హరీశన్నా.. నిన్ను బలిచేస్తారు, జాగ్రత్త!

`హరీశన్నా.. నిన్ను బలిచేస్తారు, జాగ్రత్తగా ఉండు’ అని ఆర్ధిక మంత్రి టి హరీష్ రావును  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. ఎక్కడ గెలవరో అక్కడికి హరీశ్‎ను పంపిస్తారు. హరీశ్ రావును బయటకు పంపడానికి టాస్క్ స్టార్ట్ అయింది. హరీశ్ రావును ఓడిపోయే దగ్గరికి పంపి, గెలిచే దగ్గరికి కేసీఆర్, కేటీఆర్ వస్తారని పేర్కొన్నారు. 
 
హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ఆయన జమ్మికుంట మండలం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఎట్టి పరిస్థితుల్లో హుజురాబాద్‎లో టీఆర్ఎస్ గెలవదని తెలిసి హరీశ్‎ను పంపారని స్పష్టం చేశారు. హరీశ్ మీద తమకు కోపం లదని చెబుతూ `నీ మీద గురిపెట్టారు. జాగ్రత్తగా ఉండు. నిన్ను పార్టీ నుంచి బయటకు పంపడానికి స్కెచ్ వేశారు’ అంటూ ఆర్ధిక మంత్రిని వారించారు.
 
అబద్ధాలాడకు హరీశన్నా అంటూ మంచి చెప్పు. నీవు ఏం చేశావో చెప్పు. మేం చేసింది కూడా చెబుతాం. పేదోళ్ల పొట్ట కొట్టకండి అని సంజయ్ అభ్యర్ధించారు. ఈటల రాజేందర్ ఉద్యమకారుడు. హరీశ్ కూడా ఉద్యమకారుడే అని పేర్కొన్నారు. సీఎం కొన్ని కమిటీలు వేశాడట. అందులో లంచాలు తీసుకునే కమిటీ, మీడియా ముందు అబద్ధాలు చెప్పే కమిటీ, కమిషన్లు తీసుకునే కమిటీ వేశారు. మళ్లీ ఈటలే గెలుస్తాడు. ఆ తర్వాత బలిపశువుల కమిటీ పెట్టి.. దానికి హరీశ్‎ను అధ్యక్షున్ని చేస్తారు. హరీశ్ రావు మంచోడే. హరీశన్నా.. నిన్ను బలిచేస్తారు అంటూ చెప్పుకొచ్చారు.
 
‘దళితబంధు అకౌంట్లో డబ్బులేసి ఆపడానికి కేసీఆర్ ఎవరు? దేనికైనా ఆ డబ్బులు వాడుకోవచ్చని చెప్పి ఎందుకు వాడుకోవడానికి అనుమతి ఇవ్వడం లేదు?. అదే విషయంపై తాము లేఖ రాశాం తప్ప.. డబ్బులు ఆపమని  లేఖ రాయలేదని సంజయ్ స్పష్టం చేశారు. బీజేపీ వాళ్లు దళితబంధు ఆపాలని ఈసీకి లేఖ రాశారని అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. 
 
‘బీజేపీ లేఖ రాయడం వల్లే దళిత బంధు ఆగిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌ వల్లే పథకం ఆగిపోయిందని నేను నిరూపిస్తా.. నువ్వు రాజీనామా చేస్తావా? ఒకవేళ బీజేపీ వల్లే పథకం ఆగిపోయిందని నువ్వు నిరూపించు.. నేను దేనికైనా సిద్ధం..’ అని కేసీఆర్  కు సవాల్ చేశారు. 
 
ఈ నెల 27న ఇక్కడికి సీఎం వస్తారట అంటూ `మేము ఏం రాసామో ఓసారి చదువు. దళితబంధు డబ్బులు ఎవరు ఆపారో ప్రజలు నిర్ణయిస్తారు’ అని సవాల్ చేశారు. సీఎం పక్కా ఢోకాభాజీ. ఎన్నికలప్పుడు హామీలివ్వడం తప్ప ఆయన ఏమీ చేయడని సంజయ్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గర్వం అణిచే విధంగా హుజూరాబాద్‌ ప్రజలు టీఆర్‌ఎస్‌ బాక్సులు బద్దలు కొట్టాలని పిలుపిచ్చారు. హుజూరాబాద్‌లో జరుగుతున్న ఉప ఎన్నికలో ప్రజలు ఇచ్చే తీర్పు.. తెలంగాణలో మార్పు తెస్తుందని పేర్కొన్నారు. 
 
ఈటల కాంగ్రెస్‌లోకి పోతాడని టీఆర్‌ఎస్‌ వాళ్లు అసత్యపు ప్రచారాలు చేస్తున్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ  డ్రామాలుఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలయ్యాక టీఆర్‌ఎస్‌లో ఎవ్వరూ మిగలరని, కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత తప్ప అందరూ బీజేపీలోకి వస్తారని తెలిపారు. హుజూరాబాద్‌ ప్రజలకు రెండు రోజుల ముందే దీపావళి వస్తోందని చెబుతూ నవంబరు 2న ఈటల రాజేందర్‌ గెలుపుతో పండుగ జరుపుకుందామని చెప్పారు.
నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం అన్నాడు. దళిత ముఖ్యమంత్రి అన్నాడు లేదంటే తల నరుక్కుంటా అన్నాడని గుర్తు చేశారు. నాగార్జున సాగర్‎లో కూడా ఇలాగే చెప్పాడు. యాదవుల దగ్గర తీసుకున్న వందల కోట్లు అకౌంట్లో పెట్టుకుని గొర్రెలు ఇవ్వడం లేదని తెలిపారు. ఈతచెట్ల దగ్గర, తాటిచెట్ల దగ్గర కల్లు అమ్ముకుంటే పోలీసులతో డ్రంక్ డ్రైవ్ చేస్తూ గౌడన్నలను వేధిస్తున్నారు. గొర్రెలు, బర్రెలు అయిపోయాయి.. ఇప్పుడు కోళ్లు ఇస్తారట. గొర్రెలు, బర్రెలు తీసుకున్నోళ్లు ఎంత మంది కోటిశ్వరులు అయ్యారో చెప్పాలని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ మోసకారి.. ఆయనను నమ్మకండి అని ప్రజలను సంజయ్ హెచ్చరించారు. హైదారాబాద్‎లో వరదలొస్తే పదివేలు ఇస్తానని ఇవ్వలేదు. నాగార్జున సాగర్‎లో గొర్రెలివ్వలేదని గుర్తు చేస్తూ . మీకు న్యాయం జరగాలంటే టీఆర్ఎస్ ఓడాలని స్పష్టం చేశారు. పువ్వు గుర్తు గెలివాలి.  అప్పుడే కేసీఆర్ అహంకారం పోతుందని చెప్పారు. కేసీఆర్ కొడుకు, బిడ్డ ఎవరు త్యాగం చేశారు?. మన పేదలు త్యాగం చేశారు. శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వాళ్లు ప్రాణ త్యాగం చేసారని చెప్పారు.