మార్చి 28న యాదాద్రి పునఃప్రారంభం

యాదాద్రి లక్ష్మీనర్సింహాస్వామి ఆలయం వచ్చే సంవత్సరం మార్చి 28వ తేదీన మహా కుంభ సంప్రోక్షణతో పునఃప్రారంభానికి ముహూర్తం ఖరారు చేసినట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఎనిమిది రోజుల ముందు నుంచి మహా సుదర్శన యాగం జరుగుతుందని తెలిపారు. 

ఆగమ నియమ నిబంధనల మేరకు నిర్మాణ పనులు జరిగాయని చెబుతూ ఈ ఆలయ వైభవం నలుదిక్కులా చాటేందుకు పునర్నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. ప్రారంభోత్సవానికి తొమ్మిది రోజుల పాటు మహా సుదర్శన యాగం జరుగుతుందని సిఎం కెసిఆర్ తెలిపారు. 

చిన జీయర్ స్వామి పర్యవేక్షణలో 1008 హోమకుండాలతో 10వేల మంది రుత్వికులతో మహా సుదర్శన యాగం ఉంటుందని పేర్కొన్నారు. హోమానికి కావాల్సిన లక్షా యాభై వేల కిలోల నెయ్యిని కూడా సమీకరిస్తున్నామని సిఎం తెలిపారు. ఇప్పటికే 1500 మంది భక్తులుండేందుకు కావాల్సిన ధర్మశాలలను అందుబాటులో ఉంచామని ఆయన తెలిపారు.

యాదాద్రిలో నృసింహ సాగర్ కూడా పూర్తి కావచ్చిందని, ప్రతినిత్యం స్వామివారికి ఆ జలాలతో అభిషేకం నిర్వహించవచ్చని చెప్పారు. ఏదైనా పొరపాటు జరిగిన స్వామివారు క్షమించి తన కార్యాన్ని పూర్తి చేసుకోవాలని కోరుతున్నానని తెలిపారు.ఆలయం ప్రారంభమైనా… యాదాద్రి అభివృద్ధి పనులు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. 

రాష్ట్రపతి, ప్రధాని, సిఎంల విడిదికి ప్రత్యేకంగా ప్రెసిడెన్షియల్ సూట్ ఏర్పాటు చేస్తున్నామని చెబుతూ పుణ్యక్షేత్రాల పునర్నిర్మాణంతో ఈ ప్రాంతమంతా ఆధాత్మిక శోభతో సరి కొత్తగా కనిపిస్తుందని కేసీఆర్ భరోసా వ్యక్తం చేశారు. రూ.6.90 కోట్లతో అన్ని సౌకర్యాలతో కూటిన ఆధునాతనమైన బస్టాండ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కొండపైకి ఉచిత బస్సు ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

అంతర్జాతీయ ప్రమాణాలతో టెంపుల్ సిటి నిర్మాణం జరుగుతోందని సిఎం కెసిఆర్ వెల్లడించారు. ఇందులో భాగంగా టెంపుల్ సిటీలోని 850 ఎకరాలకు సంబంధించి మొదటి దశలో 250 ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో కాటేజీలు, ఉద్యానవనాలు, రోడ్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఒక్కో కాటేజీలో నాలుగు సూట్లు ఉంటాయని చెప్పారు. 

యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ, యాదాద్రి ఆధ్యాత్మిక నగర రూపకల్పనకు ప్రణాళికలు రూపొందించిందని తెలిపారు. 12 భాగాలుగా అంచెల వారీగా నిర్మాణం కొనసాగుతుందని వివరించారు. మొత్తం వేయి ఎకరాలలో భక్తులకు సకల సదుపాయాలు కల్పించేలా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో యాదాద్రి నిర్మాణం జరుగుతోందని కేసీఆర్ హామీ ఇచ్చారు.