హత్య కేసులో డేరా బాబాకు  జీవిత ఖైదు 

రంజిత్ సింగ్ హత్య కేసులో గుర్మీత్ రామ్ ర‌హీమ్ (డేరా బాబా) తోపాటు మ‌రో న‌లుగురు నిందితుల‌కు పంచ‌కుల‌లోని సీబీఐ స్పెష‌ల్ కోర్టు శిక్ష‌ల‌ను ఖ‌రారు చేసింది. నిందితులు ఐదుగురికి యావ‌జ్జీవ కారాగార శిక్ష విధించింది. రంజిత్ సింగ్‌ హ‌త్య కేసులో డేరా బాబాతోపాటు అవతార్ సింగ్, కృష‌న్‌ లాల్, జస్బీర్ సింగ్, సబ్దీల్ సింగ్‌లను దోషులుగా పేర్కొంటూ కోర్టు ఈ నెల 8న తీర్పు చెప్పింది. శిక్ష‌ల ఖరారును ఇవాళ్టికి వాయిదా వేసింది. ఆ మేర‌కు ఇవాళ నిందితులు ఐదుగురికీ శిక్ష‌లు ఖ‌రారు చేసింది.

నిందితులకు యావ‌జ్జీవ కారాగార శిక్ష‌ల‌తోపాటు జ‌రిమానాలు కూడా భారీగానే విధించింది. డేరాబాబాకు రూ.31 లక్షలు, అవతార్ సింగ్‌కు రూ.1.50 లక్షలు, సబ్దీల్ సింగ్‌కు రూ.1.25 లక్షలు, జస్బీర్ సింగ్, కృష‌న్‌ లాల్‌కు చెరో రూ.75 వేల చొప్పున‌ జరిమానా విధించింది. వాస్తవానికి అక్టోబర్‌ 12న శిక్షలను ఖరారు చేయాల్సి ఉండగా.. కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. జరిమానా సొమ్ములో 50 శాతం బాధిత కుటుంబానికి అందజేయనున్నట్టు కోర్టు స్పష్టం చేసింది.

కాగా, ఇదే కేసులో నిందితుడిగా ఉన్న మ‌రో వ్య‌క్తి ఇందర్ సైన్‌ గతేడాది అనారోగ్యంతో చనిపోయాడు. డేరా సచ్చా సౌదాలో మేనేజ‌ర్‌గా ప‌నిచేసే రంజిత్ సింగ్ 2002 జూలై 10న హత్యకు గురయ్యాడు.

ఆశ్రమంలోని మహిళలను సెక్స్ బానిసలుగా చేసుకుని డేరా బాబా చేస్తున్న అరాచకాలకు సంబంధించి అప్ప‌ట్లో ఒక లేఖ బ‌య‌టికి వ‌చ్చింది. అయితే, త‌న అరాచ‌కాల‌ను బయటి ప్రపంచానికి తెలియజెప్పడానికి రంజిత్ సింగే ఆ ప‌ని చేసిన‌ట్లు డేరా బాబా అనుమానించి హ‌త్య చేయించాడు.

కాగా, ఆశ్రమంలోని ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసిన కేసులో కూడా డేరా బాబాకు ఇప్ప‌టికే 20 ఏండ్ల‌ జైలుశిక్ష పడింది. ఆయ‌న‌ భక్తి ముసుగులో మహిళలను సెక్స్ బానిసలుగా మార్చినట్టు రుజువైంది. దేశవ్యాప్తంగా వందల కోట్ల రూపాయల ఆస్తుల్ని వెనకేసుకున్న‌ట్లు తేలింది. 

భక్తి పేరుతో కారుచౌకగా భూములను కొనుగోలు చేసి తాను న‌మ్మిన భక్తుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. రిజిస్ట్రేషన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్న‌ట్లు ద‌ర్యాప్తులో బ‌య‌ట‌ప‌డింది. తాను సామాజిక కార్యాలు చేస్తున్నానని, తన డేరా కోట్లాది అనుచరులకు నెలవుగా ఉందని, తనపై కరుణ చూపి శిక్ష తగ్గించాల్సిందిగా డేరా బాబా రామ్ రహీమ్  కోర్టుకు వినతి సమర్పించాడు.