కోవెల సుప్రసన్నాచార్యకు హనుమజ్జానకీ అవార్డు 

తాను డిగ్రీ చదివే రోజుల్లో తెలుగు ఆచార్యులైన పోలూరి హనుమజ్జానకీ రామశర్మ పేరిట తెలంగాణ సారస్వత పరిషత్ ద్వారా స్వయంగా అవార్డును నెలకొల్పి, తొలి అవార్డును కోవెల సుప్రసన్నాచార్యకు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు  అందజేశారు. తమ ఆచార్యుల పేరిట అవార్డును ఏర్పాటు చేసి, అందజేయడం ఎంతో ఆనందంగా ఉందన్న ఉపరాష్ట్రపతి, పోలూరి హనుమజ్జానకీ రామశర్మ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. 

చదువు నేర్పిన గురువు సాక్షాత్తు భగవంతుడి స్వరూపమన్న పెద్దల మాటలను ఉద్ఘాటించిన ఆయన, శ్రీరాముడు, శ్రీకృష్ణడు లాంటి పురాణపురుషులు సైతం గురు సుశ్రూషలు చేశారని గుర్తు చేశారు. డిగ్రీ చదివే రోజుల్లో తెలుగు భాష పట్ల, తెలుగు సాహిత్యం పట్ల, హనుమజ్జానకీరామ శర్మ తనకు మక్కువ పెరిగేలా చేశారని గుర్తు చేసుకున్నారు. 

తమ రాజీకీయ జీవితంలో వివిధ అంశాల పట్ల అవగాహన స్వతహాగానే పెంచుకోగలిగినా, వాటిని ధాటిగా మాట్లాడగలిగే నేర్పు వారి ప్రేరణతోనే వచ్చిందని తెలిపారు. ఈ సందర్భాన్ని గురురుణం తీర్చుకోవడంగా పత్రికల్లో రాశారన్న ఆయన, ఇలాంటివి ఎన్ని చేసినా తల్లిదండ్రుల రుణం, గురువుల రుణం తీర్చుకోలేమని తెలిపారు.

పోలూరి హనుమజ్జానకీరామ శర్మని చూడగానే ఏదో తెలియని గౌరవం కలుగుతుందన్న ఉపరాష్ట్రపతి, సంప్రదాయబద్ధమైన పంచె కట్టు, చక్కని బొట్టు, పండిత వర్చస్సుతో ఇట్టే ఆకర్షించే మూర్తీభవించిన తెలుగుదనం వారిదని తెలిపారు. తెలంగాణ సారస్వత పరిషత్ అంటే తమకు ప్రత్యేకమైన అభిమానమన్న ఉపరాష్ట్రపతి, మాతృభాషను నేర్చుకోవడం కూడా నేరంగా పరిగణించే రోజుల్లో, తెలుగు భాషను సంరక్షించుకునే సంకల్పంతో 1943లో ఈ సంస్థ ఏర్పాటైందని గుర్తు చేశారు. 

ఈ సందర్భంగా అవార్డు గ్రహీత కోవెల సుప్రసన్నాచార్యకు  అభినందనలు తెలియజేసిన ఉపరాష్ట్రపతి, కవిగా… పద్య విద్య మీద గాఢమైన అనురాగం ఉన్నా, ఆధునిక కవిత్వ చేతనను ఆవిష్కరించేందుకు వారు కృషి చేశారని కొనియాడారు. సమాజంలో అక్కడక్కడా పేరుకుపోయిన వివక్షలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన భారతీయ తత్వవేత్తల దృష్టిని సమగ్ర యోగ భావనలను కవిత్వంలోకి ప్రవేశపెట్టే చొరవ చేసిన సుప్రసన్నాచార్య గారు, ఆధునిక సాహిత్య విమర్శలో నవ్య సంప్రదాయ వాదాన్ని ఆవిష్కరించారని తెలిపారు.

ఇలాంటి వారి స్ఫూర్తితో మాతృమూర్తి, మాతృభాష, జన్మభూమి, మాతృదేశం, చదువు చెప్పిన గురువులను స్మరించుకుంటూ మన భారతీయ సంస్కృతి మనకు నేర్పించిన వసుధైవ కుటుంబక భావన, ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతితో కలిసి జీవించడం లాంటి అంశాలను యువత అవగతం చేసుకుని నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

తెలంగాణ సారస్వత పరిషత్ కార్యదర్శి డా. జె.చెన్నయ్య సాహిత్య అకాడమీ ప్రచురణల్లో భాగంగా రచించిన పరిషత్ పూర్వ అధ్యక్షులు దేవులపల్లి రామానుజరావు జీవితానికి సంబంధించిన పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. అనంతరం కిన్నెర ఆర్ట్స్ థియేటర్ వారు భారత అమృతోత్సవాలను పురస్కరించుకుని ప్రచురించిన కవితా సంకలనం అమృతోత్సవ భారతి పుస్తకాన్ని ఆవిష్కరించారు.