![బాంగ్లాదేశ్ హిందువుల దేశవ్యాప్త నిరహర దీక్షలు బాంగ్లాదేశ్ హిందువుల దేశవ్యాప్త నిరహర దీక్షలు](https://nijamtoday.com/wp-content/uploads/2021/10/Bangla-vandalism.webp)
బాంగ్లాదేశ్ లో దుర్గా పూజ సందర్భంగా మైనారిటీ కమ్యూనిటీ ప్రార్థనా స్థలాలపై జరుగుతున్న దాడులలో భాగంగా ఆదివారం మరో ఒక హిందూ దేవాలయంపై దాడి జరిపారు. కొంత మంది గుర్తు తెలియని ముస్లిం వ్యక్తులు దుర్గా మండపాలపై దాడి చేసి పూజా సమాగ్రిని చిందరవందర చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ ఆదివారం దేశవ్యాప్తంగా నిరాహార దీక్షకు అక్కడి మైనారిటీ సమూహాలు పిలుపునిచ్చాయి.
దేశ రాజధాని నుండి 157 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫెనిలోని హిందూ యాజమాన్యంలోని దేవాలయాలు, దుకాణాలు ధ్వంసం చేసి, దోపిడీకి పాల్పడిన్నట్లు ఢాకా ట్రిబ్యూన్ వార్తాపత్రిక నివేదించింది. ఈ ఘర్షణల్లో ఫెని మోడల్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్‌ఛార్జ్ నిజాముద్దీన్‌తో సహా కనీసం 40 మంది గాయపడినట్లు సమాచారం.
శనివారం రాత్రి, 4:30 గంటల (స్థానిక సమయం) నుండి అర్ధరాత్రి వరకు జరిగిన ఘర్షణలలో హిందువుల యాజమాన్యంలోని అనేక దేవాలయాలు, వ్యాపారాలు ధ్వంసంకు గురయ్యాయి. అధికారులు అదనపు పోలీసు బలగాలు- పారామిలిటరీ ఫోర్స్ – బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ లను మోహరించారు.
ఢాకా నుండి 40 కిలోమీటర్ల దూరంలో మున్షిగంజ్‌లోని సిరాజ్‌దిఖాన్ ఉపజిలాలోని రషూనియా యూనియన్‌లోని డానియాపరా మహా శోషణ కాళీ మందిరంలో కొంతమంది దుర్మార్గులు శనివారం ఆరు విగ్రహాలను ధ్వంసం చేశారు. దుర్గా పూజ వేడుకల సందర్భంగా హిందూ దేవాలయాలపై దాడులు, విధ్వంసానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు శనివారం దేశవ్యాప్తంగా కొనసాగాయి.
అదే విధంగా ఈ విధ్వంసాలు ప్రజల ఆగ్రహానికి దారితీశాయి. మరోవంక, దేశంలోని ఆగ్నేయ ఓడరేవు నగరమైన చిట్టగాంగ్‌లో, బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ దుర్గా పూజ వేడుకల సందర్భంగా దాడులకు నిరసనగా అక్టోబర్ 23 నుండి సిట్-ఇన్ నిరాహార దీక్షను ప్రకటించింది.
ఢాకాలోని షాబాగ్, చిట్టగాంగ్ అందర్‌కిల్లాలో నిరసన కార్యక్రమాలు జరుగుతాయని కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి న్యాయవాది రాణా దాస్‌గుప్తా చిట్టగాంగ్ విలేకరుల సమావేశంలో చెప్పారు. ప్రకటన చేయడానికి ముందు, ఫోరమ్ శనివారం చిట్టగాంగ్‌లో ఆరు గంటల సమ్మెను జరిపింది.
దుర్గా పూజ వేడుకల సందర్భంగా ప్రబలమైన విధ్వంసం, హింస, అల్లకల్లోలంలో పాల్గొన్న వారికి కఠిన శిక్షలు విధించాలని బంగ్లాదేశ్ పూజ ఉజపాన్ పరిషత్ డిమాండ్ చేసింది. ఫోరమ్ అధ్యక్షుడు మిలన్ కాంతి దత్తా మాట్లాడుతూ ప్రభుత్వం తమ డిమాండ్‌ని పట్టించుకోకపోతే తాము మరింత కఠినమైన ఉద్యమాన్ని చేపడతామని చెప్పారు.
