భారీ వర్షాలతో బద్రీనాథ్ యాత్రకు ఆటంకం 

భారీవర్షాల వల్ల బద్రీనాథ్ యాత్రకు ఆటంకం ఏర్పడింది. రాబోయే రెండు రోజుల పాటు చార్ధామ్‌తో సహా ఉత్తరాఖండ్‌లోని పర్వత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సోమవారం హెచ్చరించింది. దీంతో బద్రినాథ్ యాత్ర పాండుకేశ్వర్ వద్ద ఆగిపోయింది. 

భారీవర్షాల వల్ల వరదలు వెల్తువెత్తుతుండటంతో ప్రజలు నదులు, కాల్వలకు దూరంగా ఉండాలని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సోమ, మంగళవారాల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాుల కురిసే అవకాశం ఉందని భారతవాతావరణశాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీ చేసింది.

దీంతో ముందు జాగ్రత్తగా బద్రీనాథ్ యాత్రను నిలిపివేయాలని చమోలీ జిల్లా మెజిస్ట్రేట్ హిమాన్షు ఖురానా భక్తులకు సూచించారు. భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భక్తులను జోషిమఠ్, పాండుకేశ్వర్ వద్ద సురక్షితంగా ఉండాలని ఖురానా కోరారు. చమోలీ జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలను సోమవారం మూసివేశారు. 

వచ్చే రెండు రోజుల పాటు ఎక్కడికీ వెళ్లవద్దని వాతావరణ శాఖ డైరెక్టర్ బిక్రమ్ సింగ్ ప్రజలను కోరారు.ఆదివారం నుంచి మూడు రోజుల పాటు చార్ ధామ్‌తో సహా ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని చోట్ల మెరుపులు, వడగళ్ల వర్షంతోపాటు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

20 రాష్ట్రాల్లో భారీ వర్షాలు 

రాబోయే మూడు రోజుల్లో దేశంలోని 20 రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ(ఐఎండీ) సోమవారం అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రాబోయే రెండు మూడు రోజులో్లో వాయువ్య, ఈశాన్య, ద్వీపకల్పంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ సోమవారం విడుదల చేసిన వాతావరణశాఖ బులెటిన్‌లో పేర్కొంది. 

అక్టోబరు 18 నుంచి 20తేదీల మధ్య నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు, భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ నెల 18, 19తేదీల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి భారీవర్షాలు కురవవచ్చని ఐఎండీ అధికారులు హెచ్చరించారు.

అల్పపీడన ప్రభావం దక్షిణ తూర్పు ద్వీపకల్పంపై చూపిస్తుందని, దీనివల్ల కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లోనూ భారీవర్షాలు కురవవచ్చని వాతావరణశాఖ వివరించింది.కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిలలో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. బంగాళాఖాతం నుంచి బలమైన గాలులు వీస్తున్నందున తూర్పు భారతదేశంలో అక్టోబర్ 20 వరకు భారీ వర్షపాతం కొనసాగుతుందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. 

ఉత్తరాఖండ్ అంతటా  ఎస్‌డిఆర్‌ఎఫ్ దళాలు

భారీవర్షాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రాబోయే రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం ,అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు.భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో చార్ ధామ్ యాత్రను రెండు రోజుల పాటు  వాయిదా వేశామని సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. 

భారీవర్షాలు, వరదలతో కొండచరియలు విరిగిపడుతున్నందున ఎస్‌డిఆర్‌ఎఫ్ 29 బృందాలను ఉత్తరాఖండ్ అంతటా మోహరించారు.భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో 19వతేదీ వరకు గోపేశ్వర్‌లోని నందా దేవి బయోస్పియర్ రిజర్వ్‌లోని అటవీ ప్రాంతాల్లోని అన్ని ట్రెక్కింగ్, క్యాంపింగ్, పర్వతారోహణ బృందాల పర్యటనలను నిషేధించారు.

జార్ఖండ్, బీహార్, పశ్చిమబెంగాల్, ఒడిశా, సిక్కింలలో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో పేర్కొంది. అక్టోబరు 18 నుంచి 20తేదీల మధ్య పశ్చిమబెంగాల్, సిక్కిం, ఒడిశాలలో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురవవచ్చని అధికారులు చెప్పారు.ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగఢ్‌లలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.