యూట్యూబ్ ఛానల్స్‌‌పై సమంత పరువు నష్టం దావా

 
సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేసిన యూట్యూబ్ ఛానెల్స్ పై ప్రముఖ నటి సమంత కోర్టుకెళ్లారు.  తన పరువుకు నష్టం వాటిల్లే విధంగా వివరించిన మూడు యూట్యూబ్ ఛానల్స్ పై కూకట్ పల్లి కోర్టులో ఆమె  పరువు నష్టం దావా కేసు వేశారు. సమంత తరుపున హైకోర్ట్ లాయర్ బాలాజీ వాదనలు వినిపించనున్నారు. సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత వారిపై సోషల్ మీడియాలో రకరకాల  పుకార్లు, ఊహాగానాలు తెర‌పైకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. 
 
సుమన్ టివి, తెలుగు పాపులర్ టీవీ, టాప్ తెలుగు టీవీ తో పాటు వెంకట్రావు అనే అడ్వకేట్‌‌పై ఆమె పిల్ దాఖలు చేశారు. త‌న‌ను కించ‌ప‌రిచేలా వ్యాఖ్య‌లు చేశార‌ని, త‌న‌పై దుష్ప్ర‌చారం చేయ‌కుండా ఆదేశించాల‌ని కోర్టును సమంత విజ్ఞ‌ప్తి చేసింది.  మీడియా, పత్రికల ద్వారా వారు బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పేలా కోర్టు ఆదేశించాలని కోరారు. మరిన్ని వివరాలు సేకరిస్తున్నానని.. పరువు నష్టం ఎంతనేది తర్వాత కోరతానని తెలిపారు. ఇకపై ఎవరూ తనపై దుష్ప్రచారం చేయకుండా మధ్యంతర ఆదేశాలివ్వాలని, ప్రసారమైన ఇంటర్వ్యూలను తొలగించేలా ఆదేశించాలని నటి సమంత న్యాయస్థానాన్ని కోరారు.
 
గతంలో సమంత తన విడాకులపై సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్న వదంతులు అన్నింటిని తోసిపుచ్చారు. “వ్యక్తిగత సంక్షోభంలో మీ భావోద్వేగ పెట్టుబడి నన్ను ముంచెత్తింది. లోతైన సానుభూతి, ఆందోళనను ప్రదర్శించినందుకు, తప్పుడు పుకార్లు, వ్యాప్తి చెందుతున్న కథనాల నుండి నన్ను రక్షించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు” అంటూ ఆమె ట్వీట్ చేశారు. 
 
పైగా, “వారు నాకు అక్రమ సంబంధాలున్నాయని, నేను పిల్లలు కావాలని అనుకోలేదని, నేను అవకాశవాదిని అని, ఇప్పుడు నాకు అబార్షన్ చేయించారని చెప్పారు. విడాకులు చాలా బాధాకరమైన ప్రక్రియ. నాకు నయం కావడానికి సమయం ఇవ్వనివ్వండి. వ్యక్తిగతంగా నాపై జరిగిన ఈ దాడి కనికరంలేనిది. కానీ నేను మీకు ఇది వాగ్దానం చేస్తున్నాను, నేను దీనిని లేదా వారు చెప్పే ఇంకేదైనా అనుమతించను” అంటూ స్పష్టం చేస్తూ ఆమె ట్వీట్ ఇచ్చారు.

సమంత, నాగ చైతన్య ఈ నెల ప్రారంభంలో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇద్దరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక నోట్  ద్వారా “మా శ్రేయోభిలాషులందరికీ. చాలా చర్చలు, ఆలోచనల తరువాత, చైతన్య, నేను మా స్వంత మార్గాలు కొనసాగించడానికి భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము” అని వారు ప్రకటించారు. 

 
“ఒక దశాబ్దానికి పైగా స్నేహంగా ఉండటం మా అదృష్టం,. ఇది మా మధ్య ఒక ప్రత్యేక బంధాన్ని కలిగిస్తోందని మా నమ్మకం. ఈ క్లిష్ట సమయంలో మా అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియా మాకు మద్దతునివ్వాలని, మేము ముందుకు సాగడానికి అవసరమైన గోప్యతను అందించమని మేము అభ్యర్థిస్తున్నాము. మీ మద్దతుకు ధన్యవాదాలు.” అంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.