నీచపు రాజకీయాలు చేస్తున్న టీఆర్ఎస్ నేతలు

బీజేపీ కార్యకర్తలకు డబ్బులు ఆశలు చూపి తమవెంట రావాలని టీఆర్ఎస్ నేతలు నీచపు రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి, బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని రామన్నపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ రాజకీయ నాయకులకు వెళగట్టి తీసుకెళ్లి కండువాలు కప్పే నీచపు సంస్కృతి ఇప్పుడే చూస్తున్నామని దుయ్యబట్టారు. 

కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఇస్తామన్న నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. 2018లో నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి యువత ఓట్లు కొళ్లగొట్టారని గుర్తు చేశారు.  హామీ నెరవేర్చి ఉంటే ఇప్పటికే రూ  80-90 వేలు వాళ్ల ఖాతాలో జమ అయ్యేవని చెప్పారు.  

ఇప్పుడు డబ్బుకు ఓట్లు వేస్తారనే చిల్లర ఆలోచనతో కేసీఆర్ ఉన్నారన్న ఈటల కొడంగల్, నారాయణఖేడ్, హుజుర్ నగర్, నాగార్జున సాగర లో ఇలాగే మీరు గెలవచ్చు కానీ.. ఇక్కడ సాధ్యం కాదని స్పష్టం చేశారు. అవసమైతే మీకే ఐదువేలు, లిక్కరు బాటిల్ మా ప్రజలు ఇస్తారు తప్ప.. తమ ఆత్మను అమ్ముకోరని భరోసా వ్యక్తం చేశారు. ఈ విషయం ఈనెల 30న తేలుతుందని ఈటల ఆశాభావం వ్యక్తం చేశారు.

మీరు ఇస్తే డబ్బులు తీసుకుంటారు కావచ్చు కానీ.. మీకు మాత్రం ఓటు వేయరని ఆయన తేల్చి చెప్పారు.  దసరాకు సీసాతో పాటు,  మూడు కుటుంబాలకు ఓ గొర్రెపిల్ల ఇస్తారట..పండుగ ఖర్చు కోసం రూ 500 నుంచి 2 వేలు ఇస్తారట. . తర్వాత ఓటుకు రూ 20 వేల నుంచి 50 వేలు ఇస్తారట.. ఇస్తే తీసుకొండి అని రాజేందర్ ఓటర్లకు సలహా ఇచ్చారు. 

అవి కేసీఆర్ భూమి అమ్మినవో, చెమటోడ్చి సంపాదించిన డబ్బులో కాదని..అవి మన డబ్బులే అని చెప్పారు. అక్రమంగా కూడబెట్టి మళ్లీ మనకే పంపిస్తున్నారని తెలిపారు.  కానీ దుర్మార్గంగా తెల్లబట్టలో పసుపు పెట్టి ప్రమాణం చేయించుకుంటారని.. ఆ పని మాత్రం చేయకండని హెచ్చరించారు. 

“నేను ఏమీ అభివృద్ధి చేయలేదట. మీకు ఆ పనులు తెలుసు కదా?” అని ప్రజలను అడిగారు. 5 నెలల 15 రోజులుగా కొట్లాడుతున్నానాని చెబుతూ  ఎన్నికల్లో నెల రోజులకే దమ్ము వస్తుందని.. కానీ కేసీఆర్ డబ్బులతో, అధికార యంత్రాంగంతో మనం పెనుగులాడుతున్నామని పేర్కొన్నారు.  చావనైనా చస్తా కానీ కేసీఆర్ కు లొంగుపోను అని స్పష్టం చేశారు. 

“వెయ్యి కోట్లు ఖర్చు చేసినా.. మీరెన్ని పథకాలు ఇచ్చినా.. నీవు మోకాళ్ల మీద నడిచినా ఇక్కడి ప్రజలు మీకు ఓట్లు వేయరన్నారు. మా వాళ్లకు అంత తెలివి లేదనుకుంటున్నావా? ఇక్కడికి వచ్చే ప్రచారం చేసే ఎమ్మెల్యేలను.. ఇక్కడ అమలయ్యే పథకాలు, పనులు జరుగుతున్నాయా?” అని కేసీఆర్ ను ప్రశ్నించాలని ఆయన పిలుపిచ్చారు.  

కేసీఆర్ ప్రగతి భవన్ లో కూర్చుని జీవోలు, డబ్బు సంచులు హరీశ్ రావుకు ఇస్తున్నాడని..  కత్తి కూడా హరీశ్ రావుకు ఇచ్చి మనల్ని పొడవమని పంపించాడని ధ్వజమెత్తారు. నాయకులకు బుద్ధి చెప్పే రోజు ఈనెల 30 అని చెప్పారు.  వీళ్లెంత లంగమాటలు మాట్లాడుతున్నారో మనకు అర్థమై కూడా వాళ్ల మాటలు విందామా? అని ప్రశ్నించారు. 

ఊసరవెళ్లులంతా ఒకవైపు.. ధర్మాన్ని నమ్ముకునేవాళ్లంతా ఒకవైపు ఉండి కేసీఆర్ అహంకారాన్ని దెబ్బకొట్టాలని ఈటెల కోరారు. లేకుంటే పిల్లలకు ఉద్యోగాలురావని., వడ్లు కొననంటున్నాడని హెచ్చరించారు. “నేను రాజీనామాచేసి హుజురాబాద్ లో దెబ్బకొడితే.. మీకు ఎన్నో పథకాలు వచ్చాయి.   రేపు నేను గెలిస్తే… నీ నిరంకుశత్వం, నీ అహంకారం నాశనమైపోతుంది” అని తెలిపారు.  

“మీ మీద ప్రేమతో ఇవన్నీ ఇవ్వడం లేదు. నేను అసెంబ్లీలో కనిపించకూడదన్ననీచమైన కుట్ర ఇదంతా” అని హెచ్చరించారు. నేనేం తప్పు చేశానని.. పేద ప్రజల తరపున కొట్లాడేవాన్ని నేను అని తెలిపారు. ఉద్యమ సమయంలో పులిబిడ్డలా కొట్లాడానని.. రాబోయే రోజుల్లో కొట్లాడుతానని కేసీఆర్ భయపడుతున్నాడని తెలిపారు. 

మీ కుటుంబ పాలన ఇక కొనసాగే అవకాశం లేదని.. మీ కుటుంబపాలన, పద్ధతి నచ్చడం లేదని, 2023లో మీ పార్టీ గెలవదని ఆయన కేసీఆర్ కు స్పష్టం చేశారు.  అంతకంటే ముందు  జరిగే హుజురాబాద్ ఎన్నికల్లో తనను ఆశీర్వదించండని ప్రజలను ఈటెల కోరారు.