95 కోట్ల టీకా డోసుల మైలురాయి చేరుకున్న భారత్‌

కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్‌ మరో మైలురాయిని అందుకున్నది. భారతదేశంలో ఇప్పటివరకు 95 కోట్లకు పైగా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌లను అందించారు. ప్రభుత్వం సాధించిన ఈ విజయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదివారం ట్విట్టర్‌లో పంచుకున్నారు. 

త్వరలోనే కొత్త మైలురాయి 100 కోట్ల వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.మన దేశంలో కరోనా టీకాలు ఆదివారం వరకు 95 కోట్లకు పైగా మందికి అందించారు.

‘ప్రపంచంలో అతిపెద్ద విజయవంతమైన వ్యాక్సినేషన్ డ్రైవ్ పూర్తి స్థాయిలో కొనసాగుతున్నది. భారతదేశం 95 కోట్ల కరోనా టీకా డోస్‌ల అందివ్వడం పూర్తి చేసింది. 100 కోట్ల టీకా  డోస్‌లను అందించే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. త్వరగా టీకాలు తీసుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులను కూడా ఆ విధంగా ప్రోత్సహించండి’ అని మాండవీయ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

టీకాలు వేయడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 8,28,73,425 డోసులు బ్యాలెన్స్, ఉపయోగించని టీకా మోతాదులు అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా టీకా ప్రక్రియను వేగవంతం చేయడానికి, విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.