దుర్గమ్మ తెప్పోత్సవం నిలిపి వేయడంలో క్రైస్తవ కుట్ర?

విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ గంగా పార్వతీదేవి సమేత దుర్గా మల్లేశ్వరస్వామిని ప్రతి ఏటా దశరా శరన్నవరాత్రులు చివరిరోజన జలవిహారం కావించే తెప్పోత్సవం విశేషంగా ప్రసిద్ధి చెందింది. గత 35 ఏళ్లుగా ఈ ఉత్సవాన్ని భారీ స్థాయిలో జరుపుతున్నారు. లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవాన్ని తిలకిస్తున్నారు. 
 
అయితే రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వరుసగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో రెండేళ్లుగా కుంటిసాకులతో తెప్పోత్సవాలను నిలిపివేయడం కలకలం రేపుతున్నది. రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు ప్రోత్సహిస్తున్న క్రైస్తవం కుట్ర కారణంగానే ఈ విధంగా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 
 
 1985 నుంచి అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సూచన మేరకు ఎంతో చర్చించి, ఆగమ సలహా మండలి సూచన మేరకు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు.గత రెండేళ్లుగా స్వామి వారి తెప్పోత్సవం ఎదో వంకతో నిలిపి వేస్తున్నారు. చివరకు ఈ ఏడాది కూడా కృష్ణానది వరద పోటు తీవ్రంగా ఉందనే సాకు చూపి తెప్పోత్సవం నిర్వహించ లేదు. 
 
ప్రస్తుతం కృష్ణానదికి వరద ఉధృతి కన్నా ఎక్కువ వరద వచ్చినప్పుడు కూడా ఇరిగేషన్ అధికారుల సమన్వయంతో తెప్పోత్సవం నిర్వహిస్తూ రావడం గమనార్హం. గత నాలుగేళ్లుగా దసరా సమయంలో కృష్ణాలో వరద ఉధృతిని గమనిస్తే ఈ సంవత్సరం ఎటువంటి వరద పోటు లేదని స్పష్టం అవుతుంది.
2018లో 11, 865 క్యూసెక్లు, 2019లో 19,764 క్యూసెక్లు, 2020లో 2.61 లక్షల క్యూసెక్లు ఉండగా ఈ సంవత్సరం కేవలం 15,094 క్యూసెక్లు మాత్రమే వరద నీరు వచ్చింది. గత నాలుగేళ్లలో ఒక్క 2020 మినహా ప్రతి ఏటా వరద సాధారణంగానే ఉందని ఇరిగేషన్ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. 
 
ఒక్క 2020 లోనే వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో పాటు, కరోనా ఉధృతి ఎక్కువగా ఉండడంతో తెప్పోత్సవం జరపలేదని సరిపెట్టుకున్నప్పటికీ, ఈ సంవత్సరం కూడా జరపకపోవడం ఉద్దేశపూర్వకంగానే అని భావించవలసి వస్తున్నది. 
 
ఇప్పటికన్నా వరద ఉధృతి ఉన్నా రెండు మూడు రోజులు పులిచింతల్లో వరద నీరు నిలిపివేసి కృష్ణానదిలో దుర్గమ్మ జలవిహారం నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి ప్రయత్నం చేయకుండా దుర్గగుడి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో జరిగే సాంప్రదాయాలను నిలిపివేయడం ప్రభుత్వంలోని క్రైస్తవ వర్గాల కుట్రగానే వెల్లడి అవుతుంది.
 
ఆంధ్ర ప్రదేశ్ లో తిరుమల క్షేత్రం తర్వాత విశేషంగా ప్రసిద్ధి చెందిన దుర్గ గుడిలో గత రెండేళ్లుగా వైసిపి పాలనలో అనేక అపచారాలు చోటుచేసుకున్నాయి. తాజాగా దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రి పైననే ఉత్సవాలు ప్రదర్శించే టివిలో క్రైస్తవ ప్రచారం జరగడం కలకలం రేపడం తెలిసిందే. 
 
ప్రభుత్వంలోని బలమైన వర్గాల వత్తిడి కారణంగానే ఇరిగేషన్, దేవాదాయశాఖ అధికారులు కుంటిసాకుతో తెప్పోత్సవంను రద్దు చేసి,  హంస వాహనంలో పూజలు నిర్వహించి మమ అనిపించడం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి నియోజకవర్గంలో, ఆయన ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇటువంటి అపచారం జరగడం గమనిస్తే జగన్ పాలనలో హిందూ దేవాలయాలకు కాకుండా, హిందూ సంప్రదాయాలకు, హిందూ భక్తుల విశ్వాసాలకు ఏమేరకు ముప్పు వాటిల్లుతున్నదో స్పష్టం అవుతుంది.