హుజూరాబాద్‌ లో దళితబంధుకు ఈసీ బ్రేక్‌

ఉప ఎన్నిక జరుగుతున్న హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో దళిత బంధు పథకం అమలుకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ఉప ఎన్నిక ముగిసేదాకా ఈ నియోజకవర్గ పరిధిలో అన్ని రూపాల్లోనూ దళిత బంధు పథకం అమలును నిలిపివేయాలని భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) సోమవారం ఆదేశించింది. 

నియోజకవర్గంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున.. ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఉప ఎన్నిక ముగిశాక పథకాన్ని యథావిధిగా కొనసాగించుకోవచ్చని సూచించింది. ఈ మేరకు ఈసీఐ ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ తెలిపారు. 

ఈ నెల 30 వరకు హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని నిలిపివేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వాస్తవానికి ఈ పథకాన్ని నిలిపివేయాల్సిందిగా సీఈసీకి ఏ రాజకీయ పార్టీగానీ, వ్యక్తులుగానీ ఫిర్యాదు చేయలేదు. 

ఈ అంశంపై తమను ఎవరూ కోరలేదని రాష్ట్ర ఎన్నికల అధికారులు కూడా ఇదివరకే స్పష్టత ఇచ్చారు. అయినా ఈసీ తనంతట తానుగా నిర్ణయం తీసుకుంది. కాగా, హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మొత్తం 20,929 దళిత కుటుంబాలు ఉండగా.. ఇప్పటికే మొదటి విడతగా 18 వేల మంది బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం నగదును జమ చేసింది.

ఒక్కొక్కరి ఖాతాలో రూ.9.90 లక్షల చొప్పున జమ చేశారు. రూ.10 వేలను రక్షణ నిధికి కేటాయించారు. అయితే రూ.9.90 లక్షల నిధులను వినియోగించుకోకుండా ఫ్రీజింగ్‌ విధించారు. లబ్ధిదారులు ఈ మొత్తంతో ఏ వ్యాపారం చేద్దామనుకుంటున్నారో, ఏ యూనిట్‌ స్థాపించాలనుకుంటున్నారనే దానిపై అధికారులు సర్వే చేసి నివేదికలు సిద్ధం చేశారు.

వాటికి సంబంధించి ప్రాజెక్టు రిపోర్టులు సమర్పించి లబ్ధిదారులు ఆయా యూనిట్ల స్థాపనకు అవసరమైన శిక్షణ పొందిత తరువాత నిధులు విడుదల చేస్తామని అధికారులు చెప్పారు. అయితే నియోజకవర్గ పరిధిలో అన్ని రూపాల్లోనూ దళిత బంధు పథకాన్ని నిలిపివేయాలని ఈసీ ఆదేశించడంతో ఈ పథకానికి సంబంధించిన ప్రక్రియలన్నీ తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి.