దీన్‌దయాళ్‌ ఆలోచన విధానమే భారత్ కు మార్గం

దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ ఆలోచన విధానంతోనే భారత దేశం 21వ శతాబ్దంలో ప్రపంచంలో బలమైన దేశంగా, ప్రపంచ ప్రజలకు మార్గదర్శిగా అభివృద్ధి చెందగలదని ఆర్‌ఎస్‌ఎస్‌   జాతీయ కార్యకారిణి సభ్యుడు రాంమాధవ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.  దీన్‌దయాళ్‌ చెప్పిన విధంగా రాజ్యాంగానికి భారతీయ సంస్కృతి, వారసత్వ సంపదను జోడిస్తే మంచి ఫలితాలు ఉంటాయని  తెలిపారు. 

70 ఏళ్లుగా పాశ్యాత్య వ్యవస్థను అనుసరించామని, ఇప్పుడు మన స్థానిక వ్యవస్థల్లో మనదైన స్థానం ఉండాలని ఆయన సూచించారు. ఆయన రచించిన  ‘ది హిందుత్వ పరాదిమ్‌’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఫోరమ్‌ ఫర్‌ నేషనల్‌ థింకర్స్‌ హైదరాబాద్‌ చాప్టర్‌ ఆధ్వర్యంలో జరిగింది. పుస్తకాన్నినేషనల్‌ జ్యుడీషియల్‌ అకాడమీ చైర్మన్‌ జస్టిస్‌ రఘురాం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రాంమాధవ్‌ మాట్లాడుతూ రానున్న పదేళ్లలో భారత్‌ ‘విశ్వగురు’ స్థానంలో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మన రాజ్యాంగాన్ని ఎంతో గొప్పగా రూపొందించారని, కానీ దీన్ని అమలుపరచాల్సిన వారు చెడ్డవారైతే ఇది చాలా ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు. 

గత 70 ఏళ్లుగా పాశ్చాత్య వ్యవస్థలనే అనుకరిస్తూ ముందుకు వెడుతున్నామని పేర్కొంటూ మనకంటూ కొన్ని వ్యవస్థలను జోడిస్తే భారత దేశాన్ని చాలా తక్కువ సమయంలో, మరింత శక్తివంతమైన  దేశంగా, ఐక్యమైన దేశంగా ప్రపంచంలో బలమైన దేశంగా నిలబెట్టగలమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ విశ్వాసంతోనే అన్ని వ్యవస్థల గురించి ఈ గ్రంధంలో చర్చించానని తెలిపారు. 

భారతదేశం సిద్ధాంతకర్తల కంటే తత్వవేత్తలు, ఆలోచనాపరుల భూమి అని చెబుతూ  గాంధీజీ ఆలోచనలు ‘సత్యాగ్రహం’,  ‘అహింసా’ వేగంగా వ్యాప్తి చెందాయని, అనేక దేశాలు దీనిని ఎంచుకున్నాయని గుర్తు చేశారు.  అందుకు విరుద్ధంగా, కార్ల్ మార్క్స్ ‘దాస్ కాపిటల్’ ద్వారా ప్రచారం చేసిన కమ్యూనిస్ట్ భావజాలాన్ని అప్పటి సోవియట్ రష్యాలో తనదైన రీతిలో స్వీకరించడానికి 50 సంవత్సరాలు పట్టిందని, మరో 50 సంవత్సరాల తర్వాత చైనాలో మరొక రూపంలో ఉందని పేర్కొన్నారు.

ఆలోచనలు భావజాలం కంటే వేగంగా ప్రయాణిస్తాయని చెబుతూ  హిందూ ఆలోచన అనేది అంతిమంగా ఉండదని, ఏదైనా తుది పరిష్కారాన్ని అందిస్తుందని తెలిపారు. “మేము ఎల్లప్పుడూ తత్వవేత్తలు కాబట్టి నేను భావజాల అనే పదాన్ని ఉపయోగించను” అని తెలిపారు. 

ఆర్‌ఎస్‌ఎస్‌కు కూడా ఎటువంటి సిద్ధాంతం లేదని, కానీ గొప్ప తాత్విక ఆలోచన, ప్రపంచ దృష్టికోణం ఉందని రామ్ మాధవ్ చెప్పారు.   దీన్‌దయాళ్‌   ఉపాధాయ  ‘ఏకాత్మ మానవతావాదం’ తత్వాన్ని ఈ పుస్తకం వివరిస్తుందని ఆయన తెలిపారు. `ఏకాత్మ మానవతావాదం’ పురాతన భారతీయ ఆలోచన పరిజ్ఞానం నుండి ఏర్పడినది పేర్కొంటూ ప్రస్తుతం  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు.

దేశంలో నెలకొన్న సామజిక, ఆర్ధిక పరిస్థితులను నూతన దృక్పధంతో తిరిగి విశ్లేషించుకోవలసిన అవసరం గురించి తెలుపుతూ ఈ సందర్భంగా దీన్‌దయాళ్‌  ఆలోచనా విధానం ఎంతో ఉపయోగపడుతోందనే భావనతో ఈ గ్రంథ రచనకు పూనుకున్నట్లు చెప్పారు. మన రాజకీయ, ప్రజాస్వామ్య వ్యవస్థలు, లౌకిక విధానాలు, ఆర్ధిక వ్యవస్థలు – వంటి అన్ని విషయాల గురించి ఈ సందర్భంగా చర్చించినట్లు రామ్ మాధవ్ వివరించారు.

హిందూత్వ తత్వశాస్త్రం ‘సమగ్ర మానవతావాదానికి’ సమగ్రమైనదని తెలుపుతూ ఈ పుస్తకం భారతీయ,  పాశ్చాత్య ఆలోచనల మధ్య గల వ్యత్యాసాలను కూడా వివరిస్తుంది ఆయన వివరించారు.  మన దేశానికి సమాఖ్య వ్యవస్థ సరిపోదనే అభిప్రాయం వ్యక్తం చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమాన అధికారాలు ఉండాలని ఆయన సూచించారు.

రాంమాధవ్‌ హిందుత్వం గురించి వ్రాసే మంచి పుస్తకాలు సరళమైన భాషలో ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉంటాయని జస్టిస్ రఘురాం చెప్పారు. ఈ పుస్తకంలో అనేక అంశాలు తానను ఆకట్టుకున్నాయని కొనియాడారు. మాజీ ఎమ్యెల్సీ ఎన్ రాంచంద్రారావు అధ్యక్షత వహించారు.  ఉస్మానియా వర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ టి.విజయ్‌కుమార్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.