పార్టీ ప్రధాన కార్యదర్శిగా తానే ప్రకటించుకున్న శశికళ 

దివంగత పార్టీ అధినేత్రి జయలలిత స్మారక స్థలాన్ని సందర్శించిన ఒక రోజు తర్వాత, అనే నెచ్చలి, బహిష్కృత అన్నాడీఎంకే నాయకురాలు వీకే శశికళ ఆదివారం చెన్నైలోని ఎంజిఆర్  మెమోరియల్‌ని సందర్శించాచి, పార్టీ జెండాను ఎగురవేశారు. 

ఈ సందర్భంగా  తనను తాను పార్టీ ప్రధాన కార్యదర్శిగా పేర్కొన్న ఒక ఫలకాన్ని ఆవిష్కరించడం ద్వారా పార్టీ నాయకత్వంను హస్తగతం చేసుకోవడమే తన లక్ష్యం అన్న స్పష్టమైన సంకేతం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రసంగించిన శశికళ “పార్టీ,  ప్రజల సంక్షేమం కోసం” ఐక్యంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపిచ్చారు.

గత జనవరిలో జైలు శిక్ష పూర్తిచేసుకొని వచ్చిన ఆమె అసెంబ్లీ ఎన్నికలలో కీలక పాత్ర వహించే ప్రయత్నం చేసి, సాధ్యంకాక అప్పటి నుండి మౌనంగా ఉంటూ వచ్చారు. పార్టీ 50వ వార్షికోత్సవం సందర్భంగా ఒక రోజు ముందు జయలలిత స్మారక స్థలం సందర్శించడం ద్వారా క్రియాశీల రాజకీయాలను ప్రారంభిస్తున్నట్లు సంకేతం ఇచ్చారు.

తనను పార్టీ ప్రధాన కార్యదర్శిగా పేర్కొంటూ శశికళ ఒక ఫలకాన్ని ఆవిష్కరించడంపై స్పందిస్తూ, అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి డి.జయకుమార్ ఆమెకు అన్నాడీఎంకే జెండాను ఎగురవేసే హక్కు లేదా పార్టీ పేరును ఉపయోగించుకునే హక్కు లేదా తనను తాను పార్టీ  ప్రధాన కార్యదర్శిగా చెప్పుకునే హక్కు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. 

“అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ తనను తాను చెప్పుకుంటే అది కోర్టు ఆదేశానికి విరుద్ధం” అని ఆయన హెచ్చరించారు. అంతకుముందు, శశికళ కూడా రామాపురంలోని ఎంజిఆర్ నివాసానికి వెళ్లి, ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, మాజీ సిఎం జానకి రామచంద్రన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

శశికళ చివరిసారిగా జైలుకు వెళ్లేముందు 2017 లో స్మారక చిహ్నాన్ని సందర్శించారు. తాజాగా, జయలలిత స్మారక స్థలం వద్ద పార్టీలో జరుగుతున్న విషయాలు అన్నింటిని ఆమెకు తెలిపానని, పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తానని హామీ ఇచ్చానని తర్వాత ఆమె ప్రకటించారు. 

ఈ సందర్భంగా,  ఆమె మేనల్లుడు,  అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం అధినేత టీటీవీ దినకరన్  తన పార్టీతో పాటు, అన్నాడీఎంకే జెండాలతో, వందలాది మంది అనుచరులతో ఊరేగింపుగా వచ్చారు. ఆమె ఈ నెల 27న తంజావూర్ నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటన ప్రారంభించే అవకాశం ఉంది.

అక్టోబర్ 27 న తంజావూరులో పార్టీ కార్యకర్తలతో శశికళ సమావేశమవుతారని, అక్కడ ఆమె కుటుంబ కార్యక్రమానికి కూడా హాజరవుతారని ఆమె సన్నిహితులు తెలిపారు.  రాబోయే మూడు రోజుల్లో, ఆమె తిరునల్వేలి, తెంకాసి,  రామనాథపురంలో జరిగే పార్టీ సమావేశాలలో ప్రసంగిస్తారు. ఆమె స్పష్టమైన రాజకీయ వ్యూహంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతున్నది.

మరోవైపు, చెన్నైలోని రాయపేటలో పార్టీ వ్యవస్థాపకుడు ఎంజి రామచంద్రన్, జయలలితల విగ్రహాలకు అన్నాడీఎంకే పార్టీ నాయకులు కె. పళనిస్వామి,  ఓ పనీర్‌సెల్వం ఆదివారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంను ‘పురట్చి తలైవర్ ఎంజిఆర్ మలిగై (విప్లవ నాయకుడు ఎంజిఆర్ కోట)’ అని నామకరణం చేయబోతున్నట్లు వారు ప్రకటించారు.