బోర్డు లకు ప్రోజెక్టుల అప్పగింతకు తెలంగాణ మోకాలడ్డు 

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ గురువారం అమల్లోకి రానున్నవిధంగా కృష్ణా, గోదావరి నదులపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులను ఆయా బోర్డుల చేతికి అప్పగించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినా, తెలంగాణ ప్రభుత్వం మోకాలడ్డుతున్నది.

శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో ఆరు కాంపోనెంట్‌లను అప్పగించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం  అంగీకారం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం 9 కాంపోనెంట్‌లను అప్పగించిన వెంటనే తాము ఆరు కాంపోనెంట్‌లను ఇస్తామని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. 

ఆఫీస్‌లు, సిబ్బంది, ప్లాంట్‌, ఎక్విప్‌మెంట్‌ అప్పగించేందుకు అంగీకారం తెలిపింది. కేఆర్‌ఎంబీ నోటిఫికేషన్‌ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జూరాలతో పాటు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవాలని.. లేదంటే తమకు ఇబ్బందులు వస్తాయని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

మరోవంక, ప్రాజెక్టులను అప్పగించాలా, వద్దా అనే దానిపై అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అధ్యయనం కోసం సీఎం కేసీఆర్‌ సాంకేతిక, న్యాయనిపుణులతో బుధవారం కమిటీని నియమించారు.

నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ సి.మురళీధర్‌రావు నేతృత్వంలోని ఈ కమిటీలో ఆ శాఖకు చెందిన నిపుణులతోపాటు న్యాయ నిపుణులు, విద్యుత్‌ అధికారులు ఉంటారు. ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించడం వల్ల రాష్ట్రానికి నష్టమేమైనా జరుగుతుందా.. అనే అంశంపై అధ్యయనం చేసి 15 రోజుల్లోగా నివేదిక అందించాలని కమిటీని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

కృష్ణా బేసిన్‌లో ప్రధానంగా శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రంతోపాటు నాగార్జునసాగర్‌లోని రెండు జలవిద్యుత్‌ కేంద్రాలను కేఆర్‌ఎంబీకి అప్పగించడంపైనే తెలంగాణకు ప్రధానంగా అభ్యంతరం ఉంది. జలవిద్యుత్‌ కేంద్రాలు చేజారితే సమస్యలు తప్పవనే భావనతో ఉంది. దీంతోపాటు నీటిపారుదల ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించడం వల్ల ప్రస్తుతానికి నష్టాలేవీ లేనప్పటికీ.. భవిష్యతులో సమస్యలు వస్తాయని ఆందోళన చెందుతోంది.