప‌టికీ రోడ్ల‌ను బ్లాక్ చేయ‌డం స‌రికాదు అని సుప్రీంకోర్టు పేర్కొన్న‌ది. ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో ధ‌ర్నా చేస్తున్న నిర‌స‌న‌కారుల‌ను తొల‌గించేందుకు రైతు సంఘాల‌కు మూడు వారాల స‌మ‌యం ఇస్తున్న‌ట్లు కోర్టు పేర్కొన్న‌ది.