ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌ మూకుమ్మడి రాజీనామా

టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ `మా’ ఎన్నికలు పూర్తయినా చెలరేగిన వివాదాలు ఇంకా ఆగడం లేదు. పరస్పరం ప్రత్యారోపణలు చేసుకొంటూనే ఉన్నారు. అధ్యక్ష పదవికి  మంచు విష్ణుపై ఓటమి పాలైన ప్రకాశ్ రాజ్ అసోసియేషన్‌లో తన సభ్యత్వానికి ఇప్పటికే రాజీనామా చేయగా, తాజాగా తన ప్యానెల్‌ నుంచి ఎన్నికల్లో గెలిచిన 11 మంది తమ  పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
 
తమ ప్యానెల్ నుంచి గెలిచిన సభ్యులు అక్కడ పని చేయగలమా? అని సందేహాలు లేవనెత్తారని, వివాదాలతో  ‘మా’ సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయి.. మళ్లీ గొడవల్లోనే ఉండిపోతుందా? అని ప్రశ్నలు వచ్చాయని చెప్పారు. ఈ 11 మంది అక్కడ ప్రశ్నించడం వల్ల ‘మా’ సంక్షేమం ఆగిపోతాయేమోనని కూడా అనిపిస్తోందని తెలిపారు. 
 
అందుకే “వచ్చే రెండు సంవత్సరాల్లో మంచు విష్ణు బాగా పని చేయాలి. ఆయన పెద్ద హామీలు ఇచ్చారు. దానికి అడ్డురాకూడదు. ‘మా’ సంక్షేమం కోసం సినిమా బిడ్డల ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది రాజీనామా చేస్తున్నారు” అని ప్రకాష్ రాజ్ వెల్లడించారు. ఏ సంస్థ అయినా నిర్మాణాత్మకంగా ముందుకెళ్ళాలంటే, అందరి ఆలోచనలు, ఆచరణలు, ఒకేలా ఉండటం అవసరమని ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు తెలిపారు.  అప్పుడే సంస్థ సజావుగా, ఆరోగ్యంగా, సభ్యుల శ్రేయస్సు దిశగా నడిచే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. 
 
గత రెండేళ్లలో నరేష్ “మా” అధ్యక్షులుగా ఉన్న సమయంలో, తానే వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం, అంతా తానే ముందు ఉండి “మా” కోసం ఏ పని జరగనివ్వని స్థితికి తీసుకువచ్చారని మండిపడ్డారు. జరిగిన గొప్ప పనులపై కూడా బురద చల్లారని గుర్తు చేశారు.
 
ఈసారి జరిగిన ఎన్నికలలో విష్ణు ప్యానల్ నుంచి కొందరు, ప్రకాష్ రాజ్  ప్యానెల్ నుంచి కొందరు గెలవడం జరిగిందని, మళ్లీ తమలో తమకు భిన్న అభిప్రాయాలు వచ్చే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. సహజంగా ప్రశ్నించే వ్యక్తిత్వం ఉన్న తాము  అడగకుండా ఉండలేమని స్పష్టం చేయారు. 
 
అందుకనే “మా” సంస్థని విష్ణు ప్యానల్ వ్యక్తులే నడిపితే మా సభ్యులకు మంచి జరగవచ్చు అనే ఆశతో, ఉద్దేశ్యంతో, తాము  “మా” పదవులకు రాజీనామా చేస్తున్నామని ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు తెలిపారు. 
 
 ఎలక్షన్‌లో చాలా రౌడీయిజం 
 
 కాగా, ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ కూడా జరిగిందని, చాలా రౌడీయిజం జరిగిందని, పోస్టల్ బ్యాలెట్‌లో అన్యాయం జరిగిందని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. అయినా ఎన్నికను ఆపొద్దని అనుకున్నామని చెప్పారు. ఎక్కడెక్కడి దూరం నుంచి మనుషులను తీసుకొచ్చారని, మోహన్ బాబు గారు వచ్చి కూర్చున్నారని, పైగా అయిన సీనియర్ నటుడైన బెనర్జీ మీద చేయి చేసుకొని అసభ్య పదజాలాన్ని వినియోగించారని విమర్శించారు. 
 
ఆ రాత్రికి ఈసీ రిజల్ట్స్‌ను పక్కనబెట్టారని, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో లెక్కలు మారాయని, ముందు రోజు గెలిచిన వారిని తర్వాతి రోజు ఓడిపోయారనడంతో ఆశ్చర్యం వేసిందని తెలిపారు.  అందరినీ కలుపుకుని పోదామని అంటూనే జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ పోస్టులు తమ ప్యానెల్‌కే వచ్చాయని విష్ణు అనడం తమల్ని బాధించాయని చెప్పారు. ఆ మాటలతో కలుపుకుని పోయే పరిస్థితి కనిపించడం లేదని స్పష్టం చేశారు. 
 
ఇలా ఉండగా, బైలాస్‌ను మార్చకుండా తెలుగేతర నటులకు ‘మా’లో పోటీ చేసే అవకాశాన్ని అలాగే ఉండనిస్థానని  విష్ణు  హామీ ఇస్తే `మా’కు తన రాజీనామాను ఉపసంహరించుకుంటానని ప్రకాష్ రాజ్ తెలిపారు.