కాశ్మీర్ లో కొత్త తీవ్రవాద సంస్థ ‘హర్కత్ 313’ ముప్పు

కాశ్మీర్ లోయలో ఒక వంక పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు సాధారణ పౌరులు, సైనికులపై గురి పెడుతూ తుపాకులు మ్రోగిస్తుండగా, మరోవంక కొత్తగా ఏర్పడిన తీవ్రవాద సంస్థ ‘హర్కత్ 313’ ప్రభుత్వం నిర్మించిన మౌలిక సదుపాయాలపై గురి పెట్టిన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దానితో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. 

గత రెండు వారాలుగా ఇప్పటికే ఉగ్రవాదుల కాల్పులలో 11 మంది సాధారణ పౌరులతో పాటు, 9 మంది జవాన్లు అమరులయ్యారు. సాధారణ పౌరులలో ఐదుగురు స్థానికేతరులు. `హర్కత్’ పేరును మొదటి సారిగా వింటున్నామని, పూర్తిగా విదేశీ ఉగ్రవాదులతో నిండి ఉండవచ్చని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. అయితే  లష్కరే తొయిబా నుండి భద్రతా దళాల దృష్టి మళ్లించడానికి ఈ పేరును తెరపైకి తెచ్చారా, కొత్తగా ఏర్పడిందా తెలియవలసి ఉన్నదని చెప్పారు.

తాజా సమాచారం ప్రకారం, ‘హర్కత్ 313’ అనే కొత్త తీవ్రవాద సంస్థ ఉరిలోని జల విద్యుత్ (హైడ్రో పవర్) ప్లాంట్లను తమ దాడులకు లక్ష్యంగా చేసుకుంది. టెర్రరిస్టుల టార్గెట్‌లో అనంతనాగ్‌లోని ఎమర్జెన్సీ ల్యాండింగ్ స్ట్రిప్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ఎల్ఓసీకి సమీపంలో ఉన్న ఉరి-1, ఉరి-2 హైడ్రో పవర్ ప్రాజెక్టుల చుట్టూ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

మరోవంక, కశ్మీర్ లోయలోని మత నాయకులపై దాడులకు హిజ్బుల్ ముజాహిద్దీన్ తీవ్రవాద సంస్థ ప్రణాళిక రూపొందించినట్టు ఇంటెలిజెన్స్ సమాచారం. అలాగే సర్పంచులు, స్థానికేతరులను పాకిస్థాన్ ప్రేరేపిత లష్కరే తొయిబా, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్) లక్ష్యంగా చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. 

ఇటీవల కాలంలో జమ్మూకశ్మీర్‌లోని స్థానికేతర వర్కర్లపై వరుస దాడులు చోటుచేసుకుంటున్నాయి. పౌరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఈ నెలలో జరిపిన వరుస దాడుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈనెల మొదట్లో బీహార్‌కు చెందిన ఇద్దరు కార్మికులను ఉగ్రవాదులు కాల్పిచంపగా, ఒకరు గాయపడ్డారు. బీహార్‌కు చెందిన స్ట్రీట్ వెండర్‌ను, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక కార్పెంటర్‌ను శనివారం సాయంత్రం తీవ్రవాదులు కాల్చిచంపారు.

అస్సాంకు ఉగ్రముప్పు 

ఇలా ఉండగా, ఈశాన్య రాష్ట్రమైన అసోంలో హైఅలర్ట్‌ ప్రకటించారు. పాక్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ, తీవ్రవాద సంస్థ అల్‌ ఖైదాతో కలిసి భారీ ఉగ్ర దాడికి కుట్ర పన్నినట్లు నిఘావర్గాలు హెచ్చరించాయి. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ నేతలు, సైనిక స్థావరాలు, మతపరమైన స్థలాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి.

దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గత శనివారం గౌహతి పోలీస్‌ కమిషనర్‌ అన్ని జిల్లాల పోలీసులకు హెచ్చరికలు జారీ చేసి, అన్ని భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గత నెలలో దరాంగ్ జిల్లాలో హింసాత్మక సంఘటన జరిగిన విషయం తెలిసిందే. ఇద్దరు ముస్లిం యువకులు మరణించగా.. 11 మంది పోలీసులతో సహా 20 మంది గాయపడ్డారు.

ఈ క్రమంలోనే దాడులకు తెగబడే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. బహిరంగ ప్రదేశాల్లోనూ బాంబు దాడులకు పాల్పడవచ్చని, లేదంటే ఐఈడీలతో పేలుళ్లు, బస్‌స్టేషన్లు, మతపరమైన ప్రదేశాల్లోనూ దాడులకు పాల్పడే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి.