జమ్ముకశ్మీర్‌లో 16 చోట్ల ఎన్‌ఐఏ దాడులు

జమ్ముకశ్మీర్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ముమ్మరంగా దాడులు జరుపుతున్నది. ఆదివారం జమ్ముకశ్మీర్‌లోని 16 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ దాడులు జరిపింది. ‘వాయిస్ ఆఫ్‌ హింద్‌’ ప్రచురణ సంస్థ కార్యాలయాలు, ఐఈడీల రికవరీకి సంబంధించి ఈ దాడులు జరిపినట్లు తెలుస్తున్నది. 

జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్, అనంతనాగ్, కుల్గామ్, బారాముల్లాలోని 9 ప్రదేశాల్లో దాడులు చేసింది. హసన్ రోడ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో డ్రైవర్ అయిన నయీమ్ అహ్మద్ భట్, నంద్ సింగ్ చత్తబాల్‌లోని ముస్తాక్ అహ్మద్ దార్ ఇంటిపై కూడా దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానితుల నుంచి ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

వాయిస్‌ ఆఫ్‌ హింద్‌ అనే ఆన్‌లైన్ మంథ్లీ మ్యాగజైన్ యాజమాన్యం పత్రికల ద్వారా లోయలోని ముస్లిం యువకులను ఉగ్రవాదం వైపు వచ్చేలా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది జూలై 11 న జమ్ముకశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో ఎన్‌ఐఏ తనిఖీలు చేపట్టింది. ఈ సమయంలో ముగ్గురు నిందితులు ఉమర్ నిసార్, తన్వీర్ అహ్మద్ భట్, రమీజ్ అహ్మద్ లోన్‌లను అరెస్టు చేశారు. 

వీరు అనంతనాగ్ జిల్లాలోని అచబల్ ప్రాంత నివాసితులు. కర్ణాటకలోని భత్కల్‌లో రెండు చోట్ల దాడులు చేసింది. ప్రధాన నిందితుడైన జుఫ్రీ జవహర్ దముడిని ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నది. పౌరులపై ఉగ్రవాద దాడుల తర్వాత జమ్ముకశ్మీర్ పోలీసులు గత ఒక్క వారంలోనే లోయ నుంచి 570 మందిని అదుపులోకి తీసుకున్నారు.