డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపు ఇంకెప్పుడు.. హైకోర్టు ప్రశ్న

నిర్మాణాలు పూర్తయిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకపోవడంపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరింది. పూర్తయిన ఇండ్లను లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వడం లేదో తెలియజేయాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గృహనిర్మాణ శాఖ ముఖ్యకార్యదర్శి, హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ, జీహెచ్‌ఎంసీ, అన్ని జిల్లాల కలెక్టర్లకు బుధవారం నోటీసులు జారీచేసింది. 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌రూం గృహాలు ప్రారంభం కాకుండానే శిథిలావస్థకు చేరుతున్నాయని, వాటిని లబ్ధిదారులకు కేటాయుంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీజేపీ నేత,, మాజీ ఎమ్యెల్యే నల్లు ఇంద్రసేనారెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది జూలై 31 నాటికి లక్షా 87 ఇండ్ల నిర్మాణం పూర్తయిందని, వాటిలో కేవలం 12,656 గృహాలను మాత్రమే లబ్ధిదారులకు అందజేశారని వ్యాజ్యంలో పేర్కొన్నారు. దాదాపు 88 శాతం ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకుని ఖాళీగా ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది సృజన్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ లబ్ధిదారులకు గృహాలు కేటాయించేందుకు నిర్ణీత గడువు విధించాలని ధర్మాసనాన్ని కోరారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఈ అంశంపై వివరణ తెలియజేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, అన్ని జిల్లాల కలెక్టర్లకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదాపడింది.
 
తెలంగాణలోని పేదలు అందరికి రెండు పడకల ఇండ్లు కట్టిస్తామని 2014 ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఏడేండ్లు దాటినా అమలు పరచే ఉద్దేశ్యం ముఖ్యమంత్రి కేసీఆర్ లో కనిపించడం లేదు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా హడావుడి చేయడం మినహా పేదలకు ఇండ్లు కట్టించి ఇచ్చే ఉద్దేశ్యం రాష్ట్ర ప్రభుత్వంలో కనిపించడం లేదు. మరో 1,88,343 ఇండ్లు నిర్మాణ దశలోనే ఉన్నాయి. సర్కారు నిధులివ్వకపోవడంతో పనులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. వాటిని పూర్తి చేసే ఉద్దేశ్యం కనబడటం లేదు. దీంతో తమకు ఇండ్లను ఇంకెప్పుడు ఇస్తారంటూ లబ్ధిదారులు నిలదీస్తున్నారు.
పేదలకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇస్తామని 2014 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్‌ఎస్‌ హామీ ఇచ్చింది. జిల్లాల్లో 2 లక్షలు, హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ ఇళ్లను నిర్మించి ఇస్తామని 2018 ఎన్నికల్లోనూ చెప్పింది. కానీ హామీ పూర్తిగా అమలు కాలేదు. మరోవైపు డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. 
 
కానీ ఆయా ప్రాంతాల్లో నిర్మించిన ఇండ్లు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న ఇండ్ల సంఖ్య 2,91,057. కానీ అప్లికేషన్లు భారీగా వస్తున్నాయి. నియోజకవర్గాల్లో వందల్లో నిర్మిస్తున్న ఇండ్లను ఎట్ల ఇవ్వాలనేది మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలకు అర్థం కావడం లేదు. 
 
జిల్లాలు, జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ మీటింగ్ పెట్టినా డబుల్ ఇండ్ల కోసం లక్షల్లో దరఖాస్తులు వస్తున్నాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూం ఇండ్ల కోసం దాదాపు 7 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అన్ని జిల్లాలను తీసుకుంటే ఈ సంఖ్య 24 లక్షలు దాటుతుందని గృహ నిర్మాణ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారమే రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలు 26.31 లక్షల మంది ఉన్నట్లు తేలింది. లబ్ధిదారులను కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక చేయాల్సి ఉంది. కానీ నిర్మాణాలు పూర్తయిన చోట ఎక్కువ మంది లబ్ధిదారులు ఉండటం, ఇండ్లు తక్కువగా ఉండటంతో రేపు, మాపు అంటు వాయిదా వేస్తున్నరు.
 
మరోవైపు డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ఇప్పటిదాకా సర్కార్ స్పష్టమైన మార్గదర్శకాలేవీ విడుదల చేయలేదు. ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డు, రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డు, సొంతిల్లు లేకపోవడం వంటి డాక్యుమెంట్లను ప్రామాణికంగా తీసుకుంటున్నామని చెబుతున్నారు. 
 
అయితే సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు నియోజకవర్గాల్లో ఇండ్లు కొన్ని నిర్మించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మిగతా జిల్లాల్లో కట్టినా పంపిణీ చేయడం లేదు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ నిర్మాణం పూర్తయిన ఇండ్లు ఉన్నాయి. దాదాపు లక్ష ఇండ్లు పూర్తయి, లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా ఖాళీగా ఉన్నట్లు అధికారిక లెక్కలే వెల్లడిస్తున్నాయి.