కరోనాపై పోరాటంలో భారత్ అసాధారణ మైలురాయిని అందుకున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ మరో మైలురాయిని అధిగమించింది. ఇవాళ్టి వరకు దేశవ్యాప్తంగా వంద కోట్ల కోవిడ్ టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు బిలియన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో చైనా తర్వాత బిలియన్ డోసులు పంపిణీ చేసిన దేశంగా భారత్ నిలిచింది.
గురువారం ఉదయం 10 గంటల వరకు 100 కోట్ల వ్యాక్సిన్ డోసులను ప్రజలకు ఇచ్చారు. ఇది అమెరికాలో ఇచ్చిన వ్యాక్సిన్ డోసుల కన్నా రెట్టింపు, జపాన్‌లో కన్నా ఐదు రెట్లు, జర్మనీలో కన్నా తొమ్మిది రెట్లు, ఫ్రాన్స్‌లో కన్నా 10 రెట్లు అధికం. దేశ జనాభాలో వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులైనవారిలో 75 శాతం మంది కోవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ చరిత్రాత్మక ఘనత సాధించేందుకు మన దేశానికి 9 నెలలు పట్టింది.
జమ్మూ-కశ్మీరు, లడఖ్, ఉత్తరాఖండ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ, గోవా, లక్షద్వీప్ నూటికి నూరు శాతం తొలి డోస్ వ్యాక్సినేషన్ జరిగినట్లు తెలిపింది. నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అర్హులైనవారిలో 90 శాతం మందికి తొలి డోసు వ్యాక్సినేషన్ జరిగినట్లు పేర్కొంది. ఈ ఏడాది చివరినాటికి దేశంలోని మొత్తం 94.4 కోట్ల మంది వయోజనులకు వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించుకున్నది.
ఈ ఏడాది జనవరి 16న కరోనా టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమయింది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్లను సరఫరా చేయడం కోసం డ్రోన్లను కూడా ఉపయోగించడం విశేషం. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17న రికార్డు స్థాయిలో 2.5 కోట్ల మందికి టీకా పంపిణీ చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ భారత్ చరిత్ర సృష్టించినట్లు తన ట్విట్టర్ అకౌంట్‌లో పేర్కొన్నారు. భారతీయ సైన్సు, వ్యాపారంతో పాటు 130 కోట్ల మంది భారతీయుల స్పూర్తికి ఇది సాక్ష్యమని ఆయన తెలిపారు. వ్యాక్సినేషన్‌లో వంద కోట్లు దాటిన నేపథ్యంలో దేశ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ అద్భుతమైన ఘనత సాధన కోసం కృషి చేసిన డాక్టర్లు, నర్సులు, అందరికీ ఆయన కృతజ్ఞతలు చెప్పారు. వ్యాక్సిన్ డోసుల పంపిణీ వంద కోట్ల మార్క్ దాటిన నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ ఢిల్లీలోని ఆర్ఎంఎల్ హాస్పిటల్‌కు వెళ్లారు. అక్కడ ఆయన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు.
టీకా డేటాను నిశితంగా పరిశీలిస్తే భారతదేశం టీకాల డ్రైవ్ చాలా సమంజసంగా ఉందని తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం టీకా మోతాదులో 65 శాతానికి పైగా నిర్వహించింది. మొత్తంమీద, అంచనా వేసిన వయోజన జనాభాలో 75 శాతం మందికి మొదటి మోతాదు లభించగా, 31 శాతం మందికి పూర్తిగా టీకాలు వేశారు.
“భారతదేశంలోని ప్రజలకు, ఆరోగ్య సంరక్షణ కార్మికులకు అభినందనలు. భారతదేశంలో టీకా కార్యక్రమం ప్రారంభమైన కేవలం 9 నెలల్లోనే ఏ దేశానికైనా 1 బిలియన్ డోస్ మార్కును చేరుకోవడం విశేషం” అని డాక్టర్ నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికె పాల్ పేర్కొన్నారు.
మరో కరోనా మైలురాయిని చేరుకున్నందుకు భారతదేశాన్ని అభినందిస్తూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయ ఆసియా ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్ “మరో మైలురాయిని సాధించినందుకు భారతదేశానికి గొప్ప అభినందనలు-ఒక బిలియన్ కరోనా టీకాల మోతాదులు నిర్వహించారు. బలమైన రాజకీయ నాయకత్వం, ఇంటర్-సెక్టోరల్ కన్వర్జెన్స్, మొత్తం ఆరోగ్య, ఫ్రంట్‌లైన్ వర్క్‌ఫోర్స్, ప్రజలు చేసిన కృషి లేకుండా స్వల్ప వ్యవధిలో ఈ అసాధారణ ఫీట్ సాధ్యం కాదు” అని తెలిపారు.
10 కోట్ల టీకా మార్కును భారత్ 85 రోజులలో చేరుకోగా, 20 కోట్ల మార్కును దాటడానికి మరో 45 రోజులు, 30 కోట్ల మార్కును చేరుకోవడానికి మరో 29 రోజులు పట్టిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 30 కోట్ల డోసుల నుండి దేశం 40 కోట్ల మార్కును చేరుకోవడానికి 24 రోజులు పట్టింది. తర్వాత ఆగస్టు 20 న 50 కోట్ల టీకా మార్కును అధిగమించడానికి మరో 20 రోజులు పట్టింది.
నేడు వంద కోట్లకు చేరనుండటంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద 1400 కిలోల త్రివర్ణపతాకం ప్రదర్శించారు. వంద కోట్ల లక్ష్యాన్ని చేరిన వెంటనే విమానాలు, రైల్వేస్టేషన్లు, నౌకలు, మెట్రో రైళ్లలో ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ దవాఖానల్లోనూ ప్రత్యేకంగా వేడకలు నిర్వహిస్తారు. ఢిల్లీ విమానాశ్రయంలో స్పైస్‌జెట్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
More Stories
వేయి మంది మావోయిస్టులను చుట్టుముట్టిన 20 వేల బలగాలు
ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని శిక్ష
సింధూ జలాల ఒప్పందం నిలిపివేతతో సంక్షోభంలో పాకిస్తాన్!