కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ఈ నెల 14 నుంచి అమల్లోకి వస్తున్నట్లు కృష్టా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ప్రకటించింది. రెండో షెడ్యూల్‌లోని అన్ని డైరెక్ట్ అవుట్ లెట్లను బోర్డు పరిధిలోకి తీసుకోనున్నట్లు కేఆర్‌ఎంబీ తెలిపింది.
ఈ నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జుసాగర్ ప్రాజెక్టుల అన్ని డైరెక్ట్ అవుట్‌లెట్లు బోర్డు పరిధిలోకి వెళ్లనున్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య మంగళవారం జరిగిన కృష్ణా యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) సమావేశం ముగిసిన అనంతరం ఈ విషయాన్ని కేఆర్‌ఎంబీ ప్రకటించింది. అవుట్‌లెట్ల అప్పగింతకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకు రావాలని కేఆర్‌ఎంబీ కోరింది.
కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ అమలు నేపథ్యంలో మొదటి దశలో ఐదు ప్రాజెక్టుల పరిధిలోని 29 కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకోవడానికి అవకాశం ఉన్నట్లు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం గుర్తించింది. మిగిలిన చోట్ల రెండు రాష్ట్రాలకు కొన్ని అభ్యంతరాలుండటం వల్ల ప్రస్తుతానికి వీలు కాదని పేర్కొంది.
ప్రాజెక్టుల వారీగా సిబ్బంది, కార్యాలయాలు, యంత్రాలు, పరికరాలు ఇలా అన్ని అంశాలపై సమగ్రంగా ముసాయిదా తయారు చేసింది.కృష్ణా, గోదావరి బోర్డులకు సంబంధించి కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలుపై రెండు బోర్డులూ రెండు ఉపసంఘాలను నియమించాయి.
మరోవైపు తెలంగాణకు కృష్ణా జలాల్లో వాటా కేటాయించే వరకు గెజిట్ నోటిఫికేషన్ ఆపాలని తెలంగాణ సాగునీటిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ కోరారు. జలసౌధలో మంగళవారం జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల శాఖ అధికారులు హాజరయ్యారు.
కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ అమలుపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చే అంశంతో పాటు ఉప సంఘం నివేదికపై కృష్ణా బోర్డు సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా రజత్ కుమార్ మాట్లాడుతూ.. కృష్ణా పరిధిలో 65 కేంద్రాలు గెజిట్ నోటిఫికేషన్‌లో ఉన్నాయని వివరించారు. నాగార్జున సాగర్‌పై 18, శ్రీశైలంపై 12 కేంద్రాలు ఇవ్వాలని బోర్డు ప్రతిపాదించిందని తెలిపారు.
విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కోరిందని, దీనిపై తాము అభ్యంతరం తెలిపామని చెప్పారు. తమకు విద్యుత్ ఉత్పత్తి చాలా అవసరమని చెప్పామని వెల్లడించారు. ప్రాజెక్టు యాజమాన్య హక్కుల విషయమై న్యాయ సలహా అడిగామని రజత్ కుమార్ వివరించారు.
More Stories
ఇన్కాయిస్కు సుభాష్ చంద్ర బోస్ పురస్కారం
20 మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం?
తెలంగాణకు రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులు