హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌ అధికార దుర్వినియోగం

హుజురాబాద్‌ ఉపఎన్నికలో టీఆర్ఎస్‌ పార్టీ నాయకులు అధికార దుర్వినియోగం చేస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నిజాయితీగా పోరాడిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్‌ నాయకులు ఇష్టారాజ్యాంగ మాట్లాడుతూ,  ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరోవైపు సంతలో కూరగాయలు కొంటునట్లు ఇతర పార్టీల నాయకులను కొనుగోలు చేస్తూ, తెలంగాణ ప్రజలకు ఏమి సందేశం ఇద్దామని అనుకుంటున్నారో టీఆర్ఎస్‌ నేతలు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఈటల కోసం పని చేస్తున్న కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని అంటూ ఇకపై అటువంటి వాటిని సహించేది లేదని అరుణ హెచ్చరించారు.

జాతీయ, రాష్ట్ర పార్టీ మొత్తం ఈటల వెంట ఉన్నారన్న విషయం టీఆర్ ఎస్ నాయకులు మరవద్దని ఆమె గుర్తుచేశారు.  పోలీసులు హుజురాబాద్ లో వ్యవహరిస్తున్న తీరు యావత్ తెలంగాణ ప్రజలు తలదించుకునేలా ఉందని ఆమె మండిపడ్డారు. వారు ప్రభుత్వ ఉద్యోగులమన్న విషయాన్ని గుర్తు పెట్టుకుంటే బాగుంటుందని ఆమె హితవు చెప్పారు.

కేవలం బీజేపీ పార్టీ నాయకులే కాదు యావత్ తెలంగాణ ప్రజలు ఈటల గెలుపును కోరుకుంటున్నారని ఆమె చెప్పారు. దాని కోసం అందరూ స్వచ్ఛందంగా హుజురాబాద్ కు వచ్చి ఈటల గెలుపు కోసం కృషి చేస్తున్నారని ఆమె తెలిపారు.