“హోం మంత్రి నుండి అధికార పార్టీ ప్రధాన కార్యదర్శి ఒబైదుల్ క్వాడర్ వరకు, ప్రతి ఒక్కరూ తమకు అన్ని విషయాల గురించి తెలియజేసినట్లు మాకు హామీ ఇచ్చారు. మీకు అన్నీ తెలిస్తే, మీరు దోషులను ఎందుకు శిక్షించడం లేదు? ” అని ఆయన ప్రశ్నించారు.
దాడులు జరుగుతూ ఉంటె సమాజం మౌనంగా కూర్చోదని ఇస్కాన్ బంగ్లాదేశ్ జనరల్ సెక్రటరీ చారు చంద్ర దాస్ బ్రహ్మచారి,హెచ్చరించారు.
“మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు కొందరు మతఛాందసులు విద్వేషాలను రెచ్చగొట్టడం కోసం ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నల్టు మేము భావిస్తున్నాము. పాలక పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు కూడా కొన్ని ప్రదేశాలలో ఇటువంటి ఘోరమైన నేరాలతో సంబంధం కలిగి ఉన్నారని కూడా మాకు తెలుసు. బలహీనంగా మారవద్దని, అటువంటి వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరుతున్నాను” అని ఆయన చెప్పారు.
ఫోరమ్ నాయకులు రక్షణ చట్టం, జాతీయ మైనారిటీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఢాకా విశ్వవిద్యాలయంలోని అధికార అవామీ లీగ్-మద్దతుగల బ్లూ ప్యానెల్ ఉపాధ్యాయులు దేశవ్యాప్తంగా పలు దుర్గా పూజ వేదికలు, విగ్రహాలలో జరుగుతున్న విధ్వంసాన్ని తీవ్రంగా ఖండించారు.
హింసకు ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బాధ్యత వహించాలని
సమాచార, ప్రసార మంత్రి హసన్ మహమూద్ ఆరోపించారు. ”…బి ఎన్ పి – జమాత్ మత హింసను రెచ్చగొట్టడంలో పాల్గొంటున్నది. రాజకీయంగా ప్రధాన మంత్రి షేక్ హసీనాను ఎదుర్కొనలేక వివిధ కుట్రలకు పాల్పడుతున్నది” అంటూ మండిపడ్డారు.
“దేశవ్యాప్తంగా మతపరమైన ఉద్రిక్తలను రేకెత్తించిన కొమిల్లాలో జరిగిన సంఘటన వెనుక రాజకీయ ఉద్దేశ్యం ఉంది” అని మంత్రి విమర్శించారు. మహమూద్ దేవాలయాలను ధ్వంసం చేయడం, చట్టాన్ని అమలు చేసేవారిపై దాడి చేయడం వంటివి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తిస్తున్నట్లు తెలిపారు.
హింస వెనుక సూత్రధారులు కూడా గుర్తించి చట్టం ముందుకు తీసుకు వస్తామని స్పష్టం చేశారు. న్యాయం చేయబడతారని ఆయన అన్నారు. శుక్రవారం మతపరమైన అశాంతి, దైవదూషణతో హింసాత్మక సంఘటనల మధ్య బాంగ్లాదేశ్ లో దుర్గాపూజ వేడుకలు ముగిశాయి. ఇది సగానికి పైగా పరిపాలనా జిల్లాలలో పారామిలిటరీ దళాలను మోహరించడానికి దారితీసింది. మొత్తం 64 పరిపాలన జిల్లాలు ఉండగా, పారామిలిటరీ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ నిఘాను 22 జిల్లాల నుండి 34 జిల్లాలకు పెంచింది.
More Stories
వక్ఫ్ జెపిసి భేటీలో ఒవైసీతో సహా 10 మంది ఎంపీల సస్పెన్షన్
కశ్మీర్‌లోని రాజౌరీలో అంతుచిక్కని వ్యాధి
భారతదేశం శక్తివంతంగా ఉండటం అంటే విధ్వంసకారిగా కాదు