ఉగ్ర దాడుల‌పై క‌శ్మీరీ పండిట్ల నిర‌స‌న‌ !

దేశ రాజ‌ధాని ఢిల్లీలోని జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద క‌శ్మీరీ పండిట్లు శ‌నివారం నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న జ‌రిపారు. క‌శ్మీర్ లోయ‌లో మైనారిటీలైన క‌శ్మీరీ పండిట్ల‌పై ఇటీవ‌లి ఉగ్ర‌వాదుల దాడుల‌కు వ్య‌తిరేకంగా ఈ నిర‌స‌న తెలిపారు. 1990 నుంచి క‌శ్మీరీ పండిట్ల మార‌ణ హోమం సాగుతున్న‌దని, కానీ దాన్ని నిలువ‌రించే వారు లేర‌ని ఆందోళ‌న‌కారులు వాపోతున్నారు. క‌శ్మీరీ పండిట్ల కోసం ప్ర‌త్యేకంగా కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పాటు చేయాల‌ని నిర‌స‌న‌కారులు డిమాండ్ చేస్తున్నారు.

క‌శ్మీర్ నుంచి పండిట్ల సామూహిక వ‌ల‌స‌ల‌పై ద‌ర్యాప్తు చేయాల‌ని, తమకు న్యాయం చేయాల‌నిప్లే కార్డులు ప్ర‌ద‌ర్శించారు. “నా ఇల్లు ఎక్క‌డ‌?, అమాయ‌క పండిట్ల‌ను హ‌త్య‌చేసిన వారికి క‌ఠినంగా శిక్షించాలి” వంటి డిమాండ్ల‌తోకూడిన ప్లే కార్డులు చేబూని నిర‌స‌న తెలిపారు. ‘వందేమాతరం’, ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు మార్మోగాయి. “మాకు న్యాయం కావాలి”, “పాకిస్తాన్ హే హాయ్” నినాదాలు కూడా చేశారు.

మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని తాజాగా ఉగ్రవాదులు దాడులు చేస్తూ, కాశ్మీర్ ప్రజల మధ్య చీలిక తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాశ్మీర్ లోయలోకి తిరిగి వస్తున్న హిందువులలో భయాందోళనలు కలిగించడం కోసమే ఇటువంటి ఉగ్రదాడులు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కూడా తాజా ఉగ్రదాడుల పట్ల ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి.  కాశ్మీర్‌లో కాశ్మీర్ లో తాజా ఉగ్రదాడుల పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ  దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.  3500 ప్రదేశాలలో నిరసన  ప్రదర్శనలు జరిపారు. భారతదేశంలో ఇస్లామిక్ తీవ్రవాదంను తుదముట్టిస్తామని హెచ్చరించారు.

 జమ్మూ-కశ్మీరులో మైనారిటీలైన హిందువులు, సిక్కులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద దాడులు జరుగుతుండటంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. కశ్మీరు లోయ నుంచి వెళ్ళిపోయేందుకు హిందువులు, సిక్కులు సిద్ధమవుతున్నారు. కొన్ని కశ్మీరీ పండిట్ కుటుంబాలు శుక్రవారం లోయ నుంచి ఇతర ప్రాంతాలకు వలస పోయాయి. 

గతంలో ఉగ్రవాద దాడుల భయంతో ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయిన కశ్మీరీ పండిట్లను తిరిగి తీసుకొచ్చేందుకు బుడ్గాం జిల్లాలోని షేక్‌పొరలో 2003లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కశ్మీరు లోయకు తిరిగి వచ్చిన పండిట్ల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు.

దీంతో తమ జీవితాలను చక్కదిద్దుకోగలమని వీరంతా ఆశించారు. కానీ తాజా ఉగ్రవాద దాడులతో ఈ ప్రాంతం నుంచి పదుల సంఖ్యలో కశ్మీరీ పండిట్ కుటుంబాలు శుక్రవారం వలస వెళ్ళిపోయాయి. పాకిస్థాన్ మద్దతుగల తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి కశ్మీరు లోయలో ఉగ్రవాదులు కశ్మీరీ పండిట్లు, సిక్కులను హత్య చేస్తున్నారు.

ఈ హత్యాంకాండ నేపథ్యంలో తాము కాలనీ నుంచి బయటకు అడుగు పెట్టలేకపోతున్నామని కశ్మీరీ పండిట్లు చెప్తున్నారు. కాలనీలో తగిన భద్రత ఉంటోందని, అయితే అన్ని వేళలా ఇళ్లలోనే ఉండటం సాధ్యం కాదని, కార్యాలయాలకు వెళ్ళవలసి ఉంటుందని, ఉగ్రవాదులు ఎప్పుడు విరుచుకుపడతారోనని భయంగా ఉందని చెప్తున్నారు.

కశ్మీరీ పండిట్ సంఘర్ష్ సమితి అధ్యక్షుడు సంజయ్ టికు మీడియాతో మాట్లాడుతూ, బుడ్గాం, అనంత్‌నాగ్, పుల్వామా తదితర ప్రాంతాల నుంచి దాదాపు 500 మంది కశ్మీరీ పండిట్లు వలస పోతున్నారని చెప్పారు. 1990 నాటి దుస్థితి మళ్ళీ వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్‌కు తమ గోడు వినిపించేందుకు జూన్‌లో అపాయింట్‌మెంట్ అడిగామని, ఇప్పటి వరకు తమకు అపాయింట్‌మెంట్ దొరకలేదని చెప్పారు.