టీఆర్ఎస్ తండ్రి కొడుకుల పార్టీ

ఇప్పుడున్నది టీఆరెస్ పార్టీ కాదని, అది తండ్రి కొడుకుల పార్టీ అంటూ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై విమర్శలు గుప్పించారు. హనమకొండ జిల్లా కమలాపూర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎంతో మంది డిగ్రీలు చదువుకుని చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో 70 శాతం కేసీఆర్ వ్యతిరేక ఓట్లు పడ్డాయని చెబుతూ అక్కడ చాలా ఓట్లు బోగస్ ఓట్లు నమోదయ్యాయని తెలిపారు. ఇప్పుడు కేసీఆర్ ను అభిమానించే వారి సంఖ్య 20 శాతం లోపేనని చెబుతూ ప్రస్తుతం ఉపఎన్నికలు జరుగుతున్న హుజురాబాద్ లో టీఆరెస్ కు  ఓటు బ్యాంకు లేదని స్పష్టం చేశారు.  ఇక్కడ జరుగుతున్నది కేసీఆర్, ఈటల మధ్య జరుగుతున్న యుద్ధమని చెబుతూ డబ్బుతో మద్యం సీసాలతో ఓట్లు సంపాదించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ వల్లనే దళిత బంధు వచ్చిందని  విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు.

కేసీఆర్ ప్రభుత్వం  లక్షల కోట్లు అప్పులు చేసినా ఎవరికి లాభం జరుగుతోందో అర్థం కావడం లేదని విచారం వ్యక్తం చేశారు. తమ చేవేళ్ల ప్రాంతానికి సాగునీరు రాలేదని గుర్తు చేశారు. దీనికి సంబంధించి ఎన్నెన్నో అబద్ధాలు చెప్పారని విమర్శించారు. ఓడిపోయే చోటికి యువరాజ కేటీఆర్ ను పంపరని అంటూ అందుకే దుబ్బాకకు కూడా పంపించలేదని ఎద్దేవా చేశారు.  హుజురాబాద్ కు కేటీఆర్ వచ్చి ప్రచారం చేసే ధైర్యం ఉందా? అని ఆయన సవాల్ చేశారు.  ఎన్నికల్లో ఓడిపోతే మిత్రుడు హరీశ్ రావుపై ఓటమి భారం వేస్తారని తెలిపారు.

తెలంగాణను అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్ దే అంటూ  తెలంగాణలో నియంత పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. ఎన్ని డబ్బులు పెట్టినా,  మద్యం పోసినా ఈటలకే తమ ఓటు అని ఇక్కడి జనం చెబుతుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ హుజురాబాద్ కే పరిమితం కాదని, రాష్ట్ర వ్యాప్తంగా అయన సేవలు అవసరం అని స్పష్టం చేశారు. హుజురాబాద్ లో తమకు సంబంధించి 20 బృందాలు  పార్టీలకు అతీతంగా సర్వే చేస్తూ ప్రచారం చేస్తున్నామని తెలిపారు.