కాశ్మీర్ లో ఇద్దరు ఉగ్రవాదుల హతం, 700 మంది నిర్బంధం

జమ్ముకశ్మీర్‌లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బందిపొరా జిల్లాలోని గుంద్‌జహంగిర్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ గుర్తు తెలియని ఉగ్రవాది హతమయ్యాడు. 

గుంద్‌జహంగిర్‌ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. అతడు ఏ సంస్థకు చెందినవాడనే విషయం ఇంకా తెలియరాలేదని చెప్పారు. ముష్కరుల కోసం గాలింపు ఇంకా కొనసాగుతున్నదని వెల్లడించారు.

మరో ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. సోమవారం తెల్లవారుజామున అనంత్‌నాగ్‌ జిల్లాలోని వెరినాగ్‌ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అయితే ముష్కరుల కాల్పుల్లో నలుగురు పోలీసులు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు.

మరోవంక, జమ్ముకశ్మీర్‌లో 700 మందికిపైగా వ్యక్తులను భద్రతా దళాలు నిర్బంధించాయి. ఉగ్రవాదులు పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపిన ఘటనల్లో గత ఆరు రోజుల్లో కశ్మీర్‌ పండిట్లు, సిక్కు, ముస్లిం మతానికి చెందిన ఏడుగురు హత్యకు గురయ్యారు. ఒక స్కూల్‌ ప్రిన్సిపల్‌, ఇద్దరు టీచర్లు, ఒక ఫార్మసిస్ట్‌, ట్యాక్సీ డ్రైవర్‌, బీహార్‌కు చెందిన ఒక వీధి వ్యాపారి మరణించిన వారిలో ఉన్నారు.

ఉగ్రవాదులు వరుసగా పౌరులను లక్ష్యంగా చేసుకొన్న నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం, భద్రతా సంస్థలకు చెందిన ఉగ్రవాద నిరోధక ప్రత్యేక నిఫుణులను శ్రీనగర్‌కు పంపింది. దీంతో గత కొన్ని రోజులుగా ఉగ్రవాదులకు మద్దతిచ్చే, సహకరించే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. 

ఆదివారం నాటికి భద్రతా దళాలు నిర్బంధించిన వారి సంఖ్య 700కుపైగా పెరిగింది. నిషేధిత జమాతే-ఇ-ఇస్లామీ, ఉగ్రవాదుల కార్యకలాపాలకు సహకరించే అనుమానిత వ్యక్తులు ఇందులో ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

కాగా, కశ్మీర్‌ లోయలో జరుగున్న వరుస ఉగ్రదాడుల గొలుసును బ్రేక్‌ చేసేందుకు ఈ మేరకు అనుమానిత వ్యక్తులను భారీ స్థాయిలో అదుపులోకి తీసుకున్నట్లు ఒక సీనియర్‌ పోలీస్‌ అధికారి తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు తమ నియంత్రణలోకి తెచ్చుకున్న అనంతరం జమ్ముకశ్మీర్‌లో రాడికలిజం ఊపందుకున్నదని, దీంతో పౌరుల లక్ష్యంగా ఉగ్రదాడులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. దీనిని అరికట్టేందుకు ప్రత్యేక భద్రతా దళాలు రంగంలోకి దిగినట్లు వెల్లడించారు.