
ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌లో ఇవాళ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ద యాత్రికుల కోసం ఈ విమానాశ్రయం ఎంతో ఉపయోగపడనున్నది.
దశాబ్ధాల ఆశలు, ఆశయాల ఫలితమే కుషీనగర్ విమానాశ్రయమని, ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించడం సంతోషకరంగా ఉందని, ఇదో ఆధ్యాత్మిక ప్రయాణమని, ఇది ఎంతో సంతృప్తినిస్తోందని ప్రధాని పేర్కొన్నారు. మరి కొద్ది వారాల్లో ఢిల్లీ నుంచి కుషీనగర్‌కు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్టు స్పైస్‌జెట్ తనకు తెలియజేసిందని తెలిపారు.
ఖుషీనగర్ విమానాశ్రయం కేవలం ఎయిర్ కనెక్టివిటీ మాత్రమే కాదని చెబుతూ రైతులు, జంతు ప్రేమికులు, షాప్ ఓనర్లు, కార్మికులు, స్థానిక పారిశ్రామికవేత్తలకు దీని ద్వారా లబ్ధి చేకూరుతుందని ప్రధాని తెలిపారు. వ్యాపార సముదాయ వాతావరణాన్నిసృష్టిస్తుందని చెప్పారు. \ఈ విమానాశ్రయం వల్ల పర్యాటక రంగం ఎక్కువగా లబ్ధి పొందుతోందని పేర్కొంటూ స్థానిక యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయని ప్రధాని తెలిపారు. రానున్న 4 ఏళ్లలో దేశవ్యాప్తంగా 200 విమానాశ్రయాలు, హెలిపోర్ట్‌లను నిర్మించనున్నట్లు ప్రధాని వెల్లడించారు.
గౌతమ బుద్దుడితో సంబంధం ఉన్న అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని మోదీ ఈ సందర్భంగా చెప్పారు. బౌద్ద భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు ఆయన వెల్లడించారు. ఖుషీనగర్ అభివృద్ధి కేంద్ర, యూపీ ప్రభుత్వ ఎజెండాలో ఉందని పేర్కొన్నారు. యూపీలో కొత్తగా 9 విమానాశ్రయాలను నిర్మిస్తున్నామని, జివార్ విమానాశ్రయం దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్ట్ అవుతుందని ప్రధాని తెలిపారు.
కాగా ఎయిర్ ఇండియాకు సంబంధించిన కీలక అడుగును వేశామని ప్రధాని మోదీ గుర్తు చేశారు. దివాళా దశలో ఉన్న ఎయిర్ ఇండియాను పునరుద్దరించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. దేశంలోని పౌర విమానయాన రంగాన్ని ప్రొఫెషనల్‌గా నడిపించేందుకు, సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని, భద్రత కల్పించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల భారతీయ విమానయాన రంగానికి కొత్త ఎనర్జీ వస్తుందని ప్రధాని భరోసా వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియాను రూ 18వేల కోట్లకు టాటా సన్స్ సంస్థ బిడ్డింగ్‌లో దక్కించుకున్న విషయం తెలిసిందే.
భారత్ నుండి అతిపెద్ద బహుమతి బుద్ధిజం
భారత్ నుంచి అందుకున్న అతిపెద్ద బహుమతి బుద్ధిజం అని శ్రీలంక క్రీడా శాఖ మంత్రి నమల్ రాజపక్స తెలిపారు. హిందూయిజం, బుద్ధిజం సహజీవనం సాగిస్తుంటాయని, లోతైన సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నాయని, కుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో ఈ బాంధవ్యం మరింత పటిష్టం కానుందని చెప్పారు.
కుషీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టే తొలి విమానం శ్రీలంక ఎయిర్‌లైన్స్‌దే కావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంటూ ఇందుకు తమను ఆహ్వానించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బుద్ధుడి అనుచరులకు ఖుషీనగర్ ఓ ప్రధాన పర్యాటక ప్రదేశం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ భక్తులు ఇక్కడకు వస్తుంటారు. గౌతమ బుద్ధుడు ఇక్కడే మహానిర్యాణం పొందారు. బౌద్ద ఆధ్యాత్మిక యాత్రికులకు ఇదో చాలా ముఖ్యమైన యాత్రాస్థలం. ఖుషీనగర్ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీలంక నుంచి తొలి విమానం ఇక్కడ ల్యాండ్ అయ్యింది. ఆ విమానంలో శ్రీలంక మంత్రులతో పాటు బౌద్ద మతగురువులు వచ్చారు.
More Stories
బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అరెస్ట్
కుంభమేళా విజయవంతం.. సమిష్టి కృషికి నిదర్శనం
నాగ్‌పుర్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